అసెంబ్లీలో మాతృమూర్తులకు అవమానం

వికృత రాజకీయ క్రీడకు చట్టసభలను వేదికగా మార్చిన సీఎం రేవంత్‌ రెడ్డి

అసెంబ్లీలో మాతృమూర్తులకు అవమానం
X

చట్ట సభలను వికృత రాజకీయ క్రీడకు వేదికగా మార్చేశారు. మొన్నటి వరకు ఇతర అసెంబ్లీల్లో కనిపించిన దుష్ట సంప్రదాయాన్ని తెలంగాణ అసెంబ్లీకి తెచ్చిపెట్టారు. తాను మాత్రమే కాంగ్రెస్‌ పార్టీలో పుట్టి పెరిగి ఆ పార్టీని ఉద్దరించినట్టు చెప్పుకునే సీఎం రేవంత్‌ రెడ్డి బుధవారం నిండు సభలో బీఆర్‌ఎస్‌ మహిళా ఎమ్మెల్యేలను దారుణంగా అవమానించారు. మాతృమూర్తులను పట్టుకొని అనకూడని మాటలు అన్నారు. ''మీ వెనుక కూర్చున్న ఆ అక్కలు ఇక్కడ ముంచే అక్కడకు చేరారు..'' అంటూ వాళ్లు గతంలో కాంగ్రెస్‌ లో మంత్రులుగా పని చేసి పార్టీని మోసం చేశారన్నట్టుగా వ్యాఖ్యలు చేశారు. వాళ్లు గతంలో సభలో ఇక్కడ (అంటూ ట్రెజరీ బెంచీలను చూపించారు)ల్లోనే ఉన్నారు.. ఇక్కడ ముంచి అక్కడకు (అపోజిషన్‌ బెంచీల్లోకి) చేరారు.. వాళ్లను నమ్ముకుంటే మీ బతుకు బస్టాంట్‌ అవుతుందని కేటీఆర్‌ కు సీఎం జాగ్రత్తలు చెప్పారు. సీఎం వ్యాఖ్యలతో మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్ర మనస్థాపానికి లోనయ్యారు. ఒకానొక దశలో భావోద్వేగంతో ఆమె సభలో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంత జరుగుతున్నా అధికారపక్షం నుంచి జరిగిన పొరపాటును సరిదిద్దే ప్రయత్నం చేయకపోగా సభానాయకుడు ఎవరి పేరు తీసుకోలేదని లెజిస్లేటివ్‌ ఎఫైర్స్‌ మినిస్టర్‌ శ్రీధర్‌ బాబు అన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేరుగా సబితా ఇంద్రారెడ్డిని పట్టుకొని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్‌ మహిళా ఎమ్మెల్యేలను ఉద్దేశించి సీఎం చేసిన తీవ్ర వ్యాఖ్యలపై సభలో సబితా ఇంద్రారెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము ఏం మోసం చేశామని ప్రశ్నించారు. ప్రస్తుత సీఎంను తానే కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువచ్చానని, తమ్ముడిలా ఆశీర్వదించానని, మంచి రాజకీయ భవిష్యత్‌ ఉంటుంది.. సీఎం కూడా అవుతావని తాను చెప్పానని.. రాష్ట్రంలో శాంతిభద్రల సమస్యను తాను సభలో లేవనెత్తినందుకు తనను సీఎం టార్గెట్‌ చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ ఇంటిపై కాకి తన ఇంటిపై వాలితే తుపాకీతో కాల్చేస్తానన్న రేవంత్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించారు. సభా నాయకుడి హోదాలో ఉండి.. మహిళా సభ్యులను కించ పరిచేలా మాట్లాడిన సీఎం.. తన వరకు వచ్చేసరికి ప్రైవేట్‌ గా మాట్లాడుకున్న అంశాలను సభలో ఎలా ప్రస్తావిస్తారన్నారు. తనను సబితక్క కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించిన మాట నిజమేనని చెప్పారు. తనను మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీ చేయాలని కోరి ఆమె బీఆర్‌ఎస్‌ లో చేరి మంత్రి అయ్యారని, తమ్ముడిగా తనను మోసం చేశారు కాబట్టే ఆమెను నమ్మోద్దని కేటీఆర్‌ కు చెప్పానన్నారు. సభా నాయకుడి హోదాలో సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలను సీనియర్‌ లెజిస్లేటర్‌ గా, డిప్యూటీ సీఎంగా సరి చేయాల్సిన భట్టి విక్రమార్క ముఖ్యమంత్రిని మించి రెచ్చిపోయి మాట్లాడారు.

