రేవంత్‌ ఆరాటం.. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ప్రాణసంకటం

అనర్హత వేటుపై ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ లీగల్‌ ఫైట్‌.. ఉప ఎన్నికలు తప్పవంటూ సంకేతాలు

రేవంత్‌ ఆరాటం.. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ప్రాణసంకటం
X

సీఎం రేవంత్‌ రెడ్డి ఆరాటం ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ప్రాణసంకటంగా మారింది. బీఆర్‌ఎస్‌ బీఫాంపై గెలిచి కాంగ్రెస్‌ లో చేరిన ఎమ్మెల్యేల పై వేటు తప్పదని తెలుస్తోంది. దీనిపై బీఆర్‌ఎస్‌ ఢిల్లీలో లీగల్‌ ఫైట్‌ కు ప్రయత్నాలు మొదలు పెట్టడం ఫిరాయింపు ఎమ్మెల్యేల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లోపే బీఆర్‌ఎస్‌ ఎల్పీ కాంగ్రెస్‌ లెజిస్లేటివ్‌ పార్టీ (సీఎల్పీ)లో విలీనం అవుతుందని, ఆ పార్టీలో కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌ రావు తప్ప ఇంకెవరూ మిగలరని సీఎం రేవంత్‌ రెడ్డి గట్టిగా చెప్పడంతో కొందరు ఎమ్మెల్యేలు నమ్మారు. ఒకరి తర్వాత ఒకరుగా పది మంది కాంగ్రెస్‌ గూటికి చేరారు. ఆ తర్వాత వలసలకు బ్రేకులు పడ్డాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు భరోసా ఇవ్వడంలో సీఎం రేవంత్‌ రెడ్డి విఫలం కావడంతో నలుగురు ఎమ్మెల్యేలు ఘర్‌ వాపసీకి రెడీ అయ్యారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ లో చేరినట్టేనని ప్రకటించి.. మంత్రి జూపల్లి జోక్యంతో రెండు పడవలపై ప్రయాణిస్తున్నారు. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు ఎప్పుడెప్పుడు గాంధీ భవన్‌ గేట్లు దూకేసి పారిపోదామా అనే ప్రయత్నాల్లో ఉన్నారు. మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఆధ్వర్యంలో విందు రాజకీయాలు సాగించినా అవి పూర్తి స్థాయిలో నెరవేరలేదు. ఎమ్మెల్యే పదవులకు ఎలాంటి ప్రమాదం ఉండదు.. ఎల్పీ మెర్జ్‌ అవుతుంది.. అందరూ ఆటోమేటిక్‌ గా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలుగా మారిపోతారు అని తమను నమ్మించారని, ఇప్పుడు మెర్జర్‌ లేకపోవడంతో ఏ క్షణమైనా తమపై అనర్హత వేటు పడొచ్చు అని ఫిరాయింపు ఎమ్మెల్యేలు తమ సన్నిహితుల దగ్గర వాపోతున్నారు.

ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకోవడంలో రేవంత్‌ రెడ్డికి ఒక స్ట్రాటజీ, గేమ్‌ ప్లాన్‌ అంటూ లేకపోవడంతో మొదటికే మోసం వచ్చింది. కేసీఆర్‌ గతంలో కాంగ్రెస్‌, టీడీపీ ఎమ్మెల్యేలను చేర్చుకోలేదా.. అట్లాగే తాను చేర్చుకుంటాను.. కేసీఆర్‌ దగ్గర అసలు ఎవరు మిగులుతారో లెక్కపెట్టుకోవాలని రేవంత్‌ రెచ్చగొట్టారు. ఒకానొక దశలో రేవంత్‌ చెప్పింది నిజమే కాబోలు అనిపించింది. కేసీఆర్‌ ను కలిసిన తర్వాత కూడా కొందరు ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌ ను వీడి రేవంత్‌ సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. ఇక రేవంత్‌ ది పై చేయి కావడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో ఫిరాయింపులకు, కండువాలు మార్చే క్రతువుకు రాహుకాలం వచ్చేసింది. ఫిరాయింపులను ఎలా హ్యాండిల్‌ చేయాలనే అనుభవం రేవంత్‌ కు లోపించింది. కాంగ్రెస్‌ లోని మిగతా సీనియర్‌ లీడర్లు.. ''ఏం జరుగుతుందో చూద్దాం.. ఎంతదూరం పరుగెత్తుతారో వెయిట్‌ చేద్దాం..'' అన్న ధోరణిలో తమకేమి పట్టనట్టుగా ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. ''ఫలానా వాళ్లను చేర్చుకుంటున్నామని మాకేమైనా చెప్తున్నారా.. మా జిల్లాలో ఎమ్మెల్యేను చేర్చుకుంటే నాకు కనీసం చెప్పలేదు.. అదే నియోజకవర్గం నుంచి దశాబ్దాల తరబడి కాంగ్రెస్‌ కు సేవ చేస్తున్న సీనియర్‌ లీడర్‌ ఉన్నారు.. ఆయనకూ సమాచారం ఇచ్చిన పాపాన పోలేదు.. రేవంత్‌, పొంగులేటి కలిసి మొత్తం పెంట పెంట చేశారు.. ఇప్పుడైతే అంతా సర్దుకున్నట్టే కనిపిస్తున్నది.. రేపు ఎప్పుడు ఎట్లాగైనా బ్లాష్ట్‌ కావొచ్చు.. అలా జరగదని చెప్పలేం కూడా..'' అని ఒక సీనియర్‌ మంత్రి తన సన్నిహితుల దగ్గర కామెంట్‌ చేశారు. అంటే ఫిరాయింపులపై సొంత పార్టీ లీడర్లకే సమాచారం ఉండటం లేదు. అదే కాంగ్రెస్‌ ను దెబ్బతీస్తుందన్న అభిప్రాయం సొంత పార్టీ లీడర్ల నుంచే ఎక్కువగా వినిపిస్తుంది.

