మీ తొమ్మిది నెలల పాలనపై సమీక్ష చేసుకోండి సీఎం గారూ

ఆ తర్వాత హరీశ్‌ రాజీనామా గురించి ఆలోచించండి. ఎందుకంటే రాజీనామాలు బీఆర్‌ఎస్‌కు, ఆ పార్టీ నేతలకు కొత్తకాదు.

మీ తొమ్మిది నెలల పాలనపై సమీక్ష చేసుకోండి సీఎం గారూ
X

అబద్ధాలు ఆడటంలో, నాలుక మడతేయడంలో సీఎం రేవంత్‌రెడ్డిని మించిన వారు ఎవరూ ఉండరు. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న హరీశ్‌ రావు రాజీనామా చేయాలి. లేదంటే రైతాంగానికి క్షమాపణ చెప్పాలని సీఎం డిమాండ్‌ చేయడం హాస్యాస్పదంగా ఉన్నది. పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్ర రైతాంగానికి రేవంత్‌ ఏ హామీ ఇచ్చారు. సీఎం అయ్యాక ఏం చేశారు అన్నది ఆత్మపరిశీలన చేసుకున్న తర్వాత ఎవరు రాజీనామా చేయాలి? ఎవరు అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయాలి అన్నది తెలంగాణ ప్రజలు తేలుస్తారు. డిసెంబర్‌ 9 రుణమాఫీ చేస్తామని, వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం తొమ్మిది నెలల కాలంలో ఆర్టీసీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్పా ఏ ఒక్క హామీని అమలు చేయలేదు.

రుణమాఫీలో అందరికీ అమలుకాలేదని, దానికి సాంకేతిక సమస్యలు కారణమని ఇవాళే సీఎం స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో చెప్పారు. ఆ ప్రసంగం చేసిన కొన్ని గంటల్లోనే బీఆర్‌ఎస్‌ హాయంలో ప్రారంభమై, పూర్తయిన ప్రాజెక్టుకు స్విచ్‌ ఆన్‌ చేసి ఆ నీళ్ల చూసిన సంబరంలో సీఎం పొద్దటి ముచ్చట మరిచిపోయారు కావొచ్చు. ఎలాంటి కండీషన్లు పెట్టకుండా ఏకకాలంలో రుణమాఫీ చేస్తామన్నారు. రైతులంతా వెంటనే బ్యాంకులకు వెళ్లి రూ. లక్షలు తెచ్చుకోండి. మా ప్రభుత్వం రాగానే డిసెంబర్‌ 9 ఎలాంటి కండీషన్లు లేకుండా మొత్తం మాఫీ చేస్తామన్నారు. ఇప్పటి వరకు రెండు విడుతలుగా చేసిన మాఫీలో లక్షలాది మంది రైతులకు రుణమాఫీ కాలేదని రైతులు, ప్రధాన ప్రతిపక్షం, మరో విపక్షం బీజేపీ అంకెలతో సహా వెల్లడిస్తున్నారు. వాస్తవాలు ఇలా ఉంటే మొత్తం రుణ మాఫీ అయిపోయనట్టు. దేశంలో ఇది వరకు ఎవరూ చేయలేదు అన్నట్టు రేవంత్‌ మాట్లాడటం ఆయన అవగాహన రాహిత్యాన్ని సూచిస్తున్నది. యూపీఏ హయాంలో కేంద్ర ప్రభుత్వం హామీ మేరకు ఉమ్మడి రాష్ట్రంలో రుణ మాఫీ అయ్యింది. కానీ కేసీఆర్‌ ఒకవైపు సంక్షేమం, అభివృద్ధితో పాటు ప్రాధాన్య రంగాల వారీగా సాగు నీరు, తాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తూనే రూ. లక్ష వరకు విడతల వారీగా రుణమాఫీ చేశారు. అలాగే రెండ పంటలకు రైతు బంధు ఇచ్చారు. తొమ్మిది నెలల రేవంత్ పాలనలో రైతు బంధు లేదు. రైతు భరోసా త్వరలోనే ప్రారంభిస్తామని ఇవాళే సీఎం చెప్పారు. మరి ఏం సాధించారని విపక్ష నేతల రాజీనామా కోరుతున్నారు.

జనాలకు అబద్ధాలు చెప్పాలని, వాళ్లు మా నుంచి అవే కోరుకుంటున్నారని రేవంత్‌ అభిప్రాయం. అలాగే తాను ఇవ్వని ఉద్యోగాల గురించి, వారి హయాంలో నిర్ణయం తీసుకోని ఉపాధ్యాయు ప్రమోషన్ల గురించి, గత ప్రభుత్వం ప్రారంభించిన పూర్తి చేసిన ప్రాజెక్టుల గురించి నగరంలో పెద్ద పెద్ద హోర్గింగులు పెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నారు. ఇట్లా అయినా తనను గుర్తిస్తారని ఆయన కు ఆయన ఊహించుకుంటున్నారు. రుణమాఫీ కాదు కాదా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్‌ ఇచ్చిన ఏ హామీ ఇప్పటికీ సంపూర్ణంగా అమలు కాలేదు. రాష్ట్రంలో ప్రజా పాలన పడకేసిందని గ్రామాలు, మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యాన్ని చూస్తే.. ఇంటర్నేషనల్‌ స్కూలు నిర్మిస్తామన్న వాళ్లు ఉన్న గురుకులాల్లోనే పురుగుల అన్నం తిని అనారోగ్యం పాలై పిల్లలు చనిపోతున్నారు. గురుకులాల్లో అసౌకర్యాలతో పసి పిల్లలు పడుతున్న అవస్థలు మొన్ననే మీ డిప్యూటీ సీఎం, మరో మంత్రి వెళ్లి చూశారు. ఇవన్నీ మీ తొమ్మిది నెలల్లో సాధించిన ఘనకార్యాలు. వీటిపై వీలైతే సమీక్ష చేసుకోండి. ఆత్మపరిశీలన చేసుకుని పరిష్కరించే ప్రయత్నం చేయండి. అంతేగానీ ఇంకా ఏతులు కొట్టుకుంటూ.. అంతా మేమే చేశామని మీ గురువు చంద్రబాబు లెక్క మీడియా మేనేజ్‌మెంట్‌ ద్వారా కాలం వెళ్లదీస్తామంటే 'కాలంబు రాగానే కాటేసి తీరాలి' అన్న కాళోజీ మాటను ఆచరణలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. వాస్తవాలను విస్మరిస్తే అవి మరో రూపంలో ప్రతీకారం తీర్చుకుంటాయి.

Raju

Raju

Writer
    Next Story