ఈడబ్ల్యూఎస్ కు రూ.8 లక్షలు.. రేషన్ కార్డులకు రూ.లక్షన్నర!?

పెద్దల విషయంలో ఉదారంగా.. పేదలకైతే కఠినంగా నిబంధనలు.. ఇందిరమ్మ రాజ్యమంటే ఇదేనా?

ఈడబ్ల్యూఎస్ కు రూ.8 లక్షలు.. రేషన్ కార్డులకు రూ.లక్షన్నర!?
X

ఇందిరమ్మ రాజ్యంలో అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొర్రీలతో కోతలు పెట్టే ప్రయత్నానికి తెరతీసింది. నిరుపేదలు, పేదలు, దిగువ మధ్య తరగతి వాళ్లకు ఆహార భద్రతతో పాటు వివిధ సంక్షేమ పథకాలకు అర్హులుగా గుర్తింపు కోసం.. అత్యవసర సమయాల్లో వైద్య చికిత్సలకు రేషన్ కార్డులు తప్పనిసరి. రేషన్ కార్డుల జారీ కోసం సివిల్ సప్లయీస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం సిఫార్సులు చూస్తుంటే కొత్త రేషన్ కార్డులు కొందరికే పరిమితం చేసే కుట్ర ప్రస్ఫుటమవుతోంది. కొత్త రేషన్ కార్డుల జారీకే కోతలు పెడితే రేపు తప్పిదారి ఇంకేదైనా సంక్షేమ పథకాలు అమలు చేసినా అర్హుల సంఖ్యను భారీగా తగ్గించుకోవచ్చు అనేది ప్రభుత్వ ప్రయత్నంగా కనిపిస్తోంది. పెద్ద కులాల్లోని పేదలకు ఉదారంగా రిజర్వేషన్లు అమలు చేస్తున్న ప్రభుత్వం పేదలకు రేషన్ కార్డులిచ్చే విషయంలో మాత్రం ఎందుకిన్ని కొర్రీలనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

గ్రామీణ ప్రాంతాల్లోని వారికి ఏడాదికి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లోని వారికి రూ.2 లక్షల వరకు అంతకన్నా తక్కువ ఆదాయం ఉంటేనే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో వరి లేదా నీటి ఆధారిత పంటలు పండే భూమి మూడున్నర ఎకరాల వరకు, చెలుక భూములు ఏడున్నర ఎకరాల వరకు ఉన్నోళ్లు రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షల ఆదాయం అంటే.. వంద రోజులు ఉపాధి హామీ కూలీ పని చేసేటోళ్లు సైతం కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులవుతారు. ఉపాధి హామీ పనులు జాబ్ కార్డుతో లింక్ అయి ఉంటాయి. పోస్ట్ ఆఫీస్ ఖాతాల ద్వారా వారి కూలి చెల్లిస్తారు. ఈ లెక్కలు తీస్తే గ్రామాల్లో అసలు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులైన కూలీ కుటుంబాలే ఉండవు. లేబర్ కార్డులతో ఇతర పనులు చేసే కూలీలు, ఏ కార్డులు లేకుండా నిత్యం పని చేసి జీవనం సాగించే వాళ్లు సైతం సర్కారు నిబంధనలతో అనర్హులుగా మారుతారు. వ్యవసాయ, ఉపాధి హామీ, దినసరి కూలీలతో పోలిస్తే భూములు ఉన్న రైతులకే కొంత ప్రయోజనం చేకూర్చేలా కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులున్నాయి.

పట్టణ ప్రాంతాల్లో రేషన్ కార్డుల జారీకి ఒకే ఒక్క అర్హత ఏడాదికి రూ.2 లక్షల లోపు ఆదాయం. అది ఒక కుటుంబం మొత్తం కలిసి సంపాదించే మొత్తం. పట్టణ ప్రాంతాల్లో భార్యాభర్తలిద్దరూ పని చేస్తే తప్ప కుటుంబాలను పోషించుకోలేరు. ప్రైవేట్ సంస్థల్లో చిన్న తరహా ఉద్యోగాలు చేసినా ఇద్దరు కలిసి నెలకు రూ.20 వేలు అంతకన్నా కొంత ఎక్కువే సంపాదించొచ్చు. ఇంటి అద్దె, ఇతర ఖర్చులు పోను వారు ప్రతినెలా అప్పులు చేసి బతుకు బండి లాగాల్సిందే. ఇక రోజు కూలీకి వెళ్లినా సర్కారు పెట్టిన బార్డర్ లైన్ ను దాటి ఆదాయం సంపాదిస్తారు. సంపాదించే మొత్తంతో వాళ్లు రెండు పూటల కడుపునిండా తినలేని దుస్థితిలోనే ఉంటున్నారు. ప్రభుత్వం ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కోటాలో అగ్రవర్ణాల్లోని పేదలను గుర్తించేందుకు వారి కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షలుగా నిర్ణయించింది. అంటే ఒక కుటుంబం ఏటా రూ.8 లక్షల వరకు సంపాదించినా వారి వారసులకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు దక్కుతాయి. పెద్ద కులాల్లోని పేదలను ఆదుకోవడాన్ని ఎవరూ తప్పుబట్టడం లేదు. అంతే ఉదారత పేదలకు రేషన్ కార్డులు ఇచ్చే విషయంలో ఎందుకు ప్రదర్శించడం లేదు? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తమ ప్రభుత్వం రాకముందే తెచ్చారని కాంగ్రెస్ నేతలు తప్పించుకోవాలని చూడొచ్చు.. ఆ రిజర్వేషన్లను సమీక్షించే అధికారం వారి చేతుల్లో ఉందన్న వాస్తవాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు ఎంత ఉదారంగా వ్యవహరించారో పేదలకు రేషన్ కార్డులిచ్చే విషయంలోనూ అందే ఉదారత ప్రదర్శించాలి. లేకుంటే రేపు రేషన్ కార్డులు అందని కుటుంబాల ప్రతిఘటనను ఎదుర్కోవడానికి రేవంత్ ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి.

Next Story