ఇదీ రేవంత్‌ రుణమాఫీ కథ!

రుణమాఫీ పూర్తయిందన్న సీఎం.. రుణాల మాఫీ ప్రక్రియ పూర్తికాకముందే విపక్ష నాయకులు తొందరపడుతున్నారన్న మంత్రి

ఇదీ రేవంత్‌ రుణమాఫీ కథ!
X

పంద్రాగస్టులోగా రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని హరీశ్‌రావు ఆనాడు సవాల్ చేశారు. ఇప్పుడు రుణమాఫీ పూర్తయింది. ఆయన వెంటనే రాజీనామా చేయాలి. సిద్ధిపేటలో హరీశ్‌రావును ఓడించే బాధ్యత నాది. ఒకవేళ రాజీనామా చేయకపోతే అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాసి తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పాలి. ఆయన విసిరిన సవాల్ ను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాలి.

- వైరా సభలో ముఖ్యమంత్రి రేవంత్

రాష్ట్రంలో పంట రుణాల మాఫీ ప్రక్రియ పూర్తికాకముందే విపక్ష నాయకులు తొందరపడుతున్నారని, రైతులను అయోమయానికి గురిచేస్తు న్నారని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. రాష్ట్రంలో ఇప్పటికే రూ.2 లక్షల వరకు రుణాలను మాఫీ చేశామన్నారు. అంతకంటే ఎక్కువ అప్పు ఉంటే మిగిలిన మొత్తాన్ని చెల్లించిన తర్వాత వారి ఖాతాల్లో రూ.2 లక్షలు జమ చేస్తామని తెలిపారు. అర్హులై రుణమాఫీ వర్తించని వారు వ్యవసాయ అధికారిని సంప్రదించి రికార్డులు సమర్పిస్తే వారికీ వర్తింపజేస్తామన్నారు.

- శనివారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు

ముఖ్యమంత్రి, మంత్రి ప్రకటనలు చూస్తే రుణమాఫీ ప్రకటనల్లోనే పూర్తయ్యిందని తెలుస్తున్నది. ఏకకాలంలో రూ. 2 లక్షలు రుణమాఫీ చేస్తామన్న ముఖ్యమంత్రి మాటమార్చి మూడు విడతల్లో మాఫీ చేసి..అదీ అసంపూర్ణంగా మమా అనిపించారు. అందుకే మొదట రూ. లక్ష, రెండో విడతలో రూ. 1.5 లక్షలు, మూడో విడతలో రూ. 2 లక్షలు మొత్తంగా రూ. 17,933.19 కోట్ల నిధులు విడుదలయ్యాయని మంత్రి నిన్న ప్రకటించారు. సీఎంతో కార్యాలయం కూడా ఇదే విషయంపై జులై 16న ప్రకటన విడుదల చేసింది. పత్రికల్లో వచ్చింది. ముఖ్యమంత్రి , మంత్రి చెబుతున్నట్టు మూడు విడతల్లో సంపూర్ణంగా రుణమాఫీ కాలేదు. అనేక కొర్రీలు పెట్టి ప్రభుత్వం లక్షలాది మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టిందన్నది స్పష్టం. జులై 18 నుంచి ఆగస్టు 15 వరకు రుణమాఫీపై ముఖ్యమంత్రి, మంత్రుల ప్రకటనలు ఒక్కసారి చూస్తే ఏ ఒక్క దానికి పొంతన ఉండదు. బడ్జెట్‌ ప్రసంగం లెక్కనే అంకెల గారడీ చేసి రైతులను బురిడీ కొట్టించారు. అందుకే మాఫీ మోసంపై రైతులు రోడ్లపైకి వచ్చారు. ప్రధాన ప్రతిపక్షం ముఖ్యమంత్రిని నేరుగా సవాల్‌ చేసింది. తాను చెప్పిన టైం, తేదీ, ఊరు ఎక్కడికైనా వెళ్దామని అక్కడి రైతు వేదికల్లో రుణమాఫీ అయ్యిందని రైతుల అంటే రాజీనామా చేయడానికి సిద్ధమని కేటీఆర్‌, హరీశ్‌ రావులు సవాల్‌ విసిరారు.

