అధికారం కోసం ఆత్మవంచన

అధికారం పోయాక ఆరు నెలలు కూడా పదవులు లేకుండా ఉండలేకపోతున్నారు. పార్టీ వీడటానికి వాళ్లు చెబుతున్న కారణాలు హాస్యాస్పదంగా ఉన్నాయి.అందుకే పార్టీ వీడిన వాళ్లపై నెటీజన్లు సెటైర్లు వేస్తున్నారు.

అధికారం కోసం ఆత్మవంచన
X

దశాబ్దాల పోరాటం, త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. నాడు ఉద్యమంలో పోరాటానికి నాయకత్వం వహించిన కేసీఆర్‌పై, ఆయన కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేసినా వెనక్కి పోలేదు. అలా ఉద్యమాన్ని బలహీనపరచడానికి కేసీఆర్‌, తెలంగాణ ఉద్యమకారులను దూషించింది ఇక్కడి నేతలే. అయినా రాష్ట్ర విభజన అనంతరం వాటన్నింటినీ ఏవీ మనసులో పెట్టుకోకుండా రాష్ట్ర పునర్‌ నిర్మాణంలో అనుభవజ్ఞులైన వాళ్లు ఉండాలనే ఉద్దేశంతో కే కేశవరావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి లాంటి వాళ్లను పార్టీలోకి ఆహ్వానించి అధికారంలో ఉన్నంత కాలంలో వాళ్లకు అనేక అవకాశాలు కల్పించారు. కీలక బాధ్యతలు అప్పగించారు. అధికారం ఉన్నంత కాలం కేసీఆర్‌ వాళ్ల దృష్టిలో దేవుడు. అపర భగీరథుడు. తెలంగాణను దేశంలో అగ్రగామిగా నిలిపిన నాయకుడు.

కానీ అధికారం పోయాక ఆరు నెలలు కూడా పదవులు లేకుండా ఉండలేకపోతున్నారు. పార్టీ వీడటానికి వాళ్లు చెబుతున్న కారణాలు విన్నవారికి వీళ్లనా ఇంతకాలం కేసీఆర్‌ పెంచి పోషించింది అనే పెదవి విరిచేలా వాళ్ల వ్యవహారం ఉన్నది. పదవులు త్యాగం చేయడంలో దేశంలో బహుశా కేసీఆర్‌లా వదులుకుని ఉండడు. అంతేకాదు ఒక రాష్ట్ర సాధన కోసం ఎవరూ పడనని తిట్లు, నిందలు మోశాడు. అయినా వెనక్కి తగ్గలేదు. లక్ష్యాన్ని విడిచిపెట్టలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం, వచ్చిన రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి ముందుకు తీసుకెళ్లాలనే దీర్ఘకాలిక ప్రణాళికలు, వ్యూహం వల్లనే అనతి కాలంలోనే స్వరాష్ట్రంగా తెలంగాణ దేశముందు తలెత్తుకుని నిలబడింది. సంక్షేమం అంటే నాలుగు పథకాలు పెట్టి చేతులు దులుపుకోవడం అని కాకుండా వాటిద్వారా కొన్ని వందల కుటుంబలు పేదరికం నుంచి బైటపడి వాళ్ల జీవన విధానాలు మారాలనేది కేసీఆర్‌ ఉద్దేశం. అందుకే ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే కాకుండా అనేకం అమలు చేశారు. తెలంగాణ వస్తే ఏమొస్తది అన్నవాళ్లే తమ వ్యాఖ్యలను సవరించుకునేలా సంక్షేమాన్ని, అభివృద్ధిని చూపెట్టారు. ఇదీ తెలంగాణ అని గర్వంగా చెప్పుకునేలా తీర్చిదిద్దారు. అయినా ప్రజలు కొన్ని అసత్య ప్రచారాల వల్ల మార్పు కోరుకున్నారు. దీన్ని స్వాగతించారు. గెలుపోటములు కొత్తకాదు అని తెలంగాణ ప్రజల హక్కులు, ప్రయోజనాల కోసం పద్నాలుగేళ్లు ఉద్యమం చేశాం. పదేళ్లు ఉద్యోగం చేశాం. రానున్న ఐదేళ్లు మళ్లీ ఉద్యమిస్తామన్నారు.

