మన దేశ ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకం:ప్రధాని

దేశవ్యాప్తంగా 78వ పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు.

మన దేశ ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకం:ప్రధాని
X

దేశం కోసం తమ జీవితాలనే పణంగా పెట్టిన మహనీయులు ఎంతో మంది ఉన్నారు. వారిని స్మరించుకుదామని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. దేశవ్యాప్తంగా 78వ పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రధాని జెండా ఎగురవేయడం వరుసగా ఇది 11వ సారి. హెలికాప్టర్‌తో భారత సైన్యం పూలజల్లు కురిపించింది. రక్షణ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకలకు దాదాపు ఆరు వేల మంది అథితులు హాజరయ్యారు. అంతకు ముందు ప్రధాని మోడీ రాజ్‌ఘాట్‌ వద్ద జాతిపిత మహాత్మాగాంధీకి నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా ప్రధాని ఎర్రకోటపై నుంచి ప్రధాని జాతినుద్దేశించి మాట్లాడుతూ..... దేశం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకుదామని ప్రధాని తెలిపారు. శతాబ్దాల తరబడి దేశం బానిసత్వంలో మగ్గింది. దేశం కోసం తమ జీవితాలనే పణంగా పెట్టిన మహనీయులు ఎంతో మంది ఉన్నారు. ప్రాణాలు అర్పించిన వారికి దేశం రుణ పడి ఉన్నది. స్వాతంత్రం కోసం నాడు 40 కోట్ల మంది ప్రజలు పోరాడారు. ఇవాళ దేశ జనాభా 140 కోట్లకు చేరింది. మనమంతా వారి కలలను సాకారం చేయాలి. లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగాలన్నారు. మన దేశ ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకం. భారత్‌ ను ప్రపంచ నైపుణ్యాల రాజధానిగా మార్చాలన్నారు.

భారీ సంస్కరణలు తెచ్చేందుకు ప్రభుత్వం సంకల్పం తీసుకున్నదని, దేశాభివృద్ధికి నూతన ఆర్థిక విధానానాలను అమలు చేస్తున్నామన్నారు. ఉపాధి కల్పనలో గణనీయమైన ప్రగతి సాధించాం. యువతకు నూతన ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అన్ని రంగాల్లో ఆధునిక సాంకేతికతకు పెద్దపీట వేస్తామన్నారు. భారత్‌ త్వరలోనే ప్రపంచంలోనే మూడో ఆర్థికవ్యవస్థగా ఆవిర్భవిస్తుంది. స్వయం సహాయక రంగాలకు ఇప్పటివరకు 9 లక్షల కోట్ల రుణాలిచ్చామని, కోటి మంది మహిళలను లక్షాధికారులుగా మారుస్తామని ప్రధాని తెలిపారు. మరో 10 కోట్ల మంది మహిళలు కొత్తగా స్వయం సహాయక సంఘాల్లో చేరారు. అంతరిక్ష రంగంలో భారత్‌ బలమైన శక్తిగా ఎదిగింది. అంతరిక్ష రంగంలో వందల కొద్దీ స్టార్టప్‌లు వచ్చాయి. ప్రైవేట్‌ ఉపగ్రహాలు, రాకెట్లు ప్రయోగిస్తున్నారు. మౌలిక సదుపాయాల్లో పెను మార్పులు తీసుకొచ్చామన్న ప్రధానిదేశ హితమే ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు.

2047 నాటికి వికసిత్‌ భారత్‌ మనందరి లక్ష్యం. మనం అనుకుంటే అప్పటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. వికసిత్‌ భారత్‌ 2047 నినాదం.. 140 కోట్ల మంది కలల తీర్మానం. ప్రపంచానికే అన్నం పెట్టేస్థాయి భారత్‌ ఎదగాలని ప్రధాని ఆకాంక్షించారు. రాబోయే ఐదేళ్లలో 75 వేల మెడికల్‌ సీట్లు వస్తాయన్న ప్రధాని వికసిత్‌ భారత్‌ ఆరోగ్య భారతం కావాలన్నారు. అందుకోసమే రాష్ట్రీయ పోషణ్‌ మిషన్‌ ప్రారంభించామన్నారు. పనిచేసే మహిళలకు మాతృత్వపు సెలవులను 12 వారాల నుంచి 26 వారాలకు పెంచామన్నారు. మహిళల పై జరిగే దాడుల విషయంలో త్వరితగతిన విచారణ , శిక్ష పడాలన్నారు. స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో బంగ్లాదేశ్‌పై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లా హిందువుల సురక్షితంపై 140 కోట్ల మంది భారతీయులు ఆందోళనగా ఉన్నారు. ఆ దేశం భారత్‌కు ఎప్పుడూ శ్రేయోభిలాషే అని వెల్లడించారు.ఒలింపిక్స్‌ నిర్వహణ మన కల అని.. దానికి సిద్ధమౌతున్నామని ప్రధాని చెప్పారు. 2036 ఒలింపిక్స్‌ నిర్వహణ కోసం బిడ్డింగ్‌ ప్రక్రియపై సద్ధమని ప్రధాని ప్రకటించారు.ఈ కార్యక్రమంలో లోక్‌సభ విపక్ష నేత రాహుల్‌గాంధీ, కేంద్ర మంత్రులు, సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.

Raju

Raju

Writer
    Next Story