కేసీఆర్‌ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకున్నా.. లెజిస్లేటివ్‌ పార్టీ మెర్జర్‌ అయ్యే వరకు ఏ ఒక్కరికి గులాబీ కండువాలు కప్పలేదు. తాము అభివృద్ధి కోసం బీఆర్‌ఎస్‌ తో కలిసి నడుస్తామని సదరు ఎమ్మెల్యేలు ప్రకటించడమే తప్ప వాళ్లు బీఆర్‌ఎస్‌ కండువా కప్పుకోలేదు. శాసన సభలో సభ్యుల సంఖ్యను బట్టి మూడింట రెండు వంతుల మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం వచ్చిన తర్వాత ఆయా ఎమ్మెల్యేలను ఎల్పీ మెర్జర్‌ ద్వారా అఫీషియల్‌ గానే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలుగా మార్చేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వారిపై వేటు పడకుండా కేసీఆర్‌ అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కాబట్టే వేటు కత్తి నుంచి అప్పుడు ఆ ఎమ్మెల్యేలు తప్పించుకోగలిగారు. కేసీఆర్‌ చేసిండు కాబట్టి అది ఒప్పు అని సమర్థించడం లేదు. చేసిన విధానాన్ని మాత్రమే ఉదహరిస్తున్నాం. ఎవరైనా ప్రజాప్రతినిధి ఎన్నికల్లో గెలిచిన పార్టీని వీడి ఇంకో పార్టీలో చేరిన రోజే ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వాళ్ల పదవి పోవాలి.. అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని నూటికి నూరుపాళ్లు నమ్మేవాళ్లం. అందుకే ఫిరాయింపులను కేసీఆర్ ప్రోత్సహించినా, రేవంత్‌ రెడ్డి కండువాలు కప్పినా అది రాజ్యాంగ విరుద్ధమే అని చెప్తున్నాం. కేసీఆర్‌ ఫిరాయింపులను తెరచాటున గుట్టుగా చేస్తే.. రేవంత్‌ బాహాటంగా కండువాలు కప్పి ఎమ్మెల్యేల భవిష్యత్తును ప్రమాదంలో పెట్టారు. బీఆర్‌ఎస్‌ ఎల్పీ మెర్జర్‌ కావాలంటే 26 మంది ఎమ్మెల్యేలు సొంత పార్టీని వీడి కాంగ్రెస్‌ లో చేరాలి. దీనిని సరిగా వర్కవుట్‌ చేయలేకపోయారు. ఒకరి తర్వాత ఒకరికి కండువాలు కప్పి కేసీఆర్ ను సైకలాజికల్‌ దెబ్బకొట్టబోతున్నట్టు ఫోజులు కొట్టారే తప్ప ఈ మొత్తం గేమ్‌ ప్లాన్‌ లో ఏ ఒక్క తప్పటడుగు పడినా మొదటికే మోసం వస్తుందని అంచనా వేయలేకపోయారు. ఎక్కడ రేవంత్‌ ఫెయిల్‌ అయ్యారో .. అక్కడే కేసీఆర్‌ గేమ్‌ స్టార్ట్‌ చేశారు. పోయినోళ్లు పోయిండ్రు.. ఉన్నోళ్లను జాగ్రత్త చేసుకుందాం అని వారిలో నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేశారు. రేవంత్‌ సర్కారుపై ప్రజా వ్యతిరేకత పెరుగుతోందని.. కాంగ్రెస్‌ లో చేరితే మొదటికే మోసం వస్తుందని చెప్పడంలో సక్సెస్‌ అయ్యారు. అందుకే వలసలకు బ్రేక్‌ పడింది. అదే సమయంలో రివర్స్‌ మైగ్రేషన్‌ కు గేట్లు తెరిచారు.