ఇదే విషయంపై బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నిన్న శాసనసభ పక్ష కార్యాలయంలో మాట్లాడుతూ..60 లక్షల మందికి రూ. 49,500 కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉండగా..రూ. 22 లక్షల మంది రైతులకు 17,900 కోట్లు మాఫీ చేసి కాంగ్రెస్‌ పార్టీ చేతులు దులుపుకున్నదని ధ్వజమెత్తారు. రుణమాఫీ జరిగిందని ఏ ఒక్క గ్రామంలో రైతులు చెప్పినా రాజకీయ సన్యాసానికి సిద్ధమని, లేదంటే సీఎం రాజకీయ సన్యాసానికి సవాల్‌ చేశారు. రుణమాఫీ అంశాన్ని పక్కదారి పట్టించడానికి, స్థానిక సంస్థల్లో లబ్ధి పొందడానికే బీజేపీ, బీఆర్‌ఎస్‌ విలీనం అంటూ ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు

విపక్ష నేతల సూటి ప్రశ్నలకు, మాఫీ కాని రైతులకు సమాధానం చెప్పడానికి సీఎం సహా కాంగ్రెస్‌ నేతలెవరూ సిద్ధంగా లేరు. అందరూ ముఖం చాటేసి ప్రెస్‌మీట్లు పెడుతూ.. సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని వారు వ్యవసాయ అధికారిని సంప్రదించి రికార్డు సమర్పిస్తే వారికీ వర్తింపజేస్తామని అంటున్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం 5000 వేల ఎకరాలకు ఒక ఏఈవో (వ్యవసాయ విస్తరణ అధికారి) నియమించింది. వాళ్ల దగ్గర అన్ని వివరాలున్నాయి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆగస్టు 15 వరకు మొదటి రెండు విడతల్లో ఏదైనా కారణంతో రుణమాఫీ కాని వారివి క్లియర్‌ అయ్యేవి. కానీ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం బ్యాంకర్లు, వ్యవసాయ అధికారులు నడుచుకుంటున్నారు. కాబట్టి లక్షలాది మంది రైతులకు మాఫీ కాలేదన్నది తెలుస్తోంది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మొదటి నుంచి హడావుడి తప్పా ఎన్నికల్లో వాళ్లు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై సమీక్ష చేయలేదని, అవి అమలు కావాలంటే ఎంత కావాలన్నది వారికే తెలియదన్నది వారి మాటల్లోనే తెలుస్తోంది. రుణ మాఫీ కోసం మొదట 31 వేల కోట్లు అవసరమన్న ముఖ్యమంత్రి మాటలకు భిన్నంగా మూడు విడతల్లో రుణ మాఫీకి ప్రభుత్వం రూ. 17,933.19 విడుదల చేసిందని సీఎంవో ప్రకటన విడుదల చేసింది. అందుకే రేవంత్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని రోడ్లెక్కారు. మాఫీ పేరుతో మోసం చేసి.. అంకెల పేరుతో మాయ చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌ అసలు విషయాన్ని పక్కదారి పట్టించడానికి ఆగస్టు 15 వైరా సభ నుంచి ఆగస్టు 17 వరకు అంశాలను ముందు పెట్టి డైవర్షన్‌ పాలి'ట్రిక్స్‌' మొదలుపెట్టారన్నది స్పష్టమైంది. ఏ పార్టీకి అయినా ఏ నాయకుడికైనా విశ్వసనీయతే ప్రామాణికం. తొమ్మిది నెలల పాలనలో రేవంత్‌ హామీలపై ఫిరాయింపు ఫీట్లు ప్రదర్శించారు. దీనికి వ్యతిరేకంగానే అన్నివర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరసన బాట పట్టారు. ప్రజా పాలన పేరుతో నిర్బంధ గేట్లు బద్దలు కొట్టామని గొప్పగా చెప్పుకుని అక్కడి నుంచి తన ఇంటికే మకాం మార్చిన ముఖ్యమంత్రి ఇంటి వద్దకే నిరసనలు చేరాయి. ఇదీ తొమ్మిది నెలల్లోనే రేవంత్‌ సంపాదించుకున్న అపఖ్యాతి. నిజం నిలకడగా తెలుస్తుంది. అబద్ధం అసలు రంగు బైటపడుతుంది.

నోట్‌: కేసీఆర్‌ ప్రభుత్వంపై ఒంటికాలిపై లేచిన వాళ్లంతా ఇప్పుడు చేయండి పాలాభిషేకాలు. కొట్టండి డప్పులు.

Raju

Raju

Writer
    Next Story