సీఎం స్థాయిని దిగజార్చిన రేవంత్‌.. లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ ఇచ్చేసిన 'సుప్రీం'

రేవంత్‌ తరపున సుప్రీం కోర్టుకు రోహత్గీ క్షమాపణలు.. కౌన్సెలింగ్‌ చేస్తామన్న లూథ్రా

సీఎం స్థాయిని దిగజార్చిన రేవంత్‌.. లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ ఇచ్చేసిన సుప్రీం
X

సీఎం రేవంత్‌ రెడ్డి నోటికి వచ్చినట్టుగా మాట్లాడి తెలంగాణ పరువు తీశారు. ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చారు. రాజ్యాంగబద్ధమైన స్థానంలో ఉండి బజారు భాష వాడి రాష్ట్రం పరువును గంగలో కలిపేశారు. ఏకంగా సర్వోన్నత న్యాయస్థానంపైనే నోరు పారేసుకున్నారు. ముఖ్యమంత్రి మాటలను సీరియస్‌ గా తీసుకున్న సుప్రీం కోర్టు ఆయనకు లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ ఇచ్చి పడేసింది. ఆయనకు వ్యతిరేకంగా ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుందని ఆగ్రహించింది. రేవంత్‌ రెడ్డి తరపున సీనియర్‌ న్యాయవాది ముఖుల్‌ రోహత్గీ సుప్రీం కోర్టుకు క్షమాపణలు చెప్పారు. మరో సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా రేవంత్‌ రెడ్డి ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఆయనకు కౌన్సెలింగ్‌ చేస్తామని వివరణ ఇచ్చుకున్నారు. సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన దానికన్నా.. ముఖ్యమంత్రికి తాము కౌన్సెలింగ్‌ చేస్తామని దేశంలోనే టాప్‌ లాయర్లలో ఒకరైన సిద్ధార్థ లూథ్రా వివరణ ఇచ్చుకోవడం తెలంగాణ ప్రతిష్టను మరింత దిగజార్చింది. నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే పరిస్థితి ఎలా ఉంటుందో రేవంత్‌ రెడ్డికి మొదటిసారిగా తెలిసి వచ్చింది.

ఓటుకు నోటు కేసు విచారణను తెలంగాణ హై కోర్టు నుంచి మధ్యప్రదేశ్‌ హైకోర్టుకు మార్చాలని కోరుతూ మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ పీకే మిశ్రా, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం గురువారం ఈ పిటిషన్‌ ను విచారించింది. ఇన్నాళ్లు లేనిది ఇప్పుడే ఎందుకు కేసు విచారణను బదిలీ చేయాలని కోరుతున్నారని పిటిషనర్‌ తరపు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. పిటిషనర్‌ తరపున దామ శేషాద్రి నాయుడు వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రి అని, హోం శాఖ మంత్రిగా కూడా ఆయనే ఉన్నారని తెలిపారు. కేసు విచారణ జరుపుతున్న ఏసీబీ హోం శాఖ పరిధిలోకే వస్తుందని తెలిపారు. రేవంత్‌ రెడ్డి పీసీసీ అధ్యక్షుడి హోదాలో పోలీసులను బెదిరించే ధోరణిలో మాట్లాడారని తెలిపారు. ఈ నేపథ్యంలో కేసు విచారణను మధ్యప్రదేశ్‌ హైకోర్టుకు మార్చాలని కోరుతున్నామని తెలిపారు. ధర్మాసనం జోక్యం చేసుకొని న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంచాలని, విచారణను మరో చోటికి మార్చాల్సిన అవసరం లేదని కామెంట్‌ చేసింది. పిటిషనర్‌ ఆందోళనను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం తరపున వాదించే స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ను మార్చుతామని తెలిపారు. దీనిపై మధ్యాహ్న భోజనం తర్వాత ఉత్తర్వులు జారీ చేస్తామని ధర్మాసనం వెల్లడించింది.

