వరదలతో రాష్ట్రం అతలాకుతలం.. పత్తా లేకుండా పోయిన సీఎం

జలదిగ్బంధంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా.. సహాయక చర్యలు మరిచి దేవుడి మీద భారం వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

వరదలతో రాష్ట్రం అతలాకుతలం.. పత్తా లేకుండా పోయిన సీఎం
X

రోమ్‌ నగరం తగలబడుతుంటే ఫిడేల్‌ వాయించినట్లు ఉన్నది సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహారం. ఇప్పటికే రాష్ట్రంలో ప్రజలు జ్వరాలతో బాధపడుతున్నారు. డెంగీ కేసులో గతంలో ఎన్నడూ లేనివిధంగా గణనీయంగా పెరుగుతున్నాయి. మరోవైపు రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కానీ సీఎం మాత్రం సచివాలయానికి రాకుండా, సమీక్ష చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై విమర్శలు వ్యక్తమౌతున్నాయి. మాట్లాడితే తమది ప్రజా పాలన ఊదరగొట్టే మంత్రులు భారీ వర్షాలకు, వరదలకు ప్రజలు అవస్థలు పడుతుంటే దేవుడి మీద భారం వేసి కంటితుడుపు ప్రకటలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో ముగ్గురు మంత్రులున్నా అక్కడ మున్నేరు వాగు ఉధృతితో అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుని రాకపోకలు బంద్‌ అయినా మొక్కుబడి సమీక్షలతో తమ అవస్థలు తీరవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాదు తాము పక్కరాష్ట్రంతో కాదు ప్రపంచంతోనే పోటీ పడుతామని గప్పాలు కొట్టే సీఎం పక్కరాష్ట్రం చంద్రబాబును చూసైనా నేర్చుకోవాలంటున్నారు. 70 ఏళ్ల వయసులోనూ ఆయన నిన్నటి నుంచి వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సీఎం రేవంత్‌ మాత్రం ఇంటి నుంచి కాలు కదపడం లేదు. కేవలం ఆదేశాలు, అధికారులకు సెలవులు రద్దు చేయాలనే ప్రకటనలతోనే సమస్యలన్నీ పరిష్కారమౌతాయని సీఎం భావిస్తున్నారా? అని విపక్షాలు మండిపడుతున్నాయి.

ఒక్క ఖమ్మంలోనే ఐదుగురు మృతువాత పడటం, గోదావరి వరద ఉధృతితో పోటెత్తుండటం, మున్నేరు మహోగ్రరూపం దాల్చడం వంటివి కనిపిస్తున్నా సీఎం వదర సహాయ చర్యల్లో పాల్గొనాల్సిందనే అభిప్రాయం వ్యక్తమౌతున్నది. భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు సచివాలయం నుంచి పర్యవేక్షణ చేస్తే, ముందు జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు. ప్రజా పాలన అంటే ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, వారు సమస్యలు ఉన్నప్పుడు వారికి దూరంగా ఉండి ప్రకటలకే పరిమితం కావడమా? అనే ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి.

Raju

Raju

Writer
    Next Story