కేసీఆర్‌ గేమ్‌ ప్లాన్‌ వర్కవుట్‌ అయి గద్వాల ఎమ్మెల్యే ఘర్‌ వాపసీ రాగం ఎత్తుకున్నారు. జగిత్యాల, చేవెళ్ల ఎమ్మెల్యేలు మేము సైతం అన్నారు. భద్రాచలం ఎమ్మెల్యే ఊగిసలాటలో ఉన్నారు. గద్వాల ఎమ్మెల్యే అసెంబ్లీ లాబీల్లో కేటీఆర్‌ తో సమావేశమైన రోజు రాత్రి పోచారం ఇంట్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు విందు ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డి ఆ విందులో పాల్గొని ఫిరాయింపు ఎమ్మెల్యేల డిమాండ్లన్నీ నెరవేరుస్తామని.. తొందరపడి పార్టీ వీడొద్దని బుజ్జగించారు. ఆ మీటింగ్‌ కు దూరంగా ఉన్న గద్వాల ఎమ్మెల్యే ఇంటికి మంత్రి జూపల్లి వెళ్లి కాంగ్రెస్‌ లోనే కొనసాగాలని కోరారు. తానే స్వయంగా ఎమ్మెల్యేను వెంటబెట్టుకొని సీఎం ఇంటికి తీసుకెళ్లారు. ప్రస్తుతానికి అంతా గప్‌ చుప్‌.. రేవంత్‌ ఢిల్లీ వెళ్లొచ్చాక డిమాండ్లు నెరవేరిస్తే ఓకే లేకుంటే ఘర్‌ వాపసీ తప్పదనే ధోరణిలోనే నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. రేవంత్‌ అటాకింగ్‌ వ్యవహరించాల్సిన చోట ఫిరాయింపు ఎమ్మెల్యేల డిమాండ్లన్నింటికీ సరేనని తలూపారు. కాదూ కూడదు అంటే వాళ్లంతా చేజారుతారనే భయం రేవంత్‌ది.. ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేల డిమాండ్లను నెరవేర్చినా వాళ్లందరూ కాంగ్రెస్‌లోనే కొనసాగడం డౌటే. తమ పనులు కాకున్నా.. సొంత నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ లీడర్లు కర్రపెత్తనానికి ప్రయత్నించినా మళ్లీ ఘర్‌ వాపసీ రాగం ఎత్తుకోవడం అత్యంత సహజం. అంటే క్షణక్షణం భయంభయంగా వాళ్లను హ్యాండిల్‌ చేయాలి. ఈలోగానే బీఆర్‌ఎస్‌ లీగల్‌ ఫైట్‌ ముచ్చట ముందటికొచ్చింది. అసెంబ్లీలో ఎమ్మెల్యే దానం వ్యవహార శైలి కూడా దీనికి కొంత కారణం. దానం, కడియం, పోచారం లాంటి వాళ్ల వల్లనే బీఆర్‌ఎస్‌ ఫిరాయింపుల వ్యవహారాన్ని సీరియస్‌ గా తీసుకుందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ లో చేరడం సాధ్యం కాకపోవచ్చని ఫిరాయింపు ఎమ్మెల్యే ఒకరు చెప్పారు. ఉప ఎన్నికలకు మెంటల్‌ గా సిద్ధం కావాల్సిందేనని కూడా ఆయన ఆఫ్ ది రికార్డ్‌ గా చెప్పారు. రేవంత్‌ ప్రభుత్వంపై స్వల్ప వ్యవధిలోనే ప్రజావ్యతిరేకత పెరిగిందని, ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌ టికెట్‌ పై పోటీ చేయడం అంటే అది సూసైడ్‌ అటెంప్ట్‌ అని కూడా సదరు ఎమ్మెల్యే కామెంట్‌ చేశారు. రేవంత్‌ అతి తమ మెడకు చుట్టుకుందని.. చేసుకున్నోళ్లకు చేసుకున్నంత అన్నట్టుగా.. ఏ పరిణామం జరిగినా ఎదుర్కోవడానికి రెడీ అవుతున్నామని సదరు ఎమ్మెల్యే చెప్పారు.

Next Story