సెల్ఫ్‌ గోల్‌ సీఎం!

మోటార్లకు మీటర్లపై అడ్డంగా బుక్కైన రేవంత్‌ రెడ్డి.. సమైక్య పాలనను ఒకసారి సమర్థిస్తూనే.. ఆ వెంటనే విమర్శలు

సెల్ఫ్‌ గోల్‌ సీఎం!
X

అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌ రెడ్డి సెల్ఫ్‌ గోల్స్‌ కంటిన్యూ చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ను, కేసీఆర్‌ ను తెలంగాణ ప్రజల దృష్టిలో విలన్‌ గా చూపించాలని ప్రయత్నించి అడ్డంగా బుక్కైపోతున్నారు. గృహ విద్యుత్‌ వినియోగానికి స్మార్ట్‌ మీటర్లు పెట్టాలనే అంశాన్ని మెటార్లకు మీటర్లుగా అన్వయించే ప్రయత్నం చేసి బొక్కబోర్లా పడ్డారు. ఇదిగిదిగో కేసీఆర్‌ చేసిన మోసం.. ద్రోహం.. ఆ ద్రోహంతో.. ఆ దుర్మార్గుపు ఒప్పందాలతో విద్యుత్‌ సంస్థల మెడమీద కత్తి వేలాడుతోంది.. విధిలేని పరిస్థితుల్లో స్మార్ట్‌ మీటర్లు పెట్టాల్సిన దుస్థితి వచ్చింది.. అని తనకేదో రైతులపై మాటల్లో చెప్పలేనంత ప్రేమ ఉన్నట్టు నమ్మించే ప్రయత్నం చేశారు. కేసీఆర్‌ ద్రోహం చేశారు కాబట్టే బాయిల కాడ ఇక స్మార్ట్‌ మీటర్లు పెట్టి రైతులు వినియోగించే కరెంట్‌ ను లెక్కిస్తామని ఒప్పేసుకున్నారు. ఈ సందర్భంగా మోదీ సమక్షంలో కేసీఆర్ చేసుకున్న ఒప్పందం ఇదిగోనంటూ ఒక అగ్రిమెంట్‌ ను అసెంబ్లీలో చదివి వినిపించారు. ఆ అగ్రిమెంట్‌ ఏమిటో.. దాని వెనుకున్న ముచ్చట ఏమిటో మాజీ మంత్రి హరీశ్‌ రావు క్లారిఫికేషన్ కు అవకాశం ఇవ్వమన్నా సభలో ఇవ్వకుండా.. తన వాదననే అన్ని పత్రికల్లో బ్యానర్లుగా వచ్చేలా సూపర్‌ మేనేజ్‌మెంట్‌ చేశారు. అదే రోజు సభ వాయిదా పడిన తర్వాత మాజీ మంత్రి హరీశ్‌ రావు అసెంబ్లీ మీడియా పాయింట్‌ లో ఉదయ్‌ స్కీంలో భాగంగా చేసుకున్న ఒప్పందాన్ని చూపించి సీఎం రేవంత్‌ రెడ్డి సభను తప్పుదోవ పట్టించారని చెప్పినా అనేక మీడియా సంస్థలు సీఎం సభలో చేసిన కామెంట్స్‌ ను మాత్రమే హైలైట్‌ చేశాయి.

