రేవంత్‌.. నువ్వో ఫెయిల్యూర్‌ సీఎం

మాజీ మంత్రి హరీశ్‌ రావు

రేవంత్‌.. నువ్వో ఫెయిల్యూర్‌ సీఎం
X

రేవంత్‌ రెడ్డి ఫెయిల్యూర్‌ సీఎం అని మాజీ మంత్రి హరీశ్‌ రావు మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా పాలమాకుల గురుకుల పాఠశాలను మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో మాట్లాడి వాళ్ల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆడపిల్లలు రోడ్డెక్కి ధర్నా చేస్తుంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు. ప్రతిపక్షాల మీద విమర్శలు చేయడం తప్పా పాలన మీద దృష్టి పెట్టడం లేదన్నారు. గురుకులాల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని, ప్రభుత్వం మీద నమ్మకం లేక తమ పిల్లలను గురుకులాల్లో చేర్చడానికే భయపడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా రేవంత్‌ ఫెయిల్‌ అయ్యారన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత విద్యార్థినులు చెప్పిన విషయాలు తెలుసుకొని దుఃఖం ఆపుకోలేకపోతున్నానని అన్నారు. తమను కర్రలు విరిగేలా కొడుతున్నారని విద్యార్థులు భయంతో వణికిపోతున్నారని తెలిపారు. అన్నం, పప్పులో పురుగులు వస్తాయని తాము అడిగితే తింటే తినండి లేకపోతే లేదని బెదిరిస్తున్నారని విద్యార్థినులు చెప్పారని అన్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఒక జత బట్టలు మాత్రమే ఇచ్చారని, రెండో జత ఇవ్వలేదని, కనీసం పుస్తకాలు కూడా ఇవ్వలేదన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు సన్నబియ్యంతో అన్నం పెడితే కాంగ్రెస్‌ ప్రభుత్వం గొడ్డుకారం పెడుతోందన్నారు. గురుకులాలను రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తుందన్నారు. ఇప్పటికే 500 మంది గురుకులాల విద్యార్థులు ఆస్పత్రుల పాలయ్యారని, 38 మంది చనిపోయారని తెలిపారు.

గురుకులాల్లో విద్యార్థులు పాములు కరిచి చనిపోతున్నారని, ఎలుకలు కొరికి ఆస్పత్రుల పాలవుతున్నారని తెలిపారు. ఫుడ్ పాయిజన్‌ ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయని అన్నారు. ఒకప్పుడు గురుకులాల్లో చదవడం ఒక కళ.. ఇప్పుడు గురుకులాలు అంటేనే భయపడే పరిస్థితి తీసుకువచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమాకుల గురుకులంలో టీచర్లను వెంటనే మార్చాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థులకు మంచి భోజనం పెట్టాలని డిమాండ్‌ చేశారు. మైనార్టీ గురుకులాల్లో జనవరి నుంచి మెస్‌ బిల్లులు ఇవ్వడం లేదని, మిగతా గురుకులాల్లోనూ కాస్మొటిక్‌ చార్జీలు, కరెంట్‌ బిల్లులు, మెస్‌ బిల్లులు ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి విద్యార్థులకు మంచి సేవలు అందించాలన్నారు. విద్యార్థులకు ధైర్యం చెప్పామని, ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే ఫోన్‌ చేయాలని నంబర్‌ కూడా ఇచ్చామన్నారు. గురుకులాలు, విద్యారంగాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. విద్యాశాఖ పై సీఎం దృష్టి పెట్టడం లేదని, కనీస సమీక్ష కూడా చేయడం లేదన్నారు. గురుకులాలు, విద్యారంగ సమస్యలను అసెంబ్లీలో తాము అసెంబ్లీలో లేవనెత్తినా ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. ఇప్పటికైనా సీఎం స్పందించి గురుకులాల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

Next Story