ఇప్పడు పార్టీ వీడుతున్న వాళ్లంతా మీరే మా నాయకుడు, మీలాంటి ముఖ్యమంత్రిని మా దశాబ్దాల రాజకీయ జీవితం చూడలేదు అని కీర్తించారు. అతి వినయం ధూర్త లక్షణం అంటారు పెద్దలు. అందుకే పార్టీ వీడిన వాళ్లపై సోషల్‌ మీడియా వేదికగా సెటైర్లు వేస్తున్నారు. ఇన్ని మాటలు చెప్పిన వాళ్లు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు? ఏమీ చెప్పలేరు. ఎందుకంటే వీళ్లంతా ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకమని వాళ్ల మాటలు, వాళ్ల అవకాశవాద రాజకీయాలు చూసిన వాళ్లకు ఇట్టే అర్థమౌతున్నది. మార్పు మంచిదే. నదీ ప్రవాహం వచ్చినప్పుడు పాత నీళ్లు కొట్టుకుపోయి కొత్త నీళ్లు వస్తాయి. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. దానికి ఉదాహరణ ఎన్నికలకు మూడు నెలల ముందు కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి ఏమిటో మనం చూశాం. కానీ ప్రజలు ఇచ్చిన తీర్పు ఒక విషయాన్ని స్పష్టం చేసింది. ఎన్నికలకు ముందు ఎన్నికలు అయిపోయాక రాష్ట్రంలో హంగ్‌ వస్తుందని, ఏ పార్టీకి మెజారిటీ రాదని కొన్ని సర్వే సంస్థలు, కొంత మంది సెఫాలజిస్టులు అంచనా వేశారు. కానీ ప్రజలు మాత్రం సుస్థిర ప్రభుత్వానికే ఓటు వేశారు. బలమైన ప్రతిపక్షం ఉండాలని తీర్పు చెప్పారు. ప్రజాతీర్పును అపహాస్యం చేసేలా రేవంత్‌ సర్కార్‌ వ్యవహరిస్తున్న తీరు రానున్నరోజుల్లో భారీ మూల్యం చెల్లించక తప్పదు. దీనివల్ల రాష్ట్రంలో ఏర్పడే రాజకీయ సంక్షోభానికి ప్రధాన కారకుడు రేవంత్‌ మాత్రమే. ఇప్పడు ఆయన నాయకత్వాన్ని బలపరచడానికి పార్టీ వీడుతున్నామంటున్న వాల్లంతా తమ రాజకీయ జీవితాన్ని రేవంత్‌ కోసం బలిపెడుతున్నారు అన్నది రానున్న రోజుల్లో తేలిపోతుంది. అయితే అప్పటికీ ఏమీ ఉండదు.

ఎలాంటి పదవులు లేకుండా దశాబ్దకాలానికి పైగా పోరాటం చేసిన చరిత్ర బీఆర్‌ఎస్‌ది. పదవులను తృణప్రాయంగా వదులుకున్న చరిత్ర బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులది. పార్టీని బలహీనపరచడానికి నాటి ఉమ్మడి పాలకులు చేసిన ప్రతీసారి వాళ్లకు షాక్‌ తగిలేలా ప్రజా తీర్పులతో సమాధానం దొరికింది. తనయుల కోసమో, తమ స్వార్థం కోసమో పార్టీ వీడుతున్న వారికి రానున్నరాజుల్లో రేవంతే షాక్‌ ఇస్తాడు. ఉద్యమ కాలంలో ఉద్యమకారులపై రైఫిల్‌ ఎక్కుపెట్టిన ఆయనే రాష్ట్రావిర్భావ అనంతరం తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడానికి, విఫల రాష్ట్రంగా చేయడానికి చంద్రబాబు చేసిన కుట్రలను అమలు చేసింది రేవంతే అన్నది అందరికీ తెలిసిందే. నాడు ఉద్యమంలో లేడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక తెలంగాణ సోయితో పనిచేయడం లేదు. అలాంటి ఆయనను మోయడానికి వెళ్లున్న వారిని మోసం చేసేది ఆయనే. అలాంటి ఆయనను నిలబెడుదామని అనుకుంటున్న వాళ్లు అన్నివిధాలుగా నష్టపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఆ రోజులు కూడా త్వరలోనే రానున్నాయి.

Raju

Raju

Writer
    Next Story