లంచ్‌ తర్వాత పిటిషనర్‌ తరుపు అడ్వొకేట్‌ సీఎం రేవంత్‌ రెడ్డి మీడియా చిట్‌ చాట్‌ లో సుప్రీం కోర్టుపై చేసిన కామెంట్స్‌ ను కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ మిలాఖత్‌ అయితేనే కవితకు బెయిల్‌ వచ్చిందని, బీజేపీ కోసం బీఆర్‌ఎస్‌ ఎంపీ సీట్లను త్యాగం చేసిందని చిట్‌ చాట్‌ లో రేవంత్‌ అన్నారు. ఈ కామెంట్స్‌ పై జస్టిస్‌ బీఆర్‌ గవాయి తీవ్రంగా స్పందించారు. బాధ్యత గల ఒక ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్‌ ను ఒకసారి చదవాలని రేవంత్‌ రెడ్డి అడ్వొకేట్‌ ముఖుల్‌ రోహత్గీకి సూచించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి చేసే కామెంట్స్‌ తో సామాన్య ప్రజల్లో వ్యవస్థలపై అనుమానాలు తలెత్తుతాయని అన్నారు. ఒక రాజకీయ పార్టీతో సంప్రదింపులు జరిపి తాము ఆదేశాలు ఇస్తామా అని ప్రశ్నించారు. న్యాయస్థానం గురించి ఎవరో ఏదో అన్నారని తాము ఆందోళన చెందబోమని.. న్యాయమూర్తులుగా తాము ప్రమాణం చేస్తామని.. రాజ్యాంగబద్ధంగానే ఆదేశాలు ఇస్తామని తెలిపారు. జస్టిస్‌ విశ్వనాథన్‌ స్పందిస్తూ రాజ్యాంగబద్ధమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఇంత బాధ్యతారహితంగా మాట్లాడుతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వాళ్లు వ్యవస్థలను గౌరవించాలన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలపై వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర ఐఏఎస్‌ అధికారికి నిన్ననే (బుధవారం) నోటీసులు జారీ చేశామని జస్టిస్‌ గవాయి అన్నారు. దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టుపై గౌరవం లేకుంటే ఆయన మరో హైకోర్టులోనే విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని జస్టిస్‌ గవాయి అన్నారు.

రేవంత్‌ రెడ్డి కామెంట్స్‌ పై సుప్రీం కోర్టు సీరియస్‌ కావడంతో ఆయన తరుపు న్యాయవాదులు ముఖుల్‌ రోహత్గీ, సిద్ధార్థ లూథ్రా జోక్యం చేసుకున్నారు. రేవంత్‌ రెడ్డి తరపున ముఖుల్‌ రోహత్గీ సుప్రీం కోర్టుకు క్షమాపణలు చెప్పారు. మరో సీనియర్‌ అడ్వొకేట్‌ సిద్ధార్థ లూద్రా స్పందిస్తూ.. సీఎం రేవంత్‌ రెడ్డికి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని.. న్యాయస్థానాలను ఉద్దేశించి ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా చూసుకుంటామని తెలిపారు. సుప్రీం కోర్టుపైనే రేవంత్‌ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు హైకోర్టు, దిగువ కోర్టుల న్యాయమూర్తుల పరువు ఏమవుతుందో ఆలోచించాలని పిటిషనర్‌ తరపు న్యాయవాది బెంచ్‌ దృష్టికి తీసుకువచ్చారు. ఈ కేసులో తదుపరి వాదనలను సోమవారం వింటామని.. కేసును బదిలీ చేయాలా.. తెలంగాణ హైకోర్టులోనే విచారణ కొనసాగించాలా అనే అంశంపై అదే రోజు ఆదేశాలిస్తామని ధర్మాసనం తేల్చిచెప్పింది. ఓటుకు నోటు కేసులో దర్యాప్తు సంస్థ ఏసీబీ తరపున వాదించే స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ను అదే రోజు నియమిస్తామని స్పష్టం చేసింది. దేశ సర్వోన్నత న్యాయ స్థానంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చీవాట్లు తిన్న రేవంత్‌ రెడ్డిలో ఇకనైనా మార్పు వస్తుందో.. హుందాతనంతో మాట్లాడి ముఖ్యమంత్రి ఔన్నత్యాన్ని నిలబెడుతారో.. సహజ శైలిలో బూతులతో రాష్ట్రం పరువు మరింత తీస్తారో ఆయనే తేల్చుకోవాలి.

Next Story