రేవంత్ సేఫ్ .. భట్టి బద్నాం

రేవంత్‌రెడ్డి తప్పులు చేస్తారు. ఈ క్రమంలో తనను రక్షించుకోవడానికి ఇతరులను ముందు పెడుతారు. తాజాగా మాజీ మంత్రి సబితపై సీఎం చేసిన వ్యాఖ్యలను సమర్థించి భట్టి బలవుతున్నారు.

రేవంత్ సేఫ్ .. భట్టి బద్నాం
X

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మహిళా శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి, సునితా లక్ష్మారెడ్డిలను ఉద్దేశించి వాళ్లు ఇక్కడ ఉండి ముంచి అక్కడ చేరారని ఆరోపించారు. వాళ్లను నమ్ముకుంటే జూబ్లీ బస్టాండేనని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అప్పుడు కేటీఆర్‌ బడ్జెట్‌పై మాట్లాడుతున్నారు. సభ సజావుగా సాగుతున్నది. అధికారపక్షం నుంచి కేటీఆర్‌ను రెచ్చగొట్టడానికి యత్నించినా సబ్జెక్టుపైనే దృష్టి సారించారు. ఈలోగా సీఎం సభకు వచ్చి మొత్తం ఇష్యూను డైవర్ట్‌ చేయడానికి ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేసి తన అక్కసు వెళ్లగక్కారు.

ఈ ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు తమ భర్తలు చనిపోయాక అనివార్య పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజామోదంలో చట్టసభలకు ఎన్నికవుతూ వస్తున్నారు. అంతకంటే ముఖ్యమైనది సభలో వీళ్లిద్దరూ హుందాగా వ్యవహరిస్తారు. ప్రజా సమస్యలపై సభలో అర్ధవంతంగా మాట్లాడుతారు. రేవంత్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాంతిభద్రతలు అదపు తప్పాయని, మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నాయని సభలో సబిత సూటిగా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇది తట్టుకోలేకనే రేవంత్‌రెడ్డి వాళ్లను అవమానించేలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ వ్యాఖ్యలపై ఆయన సామాజికవర్గంలోనే వ్యతిరేకత వస్తున్నట్టు సమాచారం. ఎలాంటి వివాదాలు లేని వారిపై రేవంత్‌ చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన సామాజికవర్గంలోనే ఆగ్రహం వ్యక్తమౌతున్నట్టు తెలుస్తోంది. తన అనుచిత వ్యాఖ్యలు తన మెడకే చుట్టుకుంటున్నాయని రేవంత్‌రెడ్డి గ్రహించారు. దీంతో తాను సృష్టించిన సమస్యను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కవైపు డైవర్ట్‌ చేశారు. తన వ్యాఖ్యల సబితక్క బాధపడలేదని, ఏం మొఖం పెట్టుకుని వచ్చారని భట్టి చేసిన కామెంట్లతోనే మనస్థాపానికి గురయ్యారని ఆయన అనుయాయుల ద్వారా ప్రచారం చేయిస్తున్నారు.

బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజు నుంచి సభలో సభా నాయకుడిగా హుందాగా ఉండాల్సిన రేవంత్‌ రన్నింగ్‌ కామెంట్స్‌ చేస్తూ విపక్ష సభ్యులను హేళన చేసేలా వ్యవహరించారు. మొన్న విద్యుత్‌ అంశంపై ఇలాగే మాట్లాడితే మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి మా నాయకుడు సత్యాహరిశ్చంద్రుడే, మీలా సంచులు మోసే వాడు కాదని ధీటుగా బదులిచ్చారు. సమస్య క్రియేట్‌ చేయడం.... తర్వాత సభ నుంచి సీఎం ఏదో పని ఉన్నదని చెప్పి వెళ్లిపోవడం అందరూ చూశారు. ఆ తర్వాత రేవంత్‌ వ్యాఖ్యలపై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు లేదా డిప్యూటీ సీఎం భట్టి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఆయన కల్పిస్తున్నారు. రేవంత్‌ ఏం మాట్లాడినా ఆయనను వెనకేసుకు రావడానికి భట్టి యత్నిస్తున్నారు అందుకే ఆయనపైనే తాను చేస్తున్న తప్పుడు వ్యాఖ్యలకు బాధ్యుడిని చేస్తున్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. వాళ్ల వల్లనే సీఎల్పీ పోస్టు పోయిందని భట్టి వాపోతున్నారు కానీ.. సీఎం పదవి కోసం తనతో పోటీ పడిన భట్టితో ఎప్పటికైనా ముప్పే అని ముఖ్యమంత్రి ఆయనను ఇరికించే ప్రయత్నం చేస్తున్న అసలు విషయాన్ని మరిచిపోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలోకి రావడాన్ని ఆ పార్టీ సీనియర్‌ నేతలు వ్యతిరేకించారు. ఆయన వ్యవహారశైలే వారు వ్యతిరేకించడానికి కారణం. అయితే అప్పుడున్న పరిస్థితుల్లో ఆయన పార్టీలోకి వస్తే బాగుంటుందని సీనియర్‌లతో ఒప్పించి రేవంత్‌ను పార్టీలోకి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించింది సబితా ఇంద్రారెడ్డి. ఈ విషయాన్ని సీఎం కూడా అసెంబ్లీలో అంగీకరించిన సంగతి తెలిసిందే. అయితే రేవంత్‌ పార్టీలోకి వచ్చినప్పుడు ఆయన వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఆ సమయంలోనూ ఆయన పార్టీ సీనియర్లు కొంతమందిపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆయనకు పీసీసీ పీఠం అప్పగిస్తారనే వార్తలు రావడంతో ఆ పార్టీ సీనియర్‌ నేతలు కోమటిరెడ్డి బ్రదర్స్‌, వీహెచ్‌, జగ్గారెడ్డి లాంటి వాళ్లు బాహాటంగానే వ్యతిరేకించారు. ఆయన నేతృత్వంలో పనిచేయలేమని మీడియా ముందే ఘాటు విమర్శలు చేసిన విషయం అందరికీ తెలిసిందే.

పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌ పార్టీలో దశాబ్దాలుగా ఉన్న సీనియర్లుతో తనకు ఎప్పటికైనా రాజకీయంగా ఇబ్బందులు తప్పవని ఒక్కొక్కరిని బైటికి పంపారు. సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలతో పాటు చాలామంది ఎమ్మెల్యేలు బైటికి రావడం కారణం రేవంత్‌రెడ్డి వ్యవహారశైలే. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం బాధ్యతలు చేపట్టాక అసెంబ్లీలో, బైట అడ్డగోలుగా ఏది పడితే అది మాట్లాడటం పట్ల కూడా సీనియర్లలో అసంతృప్తి నెలకొన్నది. అధిష్ఠానంతో సంబంధం లేకుండా అంతా తానే అన్నట్టు ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. పార్టీలో సినియర్లు వాళ్లంతట వాళ్లే బైటికి వెళ్లేలా చేరికలను ప్రోత్సహించారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన పదవికి రాజీనామా వ్యవహారం పెద్ద చర్చనీయాంశంగా మారింది. పార్టీలో సుదీర్ఘ కాలం ఉన్నవారందరినీ తప్పించి పాత టీడీపీ కాపులకు పెద్ద పీట వేసే ప్రయత్నం చేశారు. అసెంబ్లీలో, బైట రేవంత్‌ సొంతపార్టీ నేతలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం ఇవాళే కొత్తకాదు. పార్టీలోకి వచ్చిన నాటి నుంచే ఆయన ఇదే వైఖరి అవలంబిస్తున్నారు. బైటికి ఏదో రేవంత్‌ నాయకత్వం గురించి గొప్పగా మాట్లాడుతున్నా... అంతర్గతంగా ఆయన వల్ల పార్టీ పూర్తిగా భ్రష్టుపట్టిపోతున్నదనే అభిప్రాయమే ఎక్కువ మందిలో ఉన్నట్టు సమాచారం.

Raju

Raju

Writer
    Next Story