వరదలోనూ బురద రాజకీయాలేల?

సీఎం మూడు రోజుల నిద్రలేకుండా రివ్యూ చేస్తే సహయక చర్యల్లో వైఫల్యం ఎందుకు? తప్పును కప్పిపుచ్చుకోవడానికి రాజకీయ విమర్శలా!?

వరదలోనూ బురద రాజకీయాలేల?
X

వరదల్లో బుదర రాజకీయాలు వద్దని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సూర్యాపేట సమీక్షలో ప్రవచించారు. భారీ వర్షాలు, వరదలతో ప్రజలు సర్వస్వం కోల్పోయి ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తుంటే.. పెళ్లికో, శుభకార్యానికో డెకరేట్‌ చేసినట్టు సీఎం సమీక్ష కోసం సూర్యాపేటలో అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. ప్రజలను ఆదుకోవడమే తన ధ్యేయం అనుకునే ఏ ప్రజాప్రతినిధి కూడా ఈ తరహా ఆర్భాటాలకు అవకాశం ఇవ్వరు. పక్కరాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ లో ఏడు పదుల వయస్సున్న చంద్రబాబు నాయుడు మోకాళ్ల లోతు నీళ్లలో తిరుగుతూ వరద బాధితులకు భరోసానిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి శనివారం నుంచి సోమవారం ఉదయం వరకు పత్తా లేరు. తనకు మూడు రోజుల నుంచి నిద్రే లేదని.. నిద్రపోకుండా భారీ వర్షాలు, వరదల మీదనే సమీక్షలు చేస్తున్నానని కూడా చెప్పారు. సీఎం చెప్పిందే నిజమని అనుకుందాం.. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, సీఎస్‌, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు సెక్రటేరియట్‌ లోనే ఉంటే సీఎం రేవంత్‌ రెడ్డి నిద్రాహారాలు మాని ఎవరితో రివ్యూ చేసినట్టు.. ఎవరికి ఆదేశాలు ఇచ్చినట్టు..? సీఎం చెప్తున్నదే నిజమని అనుకుందాం.. ఖమ్మంలో సహాయం కోసం ప్రజలు తొమ్మిది గంటల పాటు ఎందుకు పడిగాపులు కాసినట్టు.. ఎందుకు తమకు తాముగా బయట పడేందుకు ఇతరుల సాయం తీసుకున్నట్టు? అంటే ప్రభుత్వం సాయం చేస్తామని చెప్పినా.. యంత్రాంగం మొత్తం అక్కడ వాలిపోయినా.. ''ఉహూ.... మేం ఇక్కడికి నుంచి రాం.. ఇక్కడే ఉంటాం.. మున్నేరు ఎట్లా ముంచేస్తదో చూస్తాం..'' అని ప్రజలే ఉండిపోయినట్టా? తన ప్రభుత్వ వైఫల్యాన్ని హుందాగా ఒప్పుకుంటే.. ఇంకోసారి ఇలాంటి పొరపాట్లకు తావివ్వకుండా చూస్తానని చెప్పి ఉంటే కొంతలో కొంతైన గౌరవంగా ఉండేది!

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి అధికారం దక్కడంలో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌ నగర్‌ జిల్లాలే కీలకం. ఈ మూడు జిల్లాల్లో వచ్చిన సీట్లే పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ పార్టీకి పవర్‌ దక్కేలా చేశాయి. ఒకరకంగా వెంటిలేటర్‌ మీదున్న కాంగ్రెస్‌ పార్టీకి జీవం పోశాయి. భారీ వర్షాలు వరదలతో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ఖమ్మం జిల్లా కనీవినీ ఎరుగని విపత్తుతో వణికిపోయింది. ఖమ్మం టౌన్‌ మొత్తం జలదిగ్భంధంలో చిక్కుకుంది. మహబూబాబాద్‌, ములుగు జిల్లాలు చిగురుటాకులా వణికిపోయాయి. ఇతంటి ఘోర విపత్తు సంభవిస్తే రాష్ట్ర పాలకుడు కథా నాయకుడై తన యంత్రాంగాన్ని కదిలించాయి. ముఖ్యమంత్రే ముందుంటే యంత్రాంగం దానంతట అదే కదిలి వస్తుంది. వరదలో చిక్కుకున్న వాళ్లను రక్షించే ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం ప్రయత్నించినా ఆ యత్నాలు సఫలం కాకుండా ప్రాణనష్టం సంభవిస్తే దానికి ఎవరిని నిందించరు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మంత్రి తాము ప్రయత్నించినా హెలీక్యాప్టర్లు రాలేదని.. ఇక దేవుడే దిక్కు అని కాడి పడేస్తే ఏమనుకోవాలి. భారీ వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది. చంద్రబాబు తన అనుభవంతో కేంద్రం పెద్దలతో మాట్లాడి అవసరమైన హెలీక్యాప్టర్లు, కేంద్ర బలగాలను ముందే రప్పించుకున్నారు. రేవంత్‌ రెడ్డి ఈ ప్రయత్నం చేయలేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా అంతా అయిపోయిన తర్వాత ప్రయత్నాలు మొదలు పెట్టారు. అవి ఫలించలేదు. ఉజ్వలమైన భవిష్యత్‌ ఉన్న పలువురు ప్రాణాలు కోల్పోయారు.

