ప‌థ‌కాల నిధుల రిక‌వ‌రీ నిలిపివేత‌

పెన్షన్‌ రికవరీపై రేవంత్‌ సర్కార్‌ వెనక్కి తగ్గింది. లబ్ధిదారులకు నోటీసులు,రికవరీలు చేయవద్దంటూ ప్రభుత్వం అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.

ప‌థ‌కాల నిధుల రిక‌వ‌రీ నిలిపివేత‌
X

బీఆర్ ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో వివిధ సంక్షేమ ప‌థ‌కాల్లో ల‌బ్ధి పొందిన అన‌ర్హుల నుంచి తిరిగి సొమ్ము వ‌సూలు చేసే కార్య‌క్ర‌మాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్న‌ట్టు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. త‌దుప‌రి ఆదేశాలు వ‌చ్చే వ‌ర‌కు ఏ అన‌ర్హుడికి నోటీసులు జారీ చేయ‌టం కానీ, సొమ్ము వ‌సూలు చేయ‌టం కానీ చేయ‌రాద‌ని అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్ల‌కు ఆదివారం ఆదేశాలు జారీచేసింది. వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నవారిలో అనర్హులు ఉన్నట్టు గుర్తించామ‌ని, అన్ని వ‌ర్గాల నుంచి స‌ల‌హాలు సూచ‌న‌లు తీసుకొన్న త‌ర్వాత ఈ అన‌ర్హుల నుంచి సొమ్ము రిక‌వ‌రీ చేయాల‌ని నిర్ణ‌యించి ఆ మేర‌కు గతంలో ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపింది. అయితే, ఈ ప‌థ‌కాల‌ను మ‌రింత స‌మ‌ర్దంగా, ల‌బ్ధిదారుల‌కు మాత్ర‌మే చేరేలా వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేసేందుకు వివిధ వ‌ర్గాల నుంచి వ‌చ్చిన అభిప్రాయాల‌పై అసెంబ్లీలో చ‌ర్చించి తుది నిర్ణ‌యం తీసుకొంటామ‌ని తెలిపింది. అప్ప‌టివ‌ర‌కు క‌లెక్ట‌ర్లు ఈ అంశంపై ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకోరాద‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారి జారీచేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు.

'వృద్ధురాలికి ఇచ్చిన పింఛన్‌ తిరిగి గుంజుకుంటరా?'

గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే రెంటింపు పింఛన్‌ ఇస్తామని గద్దెనెక్కిన రేవంత్‌ సర్కార్‌ ఉన్నవాటిలోనే కోతలు విధిస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని దాసరి మల్లమ్మ అనే 80 ఏళ్ల వృద్ధురాలికి ప్రభుత్వం ఇప్పటి వరకు ఆసరా పింఛన్‌ రూపంలో రూ.1.72 లక్షలు ఇచ్చిందని, ఆసరా పింఛన్‌ పొందే అర్హత లేనందున ప్రభుత్వం నుంచి వచ్చిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని మున్సిపల్‌ కమిషనర్‌ ఆమెకు నోటీసులు జారీ చేశారు. మంత్రులు కూడా దీనిపై స్పందిస్తూ ఆమెకు అర్హత లేదన్నట్టుగా మాట్లాడారు.





సాంకేతిక కారణాలు చూపిస్తూ వేలాదిమంది ఆసరా పింఛన్‌ లబ్ధిదారులకు ఇప్పటివరకు పింఛన్‌గా ఇచ్చిన డబ్బులన్నీ వెనక్కి ఇచ్చేయాలని నోటీసులు ఇచ్చిన అంశం పెద్ద దుమారాన్ని రేపింది. దీంతో ప్రభుత్వం ఈ చర్యలపై వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. 'వృద్ధురాలికి ఇచ్చిన పింఛన్‌ తిరిగి గుంజుకుంటరా?' అని 'తెలుగు స్క్రైబ్‌' డిజిటల్‌ మీడియాలో వచ్చిన కథనానికి ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నట్టు సమాచారం. ప‌థ‌కాల నిధుల రిక‌వ‌రీ తాత్కాలిక నిలిపివేస్తున్నట్లు ప్రకటించినా ఇక ఈ అంశం జోలికి వెళ్లవద్దని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Raju

Raju

Writer
    Next Story