కవితకు బెయిల్‌.. నేతల నేలబారు వ్యాఖ్యలు

బీఆర్‌ఎస్‌ రాజకీయ ఉనికినే ప్రశ్నిస్తూ.. ఆ పార్టీని చూసి హడలిపోతున్న జాతీయ పార్టీలు

కవితకు బెయిల్‌.. నేతల నేలబారు వ్యాఖ్యలు
X

ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టు బెయిల్‌ మంజూరు చేయడంపై రెండు జాతీయ పార్టీల నేతల స్పందన చవకబారుగా ఉంది. అత్యున్నత న్యాయస్థానం తీర్పుపై ఆచితూచి మాట్లాడాల్సింది పోయి రాజకీయం చేయడానికి ఆ రెండు పార్టీలు ప్రాధాన్యత ఇచ్చాయి. అసలు బీఆర్‌ఎస్‌ ఉనికే లేదంటూ బీరాలు పలుకుతూనే ఆ పార్టీని చూసి హడలెత్తిపోతున్నాయి. ఇందుకు కవిత బెయిల్‌ వచ్చిన సమయంలో బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు చేసిన కామెంట్స్‌ అద్దం పడుతున్నాయి. బీజేపీ రాష్ట్రాధ్యక్షుడిగా పని చేసి.. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్‌.. రేపోమాపో తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీకి అధ్యక్షుడిగా పగ్గాలు దక్కించుకుంటానని చెప్తోన్న మహేశ్ కుమార్‌ గౌడ్‌ కవిత బెయిల్‌ పై స్పందించారు. ఈ సందర్భంలో ఢిల్లీ లిక్కర్‌ స్కాం గురించో, అందులో కవిత పాత్ర ప్రమేయం గురించో మాట్లాడటానికి ఏమీ లేదని.. బీఆర్‌ఎస్‌ ను రాజకీయంగా కార్నర్‌ చేయడానికి ఉత్సాహం చూపించారు. ఈక్రమంలో సుప్రీం కోర్టు తీర్పునే తప్పుబట్టేలా.. సుప్రీం కోర్టు న్యాయమూర్తులకు ఉద్దేశాలు ఆపాదించేలా ఇద్దరు నాయకులు మాట్లాడారు. రెండు పార్టీల నేతలు మాటల్లో బీఆర్‌ఎస్‌ ను టార్గెట్‌ చేయడం స్పష్టంగా కనిపించింది. బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీన ప్రక్రియ మొదలైందని మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ అంటే, బీఆర్‌ఎస్‌ - కాంగ్రెస్‌ కుమ్మక్కుతోనే బెయిల్‌ అని బండి సంజయ్‌ అన్నారు.

ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్‌ కేసులో అరెస్ట్‌ అయి 165 రోజులుగా తీహార్‌ జైల్‌ లో విచారణ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో రూ.వంద కోట్ల అక్రమాలు జరిగాయని హడావిడి చేయడం తప్ప ఈడీ, సీబీఐ అందుకు తగ్గ ఆధారాలు చూపించలేదు. రెండేళ్లకు పైగా ఈ కేసులో విచారణ దాదాపు డెయిలీ సీరియల్‌ తరహాలో ఎపిసోడ్లకు ఎపిసోడ్లు సాగదీశారు. ఢిల్లీ సీఎం, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అర్వింద్‌ కేజ్రీవాల్‌, ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా సహా పలువురు ఆప్‌ నేతలను ఈ కేసులో అరెస్టు చేసి జైళ్లో పెట్టారు. బీఆర్‌ఎస్‌ అధినేత కుమార్తె, ఎమ్మెల్సీ కవితను ఇదే కేసులో అరెస్టు చేశారు. ఈ మొత్తం కేసులో కవితనే కీలకమని చెప్తూ వచ్చారు. ఆమె ఫోన్లు ధ్వంసం చేశారు.. సాక్ష్యాలను తారుమారు చేశారని మొదట్లో వాదించిన దర్యాప్తు సంస్థలు.. ధ్వంసం చేశారని చెప్తోన్న ఫోన్లను ఆమె దర్యాప్తు అధికారులకు అందజేశారు. ఈ కేసులో కవితపై ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేస్తూ వచ్చిన వాళ్లు కూడా ఎనిమిది ఆపిల్‌ ఫోన్లను కవిత ఈడీకి సమర్పించిన తర్వాత కాస్త సైలెంట్‌ అయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో, 2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ను, కేసీఆర్‌ ను రాజకీయంగా బద్నాం చేయడానికి ఈ కేసును రెండు జాతీయ పార్టీలు ఉపయోగించుకున్నాయి.

