హామీల ఎగవేతకు బైపాస్‌ కేబినెట్‌ సబ్‌ కమిటీ!

ఒక్క కమిటీ రిపోర్ట్‌ ఇయ్యలే.. ఒక్క హామీ పట్టాలెక్కలే

హామీల ఎగవేతకు బైపాస్‌ కేబినెట్‌ సబ్‌ కమిటీ!
X

అధికారం చేజిక్కించుకోవడానికి అడ్డగోలు హామీలిచ్చిన కాంగ్రెస్‌ పార్టీ గద్దెనెక్కిన తర్వాత వాటిని జాప్యం చేయడానికి కేబినెట్‌ సబ్‌ కమిటీలను అస్త్రంగా మలుచుకుంది. హామీల ఎగవేతకు బైపాస్‌ లేన్‌గా ఈ సబ్‌ కమిటీలను ఎంచుకుంది. ఎన్నికలకు ముందు ''మా దారి రహదారి'' అంటూ రజనీకాంత్‌ లెవల్‌ లో డైలాగులు చెప్పిన సీఎం రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ పెద్దలు.. ఇప్పుడు చంద్రముఖిలుగా మారి ''లకలకలక'' అంటూ ఒకసారి భయపెడుతున్నారు.. వాళ్లను ఆవహించిన చంద్రముఖి వీడిపోయాకా.. ఇంతవరకు ఏం జరిగింది అన్నట్టుగా అమాయకత్వం ప్రదర్శిస్తున్నారు. ఈ పంచరంగుల రీల్‌ను చూసి తమ కళ్ల ముందు ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిది నెలల్లో పది కేబినెట్‌ సబ్‌ కమిటీలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర కేబినెట్‌ లో సీఎం సహా ఉన్నదే 12 మంది. ఒక్కొక్కరికి రెండు మూడు అంతకన్నా ఎక్కువ శాఖలే ఉన్నాయి. ఆయా మంత్రిత్వ శాఖల్లో ఏం జరుగుతుందో చూసుకోవడానికే వాళ్లకు సరిపోతుంది. మీది నుంచి కేబినెట్‌ సబ్‌ కమిటీల బాధ్యతలు. తడిసి మోపెడవుతున్న ఈ భారాన్ని డీల్‌ చేయడం మంత్రులకు కొంత కష్టంగా ఉన్నట్టు వారి సన్నిహితుల మాటలను బట్టి తెలుస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి గెలుపునకు ప్రధాన కారణం ఆరు గ్యారంటీలు.. 420 హామీలు. ఆ హామీలన్నీ నెరవేర్చాలంటే రాష్ట్ర బడ్జెట్‌ ఇమీడియట్‌ గా డబుల్‌ అయినా సాధ్యం కాదు. ఆ విషయం హామీలిచ్చే ముందే కాంగ్రెస్‌ లీడర్లకు తెలుసు. ముందైతే చెప్పేద్దాం.. అధికారంలోకి వచ్చాకా ఎలాగోలా ఎగ్గొట్టడమే కదా అనే ధోరణితోనే ప్రజలను నమ్మించారు. ప్రజలు నమ్మి కాంగ్రెస్‌ కు అధికారాన్ని కట్టబెట్టారు. గ్యారంటీలు, హామీలు నెరవేర్చక తప్పని పరిస్థితి తలెత్తింది. బడ్జెట్‌ సపోర్ట్‌ చేయదు. నమ్మిన బడే భాయ్‌ మోదీ నెత్తిన చేతులు పెట్టేశాడు. ఇంకేం చేస్తాం.. ఏదోలాగా వాటి అమలుకు ఆలస్యం చేయాలి. అందుకు తమ ముందున్న ఒకే ఒక్క ఆప్షన్‌ కేబినెట్‌ సబ్‌ కమిటీ. జాప్యం చేయడానికి కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేశారనే భావన ప్రజలకు కలిగితే అది మొదటికే మోసం తెస్తుంది. ఆ ముచ్చట సీఎం రేవంత్‌ రెడ్డికి, కాంగ్రెస్‌ పెద్దలకు తెలుసు. అందుకే అనర్హులకు సంక్షేమ పథకాలు అందకూడదు.. పకడ్బందీగా పథకాల అమలు చేసేందుకు గైడ్‌ లైన్స్‌ రూపొందించడానికి కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పేశారు. కమిటీలు ఏర్పాటు చేయడమే తప్ప వాటి నుంచి ఔట్‌ కమ్‌ అనేది లేదు. ఆ కమిటీలు రిపోర్ట్‌ ఇస్తే వాటిని అమలు చేయాలి. అందుకు పైసలు కావాలి. ఖజానా చూస్తే జీతాలు, పింఛన్లు, అస్మదీయులకు బిల్లుల చెల్లింపులకే సరిపోతది. భూములు అమ్మితేనో.. కుదబెడితేనో.. అప్పులు తెచ్చుకుంటేనో తప్ప రుణమాఫీ లాంటి పథకాలను అరకొరగా కూడా అమలు చేయలేని పరిస్థితి. అందుకే కేబినెట్‌ సబ్‌ కమిటీలను రేవంత్‌ సర్కార్‌ బ్రహ్మాస్త్రాలుగా ఉపయోగించుకుంటోంది.

కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు కోసం ఈ ఏడాది జనవరి 8న కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేసింది. ఎనిమిది నెలలు గడిచింది. ఆ కమిటీ సిఫార్సులు ఏమయ్యాయో.. ఆరు గ్యారంటీలు ఎన్ని సంవత్సరాలకు అమలవుతాయో వాటిని ప్రకటించిన కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీకే తెలియని పరిస్థితి. జీవోలు 317, 46తో ఇబ్బంది పడుతున్న ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి ఫిబ్రవరి 26న మరో కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేసింది. ఆరు నెలలు గడిచింది. ఆ రెండు జీవోల బాధితులు ఇప్పటికీ రోడ్లపై ఆందోళనలు చేయడమే తప్ప వాళ్ల ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన కొత్తలో రైతుబంధు ఏదో ఇచ్చాం అనిపించారు. వానాకాలం సీజన్‌ లో తాము హామీ ఇచ్చిన రైతుభరోసా సాయం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఎకరానికి ఏటా రూ.15 వేల సాయం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలి. అందుకు పైసలు కావాలి.. అందుకే రైతుభరోసాకు ఎవరికి ఇవ్వాలో తేల్చడానికి ఒక సబ్‌ కమిటీ ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌ బాబు, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిలతో కూడిన ఈ సబ్‌ కమిటీ బడ్జెట్‌ సమావేశాల్లోపే (జూలై 15న) నివేదిక ఇస్తుందని.. దానిని అసెంబ్లీలో ప్రవేశ పెట్టి అందరి అభిప్రాయాలు తీసుకొని రైతులకు సాయం అందిస్తామని మొదట్లో చెప్పారు. అక్టోబర్‌ నాటికి కూడా ఈ హామీ పట్టాలెక్కే పరిస్థితి కనిపించడం లేదు.

రాష్ట్ర అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కోసం ఒక కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేశారు. ప్రస్తుత చిహ్నంలో రాచరికపోకడలకు ఆనవాళ్లు ఉన్నాయని.. వాటిని సమూలంగా మార్చేస్తామని స్వయంగా సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. ఒక లోగోను తమ అనుకూల మీడియా ద్వారా ప్రచారంలో పెట్టారు. ప్రజావ్యతిరేకత రావడంతో ఆ ప్రయత్నాలకు కాస్త బ్రేక్‌ ఇచ్చారు. ఆరు గ్యారంటీల్లో హామీ ఇచ్చిన మండలానికి ఒక ఇంటర్నేషనల్‌ స్కూల్‌, యువ వికాసంలో భాగంగా విద్యార్థులకు రూ.5 లక్షల విద్యాభరోసా కార్డు హామీలను అటకెక్కించడానికి రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేస్తామని చెప్తూ ఇంకో సబ్‌ కమిటీ ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే పేరుతో ఇంకో కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని ఇరిగేషన్‌ ప్రాజెక్టుల్లో పూడిక పేరుకుపోయిన నేపథ్యంలో జల వనరుల పరిరక్షణ కోసం కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఏ గ్యారంటీ, హామీ అమలు కావాలన్నా దానికి రేషన్‌ కార్డును ప్రమాణికంగా తీసుకుంటున్నారు. కొత్త రేషన్‌ కార్డుల జారీకి కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేశారు. కొత్త రేషన్‌ కార్డులతో పాటు ఆరోగ్య శ్రీ కార్డులకు జారీకి ఈ కమిటీ విధివిధానాలు నిర్దేశిస్తుంది అని తెలిపారు. ఈ కమిటీ ప్రాథమిక సిఫార్సులు కొత్త రేషన్‌ కార్డులను ఇచ్చేవి కాకుండా ఉన్న కార్డులను ఊడగొట్టేలా ఉన్నాయనే ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి. ధరణి పోర్టల్‌ లో సమస్యల పరిష్కారం కోసం ఎక్స్‌పర్ట్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సూచనల ఆధారంగా కొత్త రెవెన్యూ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ధరణిపై ఎక్స్‌పర్ట్‌ కమిటీ వేసినందుకే నివేదిక ఇచ్చారని.. అదే కేబినెట్‌ సబ్‌ కమిటీ అయితే ఆ రిపోర్టు ఎన్నేళ్లకు వచ్చేదోనని ప్రభుత్వంలోని వాళ్లే సెటైర్లు వేస్తున్నారు.

Next Story