భారీ వర్షాలు, వరదలతో ప్రజలు పడిన కష్టాలు, కన్నీళ్లు, వ్యథలు ఆగ్రహావేశాలుగా బయటకు వస్తున్నాయి. అత్యంత విపత్కర పరిస్థితుల నుంచి బయట పడిన వారిలో ఆగ్రహం సహజమే. ఆ కోపాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు చవి చూశారు. ముఖ్యమంత్రి దాదాపు 50 గంటలు ఎవరికి కనిపించలేదు. సీఎం సూర్యాపేటలో చెప్పుకున్నట్టు ఆయన మూడు రోజులు నిద్రలేకుండా వరదలపై సమీక్షలు చేసి ఉంటే ఆయన పీఆర్‌ విభాగం ఒక్క ఫొటో కూడా ఎందుకు రిలీజ్‌ చేయలేదు. వర్షాలు, వరదలతో అలెర్ట్‌గా ఉండాలన్న ఒక్క ప్రెస్‌ నోట్‌ తప్ప ఆదివారం సాయంత్రం వరకు ఎలాంటి ప్రకటన సీఎంవో నుంచి రాలేదు. ప్రజల్లో పట్టరాని కోపానికి జడిసి విద్యుత్‌ సిబ్బంది ప్రాణాలకు తెగించి కరెంట్‌ సరఫరా పునరుద్దరణకు ప్రయత్నిస్తున్నారనే కొన్ని ఫొటోలు రిలీజ్‌ చేశారు. ఈ విపత్తులో రియల్‌ హీరోలుగా నిలిచిన విద్యుత్‌ శాఖ సిబ్బంది, పోలీసులు, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులకు ప్రతి ఒక్కరూ సెల్యూట్‌ చేసి తీరాల్సిందే. వాళ్లు నిద్రాహారాలు మాని పని చేశారు కాబట్టే ఎక్కువ మంది ప్రజలు ఇబ్బంది పడలేదు. కానీ ఇందులో ముఖ్యమంత్రి చూపించిన చొరవ, చేసిన ప్రయత్నం ఏమిటన్నది ఆయనే వివరణ ఇచ్చుకోవాలి.


భారీ వర్షాలు కురిసి, వాగులు, వంకలు పోటెత్తి ప్రజలంతా కష్టాలలో ఉన్నప్పుడు తన ఖమ్మం టూర్‌ ను పొలిటికల్‌ టూర్‌ గా మార్చుకోవడం రేవంత్‌ కే చెల్లింది. నవ్వుతూ పలకరింపులు, షేక్‌ హ్యాండ్‌ ఇవ్వడం లాంటి దృశ్యాలు చూసినప్పుడు ఆయనలో సీరియస్‌నెస్‌ లేదా అన్న అనుమానం కలుగకమానదు. వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లేప్పుడు, వారికి అండగా నిలిచేందుకు వెళ్తున్న క్రమంలో ఈ తరహా ప్రచారం ఎందుకు? నిజంగానే సీఎం నిద్రాహారాలు మాని సమీక్షలు చేసి ఉంటే వాటిపై ఒక్క ఫొటో, ఒక్క వీడియో ఎందుకు రిలీజ్‌ చేయలేదు..? ప్రత్యర్థులపై రాజకీయ విమర్శలు చేయడానికి, వారిని ఇరుకున పెట్టడానికి బోలెడంత సమయం ఉంది.. ఇప్పుడు ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకు తానున్నాను అనే భరోసా కల్పించడానికి రేవంత్‌ ప్రాధాన్యత ఇవ్వాలి.. తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి మూడు రోజులుగా నిద్రపోలేదు అని ఫుల్‌ గా డెకరేషన్‌ చేసిన స్టేజీ మీది నుంచి చెప్తే.. ఖమ్మం వెళ్తూ దారిమధ్యలో తన పార్టీ వాళ్లను నవ్వుతూ పలకరిస్తూ వెళ్తే ఎవ్వరూ నమ్మరు. ఈ విషయం రేవంత్‌ గుర్తించాలే. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ పై ఆధార పడాల్సిన అవసరం లేకుండా ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బలగాలు సిద్ధం చేయడం మంచిదే.. విపత్తులు వచ్చినప్పుడు ప్రజలను ఎలా రక్షించాలనే దానిపై రాష్ట్రంలో ఇంతవరకు ఒక్కరికీ ట్రైనింగ్‌ ఇవ్వలే.. ఆ బలగాలు రెడీ అయ్యే వరకైనా కేంద్రంపై ఆధారపడాలన్న వాస్తవాన్ని గుర్తించాలి. విపత్తు రావడానికి ముందే కేంద్ర బలగాలను, ఆర్మీ హెలీ క్యాప్టర్లను తెప్పించి సిద్ధంగా ఉంచి ఉంటే ఆదివారం వరదలకు అన్ని ప్రాణాలు బలి అయ్యేవి కావు. ఈ వాస్తవాలను ముఖ్యమంత్రి గుర్తించి తీరాలి. వరదలో బురద రాజకీయాలు ఎప్పటికీ మంచివి కావు.. ఇది ఇతరులకు చెప్పడానికి కాదు.. తాను స్వయంగా ఆచరించడానికే అన్న విషయం కూడా రేవంత్‌ గుర్తెరగాలి.

Next Story