నిరుద్యోగుల ఆందోళనలతో ఆగమౌతున్న సీఎం

నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది అని కేటీఆర్‌, హరీశ్‌రావు, బీఆర్‌ఎస పార్టీపై మాట్లాడినంత మాత్రానా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేరినట్టు కావన్నది సీఎం గుర్తుపెట్టుకోవాలి.

నిరుద్యోగుల ఆందోళనలతో ఆగమౌతున్న సీఎం
X

మెగా డీఎస్సీ హామీ ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీ. గ్రూప్స్‌-2,3 పోస్టులు పెంచుతామని చెప్పింది కాంగ్రెస్‌. చాలా ఏండ్ల తర్వాత గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ వచ్చింది కాబట్టి మెయిన్స్‌లో 1:100 చొప్పున ఎక్కువ మందికిరాసే అవకాశం కల్పించాలని కోరింది నాటి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. నియామకాల ప్రక్రియను అడ్డుకోవడానికి ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ చేత కోర్టులో కేసులు వేయించింది కాంగ్రెస్‌ పార్టీ. అలాంటి పార్టీనే ఇప్పుడు పరీక్షలు వాయిదా వేస్తే విద్యార్థులు నష్టపోతారని చెప్పడం విడ్డూరంగా ఉన్నది. ఇక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎంత ఆందోళనలో ఉన్నారు అనడానికి ఆయన చేస్తున్న వ్యాఖ్యలే నిదర్శనం.

కొన్నిరోజులుగా నిరుద్యోగులు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలపై నిలదీస్తుంటే బెంబేలెత్తిపోయి వాళ్లపై నిర్బంధాన్నిఅమలు చేయిస్తున్నారు. నిరుద్యోగుల పక్షాల ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రధానపక్షాన్ని ఎదురుకోలేక నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. పరీక్షల వాయిదా కోసం అయాయక పేద విద్యార్థులు దీక్ష చేస్తున్నారట. కేటీఆర్‌, హరీశ్‌రావులు నిరుద్యోగుల కోసం 15 రోజులు దీక్ష చేయాలట. మొన్న 9 రోజులకు పైగా నిరుద్యోగుల సమస్యల సాధన కోసం దీక్ష చేసిన మోతీలాల్‌ నాయక్‌ వ్యవహారంలో ఏం చేసింది. మాకు పోస్టింగులు ఇప్పించమని సీఎం ఇంటి ముందు మోకాళ్లపై నిలుచుంటే ప్రభుత్వం ఎలా స్పందించింది. మొన్న సర్వీస్‌ కమిషన్‌ వద్ద శాంతియుత ఆందోళకు వెళ్లిన నిరుద్యోగులపట్ల, నిన్న డీఎస్సీ వాయిదా కోరుతూ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కార్యాలయ ముట్టడి వెళ్తే అభ్యర్థుల పట్ల అనుసరించిన విధానాలన్నీ యావత్‌ తెలంగాణ చూస్తున్నది.

ఈ ముఖ్యమంత్రికి ఏ విషయంపై అవగాహన లేదని ఆయన మాటల ద్వారానే తెలుస్తుంది. పరీక్షలు వాయిదా వేయడం వల్ల ప్రభుత్వానికి లాభమట. అంటే ఎంత లేటు అయితే ప్రభుత్వానికి జీతాలు ఇవ్వాల్సిన పనిలేదని ఆయన ఉద్దేశం కావొచ్చు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ఎల్బీ స్టేడియంలో నియామకపత్రాలు అందించిన వారికి పోస్టింగులు ఇచ్చేవారు. ఆ పని చేయకుండా ఎవరు దీక్షలు చేయాలి? ఎవరు ప్రశ్నించాలి ? అన్నది కూడా ఆయనే చెబుతున్నాడు. పరిపాలన గాలికి వదిలేసి పీసీసీ అధ్యక్షుడిగా అధికారంలో ఉన్నా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నట్టు మాట్లాడుతున్నారు. ఇక కోచింగ్‌ సెంటర్ల వాళ్లు కొంతమంది సీఎంను పరీక్షలు వాయిదా వేయాలని కోరారట. మొన్న నిరుద్యోగుల ఆందోళన నేపథ్యంలో సీఎం ఇంట్లో సమీక్షలో ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లో కోచింగ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్న వ్యక్తి కూడా ఉన్నట్టు సీఎంవో విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో ఉన్నది. కాంగ్రెస్‌ అధికార ప్రతినిధిగా ఆయన గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసినందుకు, ఇప్పుడు నిరుద్యోగులను ముంచినందుకు ఆయనకు రాష్ట్రస్థాయి పదవిని కట్టబెట్టారని భావించాలా? పరీక్షలు వాయిదా వేయమని విద్యార్థులు ఎందుకు కోరుతున్నారన్న కనీస అవగాహన లేకుండా ముఖ్యమంత్రి ఏదోదో మాట్లాడుతున్నారు. మరి కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడు నోటిఫికేషన్‌ ఇస్తామో? ఎప్పుడు పరీక్షనిర్వహిస్తామో తేదీలతో సహా పెద్ద పెద్ద పేపర్‌ ప్రకటనల్లో ఒక్కటైనా అమలు చేసిందా? వీటిపైనే కదా విపక్షం, నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నది. దీనికి సీఎం ఎందుకు సమాధానం చెప్పడం లేదు. అంటే గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు నియామక పత్రాలు అందించి అదే మా ప్రభుత్వ ఘనత అని చెప్పుకోవడానికా? ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీ అన్నది ఎన్నికల జూమ్లానేనా? వీటికి సీఎం జవాబు చెప్పాల్సి ఉంటుంది. నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది అని కేటీఆర్‌, హరీశ్‌రావు, బీఆర్‌ఎస పార్టీపై మాట్లాడినంత మాత్రానా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేరినట్టు కావు అన్నది సీఎం గుర్తుపెట్టుకోవాలి. ఏ అంశాన్ని పెట్టుకుని మీరు రాజకీయం చేశారో ఏడు నెలల్లో అదే మీ మెడకు చుట్టుకున్న వాస్తవాన్ని విస్మరించి వితండవాదం చేసినంత మాత్రానా నిజం అబద్ధం కాబోదు. నివురుగప్పిన నిప్పులాంటి నిరుద్యోగ సమస్యను విస్మరిస్తే రానున్న రోజుల్లో దాని పర్యవసానాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుంది. తస్మాత్‌ జాగ్రత్త!

Raju

Raju

Writer
    Next Story