కనిపించదన్న పార్టీని చూసి కలవరపడుతున్నరేవంత్‌

లోక్‌సభ ఎన్నికల తర్వాత చూద్దామన్నా కనిపించనంత దూరంలో పాతాళం లోకి బీఆర్‌ఎస్‌ ను పాతి పెడుతానన్నసీఎం రేవంత్‌రెడ్డి ఆ పార్టీనే తలుస్తూ కలవరపడుతున్నారు.

కనిపించదన్న పార్టీని చూసి కలవరపడుతున్నరేవంత్‌
X

బీజేపీలో విలీనానికి బీఆర్‌ఎస్‌ బేరాలు జరుపుతున్నదని సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ఆరోపించారు. కేసీఆర్‌కు గవర్నర్‌, కేటీఆర్‌కు కేంద్ర మంత్రి పదవి, హరీశ్‌కు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పదవి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని, బీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరితే కవితకు బెయిల్‌ వస్తుందని విలేకర్ల ఇష్టాగోష్ఠిలో రేవంత్‌ హస్తినలో ఆరోపణలు చేశారు.బీజేపీ అధికార ప్రతినిధి కూడా రేవంత్‌రెడ్డిలా మాట్లాడరు కావొచ్చు. వైరా సభలో అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు గెలుచుకున్న బీఆర్‌ఎస్‌ లోక్‌సభ ఎన్నికలు వచ్చే సరికి గుండు సున్నా అని, అంతకుముందు లోక్‌సభ ఎన్నికల తర్వాత చూద్దామన్నా కనిపించనంత దూరంలో పాతాళం లోకి ఆపార్టీని పాతి పెడుతానని ఇట్లా రేవంత్‌రెడ్డి నిత్యం విపక్షపార్టీ గురించే తలుస్తూ కలవరపడుతున్నారు.

బీజేపీ మూలాలు ఉన్న వ్యక్తి రేవంత్‌రెడ్డి. మొదటిసారి ఆయన జడ్పీటీసీగా గెలిచింది ఆ పార్టీ మద్దతుతోనే. మొన్న అసెంబ్లీ సమావేశంలోనూ బీజేపీ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌ మా మిత్రుడు అని సంబోధించారు. ఎన్నికలకు ముందు నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ కూడా సీఎం రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ సీఎంగా ఏం చేయలేడని, మా పార్టీలో చేరితే ఆయనకు స్వేచ్ఛ దొరుకతుందని, ఆయనను వ్యక్తిగతంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. వీటిపై రేవంత్‌రెడ్డి ఎన్నడూ స్పందించలేదు. అంతేకాదు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఒకరిద్దరు మంత్రులు బీజేపీ అధిష్ఠానంతో టచ్‌లో ఉన్నారని బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్‌ రెడ్డే ఆరోపించారు. దీన్ని కోమటిరెడ్డి ఖండించినా.. ఎందుకో విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత సీఎం రేవంత్‌ రెడ్డి తన నీడను చూసి తానే భయపడుతున్నట్టు కనిపిస్తున్నదని వాదనలు వినిపిస్తున్నాయి.

అధికారం కోసం అలవిగాని హామీలు ఇచ్చి వాటిని వందరోజుల్లోనే నెరవేరుస్తామని గప్పాలు కొట్టిన గుంపుమేస్త్రి ఇప్పుడు తప్పించుకుంటూ అడ్డగోలుగా మతి తప్పి మాట్లాడుతున్నారని ప్రధాన ప్రతిపక్షం విమర్శలు చేస్తున్నది. అవి నిజమే అన్నట్లు ముఖ్యమంత్రి వ్యవహారశైలి కూడా ఉన్నది. ముఖ్యమంత్రి పదవి మూణ్నాళ్ల ముచ్చేటేనా అన్నట్టు ఆయన మాటలు, ఆయన వైఖరి ఉన్నదనే చర్చ జరుగుతున్నది. ఉద్యోగాల భర్తీ విషయంలో, రుణమాఫీ విషయంలో, ప్రాజెక్టుల విషయంలో, ఆరు గ్యారెంటీల విషయంలో తాము ఈ తొమ్మిది నెలల కాలంలో అద్భుతంగా పనిచేస్తున్నామని పెద్ద పెద్ద హోర్డింగ్స్‌ పెట్టుకుంటూ.. పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నా.. ప్రజలు విశ్వసించడం లేదనే ఆవేదన ముఖ్యమంత్రిలో కనిపిస్తున్నది అంటున్నారు. అలాగే రాష్ట్రం దివాళా తీసిందంటూ ప్రచారం చేస్తున్న ఆయనే పెట్టుబడులు పెట్టాలని.. తెలంగాణ ఫ్యూచర్‌ స్టేట్‌ అంటూ ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే పారిశ్రామిక విధానం ఉండాలి. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక వాళ్ల పారిశ్రామిక విధానం ఏమిటో ఎవరికీ తెలియదు. అలాగే శాంతిభద్రతలు, నీళ్లు, కరెంటు ఉండాలి. ఇవి కాంగ్రెస్‌ అధికారంలోకి రాకముందు ఎలా ఉండేవో అంతకు ముందు అన్నది అందరి అనుభవంలో ఉన్నదే. దీంతో ఏతులు కొట్టిన ఎనుముల రేవంత్ రెడ్డికి ఎటుచూసినా ప్రతికూల పరిస్థితులే ఎదురవుతున్నాయి. దీంతో ఏం చేయాలో పాలుపోక తాను సీఎం అనే విషయాన్ని మరిచిపోయి పీసీసీ అధ్యక్షుడి లెక్కనే వ్యవహరిస్తున్నారని, ఏది పడితే అది మాట్లాడుతున్నారని ప్రధాన ప్రతిపక్షం విమర్శలు నిజమే అనేలా ఉన్నాయి. బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనం అన్నది కూడా రేవంత్‌ రెడ్డి రాష్ట్రంలో రుణమాఫీ అంశంపై రైతుల నుంచి వస్తున్న వ్యతిరేకతను డైవర్ట్‌ చేయడానికి, పత్రికల్లో పతాక శీర్షికల్లో ఉండటానికి ఆరోపించారు అంటున్నారు.

Raju

Raju

Writer
    Next Story