రేవంత్ నిజస్వరూపం బయట పడ్డది

రైతులను నమ్మించి.. దేవుళ్లపై ఒట్లు వేసి మోసం చేసిండు.. : మాజీ మంత్రి హరీశ్ రావు

రేవంత్ నిజస్వరూపం బయట పడ్డది
X

రేవంత్ రెడ్డి నిజ స్వరూపం బయట పడ్డదని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని, రైతులందరూ వెళ్లి రూ.2 లక్షల వరకు లోన్లు తెచ్చుకోవాలని నమ్మించి తీరా సమయానికి నిండా ముంచారని ఆయన మండిపడ్డారు. ఆలేరు, జనగామ నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన రుణమాఫీ ధర్నాల్లో గురువారం ఆయన పాల్గొని మాట్లాడారు. అంతకుముందు రేవంత్ రెడ్డి దేవుళ్లపై ఒట్టు పెట్టి రుణమాఫీ చేయలేదని, రేవంత్ ఒట్టు నిలబెట్టుకోనందుకు దేవుళ్లు ప్రజలను శిక్షించొద్దని కోరుతూ యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఆయన పూజలు నిర్వహించారు. అనంతరం ధర్నాల్లో పాల్గొని మాట్లాడుతూ, రూ.2 లక్షల రుణాలు మాఫీ చేస్తానన్న తన మాటలు జనం నమ్మేటట్టు లేరని రేవంత్ ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడిపై ఒట్టు పెట్టి నమ్మించారని తెలిపారు. ప్రభుత్వం పంద్రాగస్టులోపు రుణమాఫీ చేస్తే తాను రాజీనామా చేస్తానని.. చేయకుంటే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని సవాల్ విసిరానని గుర్తు చేశారు. వైరా సభలో రూ.2 లక్షల వరకు ఉన్న రైతురుణాలు మాఫీ చేశామని సీఎం చెప్పారని.. ఆయన ఏ ఊరికి, ఏ మండలానికి రమ్మంటే తాను అక్కడికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. 49 మంది లక్షల మంది రైతుల రుణాలు మాఫీ చేయాల్సి ఉండగా కేవలం 22 లక్షల మంది రుణాలే మాఫీ చేశారని తెలిపారు. బ్యాంకర్ల మీటింగ్ లో రూ.7,500 కోట్ల రుణమాఫీ మాత్రమే జరిగిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారని గుర్తు చేశారు.

రుణమాఫీ విషయంలో దేవుడిపై ఒట్టు పెట్టి ప్రజలను మోసం చేశానని సీఎం తన తప్పు ఒప్పుకొని పాప పరిహారం చేయాలన్నారు. ఇది ఉద్యమాల పురిటిగడ్డ అని.. ఇక్కడ ఎవరూ రేవంత్ రెడ్డి లాంటి వాళ్లకు భయపడబోరన్నారు. కేసీఆర్ 11 విడతల్లో రూ.72 వేల కోట్ల రైతుబంధు ఇచ్చి రైతులను రాజులను చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. వడ్లకు క్వింటాల్ కు రూ.500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే ఇస్తామని మోసం చేశారన్నారు. జాబ్ క్యాలెండర్, మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీ, రూ.4 వేల పింఛన్, మహిళలకు రూ.2,500 సాయం లాంటి హామీలెన్నో ఇచ్చి రేవంత్ ప్రజలందరినీ మోసం చేశారన్నారు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యేపై దాడికి ప్రయత్నించారని, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బంది పెట్టే పోలీసులు భవిష్యత్ లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కొండపోచమ్మ సాగర్ కింద వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. త్వరలోనే కేసీఆర్ రాష్ట్రంలోని రైతుల పక్షాన యాత్ర చేపడుతారని అన్నారు. సీఎం స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో మహిళా జర్నలిస్టులపై దాడి చేశారని, మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్ పై దాడి చేశారని.. బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి దాడులెన్నడూ జరగలేదన్నారు.

Next Story