సోమవారం సభ ప్రారంభమైన తర్వాత ఎనర్జీ డిమాండ్స్‌ పై చర్చ సందర్భంగా మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి శనివారం సీఎం సభను ఎలా తప్పుదోవ పట్టించారో సాక్ష్యాలతో సహా బయట పెట్టారు. ఉదయ్‌ స్కీంలో భాగంగా అప్పటి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని చూపించి బాయిలకాడ మోటార్లకు మీటర్లకు పెట్టాలన్నట్టుగా సభను సీఎం తప్పుదోవ పట్టించారని, రికార్డులు సరి చేయాలని డిమాండ్‌ చేశారు. ''ఇన్‌స్టలేషన్‌ ఆఫ్‌ స్మార్ట్‌ మీటర్స్‌ ఫర్‌ ఆల్‌ కన్జ్యూమర్స్‌ అదర్‌ దేన్‌ అగ్రికల్చర్‌ కన్జ్యూమర్స్‌ కన్జ్యూమింగ్‌ ఎబవ్‌ 500 యూనిట్స్‌/మంథ్‌ బై 31 డిసెంబర్‌ 2018 అండ్‌ కన్జ్యూమర్స్‌ కన్జ్యూమింగ్‌ ఎబవ్‌ 200 యూనిట్స్‌ / మంథ్‌ బై 31 డిసెంబర్‌ 2019'' అని ఉదయ్‌ అగ్రిమెంట్‌ లో ఉంటే సీఎం.. ''అదర్‌ దేన్‌ అగ్రికల్చర్‌'' అనే పదాలను ఉద్దేశపూర్వకంగా చదవకుండా సభను తప్పుదారి పట్టించారు. వ్యవసాయ విద్యుత్‌ మోటార్లకు మీటర్లు బిగిస్తే ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిలో 0.5 శాతం అదనంగా అప్పులు తీసుకునే సదుపాయం కల్పిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది కరోనా లాక్‌ డౌన్‌ తర్వాత. అంతకన్నా ఎన్నో ఏండ్ల ముందే చేసుకున్న ఉదయ్‌ స్కీం అగ్రిమెంట్‌ తో సభను తప్పుదారి పట్టించాలని చూసి అడ్డంగా బుక్కయ్యారు. తమ ప్రభుత్వం వ్యవసాయ మీటర్లకు మోటార్లు పెట్టాలని చూడటం లేదని ఇప్పుడు బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు.

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఐటీ, ఫార్మా, హాస్పిటాలిటీ ఇండస్ట్రీస్‌ కు 24 గంటల కరెంట్‌ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని, వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా రంగాలతో పాటు హైదరాబాద్‌ నగానికి 24 గంటలు కరెంట్‌ సరఫరా చేశారని సభలో సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించి మరో సెల్ఫ్‌ గోల్‌ చేసుకున్నారు. 2014కు ముందు హైదరాబాద్‌ లోనూ పవర్‌ కట్స్‌ ఉండేవి. పరిశ్రమలకు పవర్‌ హాలిడేలు ఉండేవి. కరెంట్‌ భారాన్ని తప్పించుకునేందుకు వారంలో ఒక రోజు పవర్‌ హాలిడే తప్పనిసరి అని అప్పటి ప్రభుత్వం తేల్చిచెపితే వాటిని వ్యతిరేకిస్తూ ఇండస్ట్రియలిస్టులు ధర్నా చౌక్‌ లో ఆందోళనకు కూర్చున్న ఉదంతాలెన్నో ఉన్నాయి. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ బొక్క పెద్దది చేస్తున్నప్పుడు నాయిని నర్సింహారెడ్డి కడప జిల్లాకు ఇన్‌చార్జీ మంత్రిగా ఉన్నారని మరోసారి సభను నమ్మించే ప్రయత్నం రేవంత్‌ చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ విస్తరణకు వైఎస్‌ ప్రయత్నించడానికి ముందే బీఆర్‌ఎస్‌ కు చెందిన ఆరుగురు మంత్రులు రాజశేఖర్‌ రెడ్డి కేబినెట్‌ నుంచి తెలంగాణ సాధన కోసం తప్పుకున్నారు. పోతిరెడ్డిపాడు విస్తరణతో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని అసెంబ్లీ సాగినన్ని రోజులు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు (అప్పటి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు) నిరసన కొనసాగించారు. ప్రతి రోజు సభకు ఏదో ఒక రూపంలో అడ్డు తగిలారు. సభలో సమైక్య పాలనను ఒకసారి సమర్థిస్తూనే ఆ వెంటనే విమర్శలు గుప్పించారు. అప్పటి సమైక్య పాలకులతో కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ లీడర్లే అంటకాగారని ఆరోపణలు చేశారు. అవి అవాస్తవాలైనా వాటిని కప్పిపుచ్చి తాను చెప్పిందే నిజమని ప్రజలను నమ్మించే ప్రయత్నాలను రేవంత్‌ కొనసాగించడం.. బొక్కబోర్లా పడటం పరిపాటిగా మారింది.

Next Story