''పార్టీలు మారి, పరువు తీసి, మొత్తం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఇంకా ఆవేదన చెందుతున్నాం.. బాధపడుతున్నాం.. అంటే ఎట్లా.. ఏ మొహం పెట్టుకొని ఇంకా మాట్లాడుతున్నారు.. సబితా ఇంద్రా రెడ్డి గారిని 2004 ముందు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారు. ఆ తర్వాత పార్టీ అధికారంలోకి రాగా ఆమెకు మంత్రి పదవిని ఇచ్చారు. 2009లో మళ్లీ టికెట్ ఇచ్చి మంచి పోర్ట్ పోలియోతో మంత్రిగా గౌరవించారు. దశాబ్ద కాలం పాటు ముఖ్యమైన మంత్రి పదవులు అనుభవించారు. కాంగ్రెస్‌ ఒక దళితుడికి ప్రతిపక్ష నేతగా పదవి ఇస్తే బీఆర్‌ఎస్‌ లో చేరి ఆ పదవిని పోగొట్టారు..'' అని అన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డిని మించి డిప్యూటీ సీఎం సబితా ఇంద్రారెడ్డిని అవమానించారు. ఇంతజరుగుతుంటే ఒక మహిళగా దీనిని సరిచేయాల్సిన మంత్రి సీతక్క కూడా పాలకపక్షాన్నే సమర్థించే ప్రయత్నం చేశారు. తమకు సీఎం క్షమాపణ చెప్పి అసెంబ్లీలో సభా నాయకుడి హోదాకు గౌరవం ఇవ్వాలని మహిళా సభ్యులు సభలో పట్టుబట్టారు. తాను గవర్నర్ ను రిసీవ్‌ చేసుకునేందుకు వెళ్తున్నానని.. సభకు మళ్లీ వచ్చి అందరికీ కలిసి సమాధానం చెప్తానని బయటకు వెళ్లిన సీఎం.. సభలోకి వచ్చిన తర్వాత బీఆర్‌ఎస్‌ మహిళా ఎమ్మెల్యేలు వెల్‌ లో నేలపై కూర్చున్నా వివరణ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. హుందాగా తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయలేదు. అందరికీ సమాధానం చెప్తానన్న సీఎం.. మహిళా సభ్యులు నేలపై కూర్చొని ఉండగానే అప్రాప్రియేషన్‌ బిల్లును పాస్‌ చేయించుకొని సభ నుంచి వెళ్లిపోయారు. డిప్యూటీ సీఎం సబితా ఇంద్రారెడ్డి పేరు తీసుకున్నారు కాబట్టి ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్‌ ఓవైసీ కోరినా స్పీకర్‌ పరిగణలోకి తీసుకోలేదు.

టీడీపీ నుంచి వచ్చి గద్దెనెక్కి

రేవంత్‌ రెడ్డి నోరు తెరిస్తే కాంగ్రెస్‌ పార్టీలోనే పుట్టి పెరిగినట్టు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌ లో పదవులు అనుభవించినోళ్లు కష్టకాలంలో ముంచి పోయినట్టు నిందలు వేస్తున్నారు. అంతటితో ఆగకుండా వాళ్ల వయసుకు, జెండర్‌ కు గౌరవం ఇవ్వకుండా నోటికి వచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో అంటే రాజకీయ లబ్ది కోసం చేశారని అనుకోవచ్చు. నిండు అసెంబ్లీలో స్పీకర్‌ సమక్షంలో మహిళా ఎమ్మెల్యేలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం చట్టసభల గౌరవాన్ని తగ్గించడమే. తెలంగాణ అసెంబ్లీ చరిత్రలో ఇలాంటి సంఘటనలు జరగలేదు. ఏపీ అసెంబ్లీలో, ఇతర రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలను, మహిళ సభ్యులను అవమానించిన ఉదంతాలున్నాయి. అలా మహిళలను అవమానించిన పార్టీలు ఆ తర్వాతి ఎన్నికల్లో భారీ ముల్యమే చెల్లించుకున్నాయి. సబిత ఇంద్రారెడ్డిని రేవంత్‌ రెడ్డి, ఆయన ప్రభుత్వం అవమానించడం ఇదే మొదటిసారి కాదు. తెలంగాణ బోనాల దశాబ్ది ఉత్సవాల చెక్కుల పంపిణీలో ప్రొటోకాల్‌ పాటించలేదు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆమె నేలపై కూర్చొని నిరసన తెలిపారు. సభ్యుల గౌరవాన్ని కాపాడాల్సిన స్పీకర్‌ చర్యలు తీసుకుంటామని చెప్పడమే తప్ప చేసిందేమి లేదు. కాంగ్రెస్‌ ను వీడి ఇతర పార్టీల్లో చేరిన వాళ్లంతా ద్రోహం చేశారన్న రేవంత్‌ మాటలు నిజమే అనుకుంటే.. బీజేపీ, బీఆర్‌ఎస్‌, టీడీపీని రేవంత్‌ మోసం చేసి వచ్చేనట్టేకదా. దశాబ్దాల తరబడి కాంగ్రెస్‌ లో ఉన్న నేతలను కాదని రేవంత్‌ రెడ్డిని కాంగ్రెస్‌ పార్టీ అధినాయకత్వం ముఖ్యమంత్రిని చేసింది. రాజ్యాంగాన్ని రక్షించే గొప్ప బాధ్యతల్లో ఉన్న ముఖ్యమంత్రి, తాను సభా నాయకుడిగా ఉన్న అసెంబ్లీలో మహిళ సభ్యులను కించ పరిచేలా మాట్లాడటం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడం కాదా? ఇలాంటి వికృత రాజకీయ క్రీడ తాత్కాలికంగా వినోదాన్ని ఇవ్వొచ్చు.. కానీ రాజకీయాల్లో ఈ సంస్కృతి వాంఛనీయం కాదు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్‌ తనను తాను సంస్కరించుకుంటారో.. తాను చేసేదే కరెక్ట్‌ అనుకుని అదే దారిలో ముందుకెళ్తారో చూడాలి మరి. రేవంత్‌ తీరు మార్చుకోకుంటే తాను మునగడమే కాదు.. కాంగ్రెస్‌ పార్టీని నడి సంద్రంలో ముంచేయడం ఖాయం.

Next Story