కాంగ్రెస్‌ పాలనలో విద్యావ్యవస్థ భ్రష్టుపట్టి పోయింది

బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల వరుస ఆందోళనలపై సీఎం రివ్యూ చేయాలి : మాజీ మంత్రి హరీశ్‌ రావు

కాంగ్రెస్‌ పాలనలో విద్యావ్యవస్థ భ్రష్టుపట్టి పోయింది
X

కాంగ్రెస్‌ పాలనలో విద్యావ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టి పోయిందని, బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల వరుస ఆందోళనలే ఇందుకు నిదర్శనమని మాజీ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. గురుకుల విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతుండగానే ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు. పూర్తి స్థాయి వీసీని నియమించాలని, నిధుల గోల్ మాల్, మెస్ కాంట్రాక్టుల్లో పారదర్శకత, సిబ్బంది నియామకాలు, ఆరోగ్య సేవల మెరుగుదల, ఫుడ్ కోర్టు టెండర్ సమీక్ష, ఇంటర్నెట్, మౌలిక సదుపాయాల పెంపు లాంటి 17 డిమాండ్లతో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు నాలుగు రోజులుగా నిరసనలు తెలుపుతున్నా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రచార యావ కోసం ట్రాక్టర్ లో వెళ్లి, కాలేజీ గోడ దూకి నానాయాగి చేసిన రేవంత్ రెడ్డి చేతిలోనే ఇప్పుడు విద్యాశాఖ ఉందన్నారు. కాంగ్రెస్‌ ను గెలిపిస్తే సమస్యలు పరిష్కరిస్తానని, విద్యార్థుల భవితకు బాటలు వేస్తానని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అప్పటి మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి ట్రిపుల్‌ ఐటీకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు పరిష్కరించారని గుర్తు చేశారు. తాము చేసిన ప్రయత్నం కొనసాగించి ఉంటే విద్యార్థులు రోడ్లపైకి వచ్చే పరిస్థితి ఉండేది కాదన్నారు.

ముఖ్యమంత్రినే విద్యాశాఖ చూస్తున్నప్పుడు ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల సమస్యలు ఎందుకు పరిష్కారం కావడం లేదో చెప్పాలన్నారు. అప్పుడు ప్రచారయావతో నానా యాగి చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులను, విద్య వ్యవస్థను గాలికొదిలేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో నాలుగు ట్రిపుల్‌ ఐటీలు ఏర్పాటు చేస్తామన్న హామీ ఏమైందో చెప్పాలన్నారు. కొత్తవాటి ఏర్పాటు సంగతి తర్వాత ఉన్నదానికే దిక్కులేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ 9 నెలల పాలనలో ధ్వంసం కాని విద్యావ్యవస్థ ఏదైనా ఉందా అని ప్రశ్నించారు. టీచర్లు లేక 1,800 స్కూళ్లు మూతపడ్డాయని, కల్తీ ఆహారం, ఫుడ్‌ పాయిజన్‌ తో 600 మంది విద్యార్థులు ఆస్పత్రుల పాలయ్యారని, 40 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. విద్యాలయాలు సమస్యలకు నిలయంగా మారిపోయాయని తెలిపారు. ఇకనైనా సీఎం కళ్లు తెరిచి విద్యారంగ సమస్యలతో పాటు బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల సమస్యలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

Next Story