రాష్ట్రంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పై ప్రజల్లో కొంతమేరకు ఉన్న వ్యతిరేకతను డ్రైవ్‌ చేసి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ లబ్ధిపొందింది. తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్‌ ఎంపీలు గెలిచి లోక్‌ సభలో ఏం చేస్తారనే నెగిటివ్‌ ప్రాపగండతో లోక్‌ సభ ఎన్నికల్లో బీజేపీ లాభపడింది. ఎంపీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ చావు దెబ్బతిందని.. ఇక ఆ పార్టీ బతికి బట్టకట్టడం కష్టమేనని.. రాజకీయ ఉనికి కోసం ఏదో ఒక జాతీయ పార్టీ పంచన చేరడం ఖాయమని సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం మొదలైంది. బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనమవుతుందని కాంగ్రెస్‌.. కాంగ్రెస్‌ గూటికి బీఆర్‌ఎస్‌ చేరుతుందని బీజేపీ ఆరోపణలు చేస్తున్నాయి. కవితకు సుప్రీం కోర్టు బెయిల్‌ ఇవ్వడాన్ని కూడా తమ ప్రాపగండకు ఉపయోగించుకుంటున్నాయి. రెండు జాతీయ పార్టీల ఉమ్మడి శత్రువు బీఆర్‌ఎస్‌. కేసీఆర్‌ ను రాజకీయంగా దెబ్బతీయడానికే లిక్కర్‌ కేసును తెరపైకి తెచ్చి కవితను అరెస్టు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలను కేసీఆర్‌ పైకి సంధించి రాజకీయంగా ఆయనను రెండు పార్టీలు కలిసి దెబ్బకొట్టాయి. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓట్లు బదిలీ కావడంతోనే బీజేపీ తెలంగాణలో ఎనిమిది ఎంపీ సీట్లు గెలిచిందన్న కాంగ్రెస్‌ నేతల వాదనను ఏఐసీసీ అంతర్గత విచారణ కోసం నియమించిన పీజే కురియన్‌ కమిటీనే పరిగణలోకి తీసుకోలేదు. అయినా అదే ప్రచారాన్ని కాంగ్రెస్‌ కొనసాగిస్తోంది.

కవితకు బెయిల్ రావడంతో కేసీఆర్‌ మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వస్తారని.. ఆయనను రాజకీయంగా ఎదుర్కోవడం తలకు మించిన భారం అవుతుందనే భయం రెండు జాతీయ పార్టీలకూ ఉంది. అందుకే ఢిల్లీలో చిట్‌ చాట్‌ పేరుతో సీఎం రేవంత్‌ రెడ్డి కవితకు బెయిల్‌ రాబోతుందని చెప్పారు. బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనం కావడం ఖాయమన్నారు. తన వ్యాఖ్యలకు మరింత బలాన్చిచ్చేందుకు కేసీఆర్‌ కు గవర్నర్‌, కేటీఆర్‌ కు కేంద్ర మంత్రి పదవి, హరీశ్‌ రావుకు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత పదవులు రాబోతున్నాయని చెప్పారు. ఢిల్లీ లిక్కర్‌ కేసులో ప్రధాన నిందితుడిగా చెప్తోన్న మనీశ్‌ సిసోడియాకు బెయిల్‌ వచ్చిన తర్వాత కవిత, కేజ్రీవాల్‌ కు బెయిల్‌ రావడం లాంఛనమే. కోర్టు ప్రొసీడింగ్స్‌ ను దగ్గరి నుంచి గమనించే వారికి ఇది ఏమంత ఆశ్చర్యం కలిగించే విషయం కాదు. కోర్టులు.. కేసులు.. అరెస్టులు.. బెయిళ్లు.. విచారణల్లో తెలంగాణ రాజకీయాల్లో అందరికన్నా రేవంత్‌ రెడ్డికే ఎక్కువ అనుభవం ఉంది. ఆయన దగ్గర పేరు మోసిన లీగల్‌ టీమ్‌ కూడా ఉంది. పైగా అధికారంలో ఉన్నారు.. అలాంటప్పుడు కవితకు బెయిల్‌ దక్కబోతుందని ఆయనకు ముందే తెలియడం పెద్ద విషయం కాదు. అయినా కవితకు బెయిల్‌ రావడాన్ని రాజకీయంగా వాడుకోవాలనే రేవంత్‌ ఢిల్లీలో చిట్‌ చాట్‌ పేరుతో నోటికి వచ్చినట్టు మాట్లాడారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేక.. పూర్తి చేశామన్న రుణమాఫీ పరిస్థితి ఏమిటో అర్థంకాక సీఎం రేవంత్‌ రెడ్డి అమోమయంలో ఉన్నారు. అందుకే కేసీఆర్‌ ను రాజకీయంగా దెబ్బతీస్తే మరికొంత కాలం తన అబద్ధాల మాయలో ప్రజలను కొట్టుకుపోయేలా చేయవచ్చు అనేది ఆయన ప్రయత్నం. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రేవంత్‌.. కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి బండి సంజయ్‌ కేసీఆర్‌ ను, బీఆర్‌ఎస్‌ ను చూసి హడలెత్తిపోతున్నారంటే ఆ పార్టీ ఉనికిలో ఉన్నట్టా?? వీళ్లు చెప్తున్నట్టు చరిత్రలో కలిసిపోయినట్టా!??

Next Story