మహిళలంటే గౌరవంతోనే కమిషన్‌ ముందుకు వచ్చా

యథాలాపంగా అన్న మాటకు ఇప్పటికే క్షమాపణ కోరా.. మా పార్టీ మహిళ నేతలపై మహిళా కాంగ్రెస్‌ నాయకులు దాడి చేశారు : కేటీఆర్‌

మహిళలంటే గౌరవంతోనే కమిషన్‌ ముందుకు వచ్చా
X

మహిళలంటే తనకు ఎనలేని గౌరవముందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇటీవల పార్టీ సమావేశంలో తాను చేసిన వ్యాఖ్యలకు మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చిందని, ఈరోజు మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ ను కలిసి వివరణ ఇచ్చానని తెలిపారు. మహిళ కమిషన్‌ చైర్‌ పర్సన్‌ నేరెళ్ల శారదను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. యథాలాపంగా తాను చేసిన వ్యాఖ్యలకు ఇది వరకే క్షమాపణలు కోరానని తెలిపారు. మహిళలపై తనకు అపారమైన గౌరవం ఉందన్నారు. చట్టమన్నా, రాజ్యాంగబద్ద సంస్థలన్న తనకు గౌరవముందని, అందుకే స్వయంగా హాజరై తన సమాధానం ఇచ్చానని చెప్పారు. రాజకీయాల్లో హుందాతనం ఉండాలని... ఒక్కోసారి మాట దొర్లితే క్షమాపణ చెప్పే సంస్కారం ఉండాలన్నారు. తాను మహిళా కమిషన్ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ మహిళా నేతలు హంగామా సృష్టించే ప్రయత్నం చేశారని అన్నారు. తనకు సంఘీభావంగా వచ్చిన బీఆర్ఎస్ మహిళ నాయకులపై మహిళ కాంగ్రెస్‌ నాయకులు దాడికి దిగారని, ఇలాంటి ఘటనలను కూడా కాంగ్రెస్ నాయకులు రాజకీయం చేస్తున్నారని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల్లో మహిళలపై అకృత్యాలు భారీగా పెరిగిపోయాయన్నారు. గత 8 నెలల్లో జరిగిన సంఘటనల వివరాలతో కమిషన్ కు ఫిర్యాదు చేసే ప్రయత్నం చేశారు. అయితే మరోసారి వచ్చి ఫిర్యాదు చేయాలని కమిషన్ కోరటంతో మళ్లీ వచ్చి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. తాను ఇచ్చిన సమాధానంపై కమిషన్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలన్నారు. తమ పార్టీ నాయకులపై కాంగ్రెస్ మహిళా నేతలు చేసిన దాడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేటీఆర్‌ మాట దొర్లడంతో క్షమాపణ చెప్పి తన హుందాతనాన్ని చాటుకున్నారని ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ అన్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం మహిళా ఎమ్మెల్యేలను నిండు సభలో అవమానించారని, ఈరోజు కాంగ్రెస్‌ నేతలను ఇక్కడికి పంపి తమ పార్టీ మహిళ నాయకులపై దాడి చేయించారని తెలిపారు. కేటీఆర్‌ కు మహిళలంటే ఎంతో గౌరవం ఉందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహిళల ఎమ్మెల్యేలను అవమానించినందుకు, మహిళ జర్నలిస్టులపై దాడి చేసినందుకు సీఎం రేవంత్‌ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Next Story