సైంటిస్టులను క్యాబ్‌ డ్రైవర్లుగా మార్చిన రేవంత్‌ సర్కారు

బయో డైవర్సిటీ బోర్డు నిర్వహణకు పైసా ఇవ్వట్లే.. సైంటిస్టులు, ఉద్యోగాలకు జీతాలివ్వట్లే

సైంటిస్టులను క్యాబ్‌ డ్రైవర్లుగా మార్చిన రేవంత్‌ సర్కారు
X

తెలంగాణలో జీవ వైవిద్య పరిరక్షణకు పరిశోధనలు చేయాల్సిన సైంటిస్టులను రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం క్యాబ్‌ డ్రైవర్లుగా మార్చేసింది. ప్రభుత్వం జీతాలు ఇవ్వక.. పరిశోధనలు తమ కడుపు నింపకపోవడంతో కన్నబిడ్డలకు రెండు పూటలా తిండిపెట్టడానికి, కుటుంబ అవసరాలకు దొరికిన పని చేసుకోవాల్సిన దుస్థితిలోకి నెట్టేసింది. బోర్డు నిర్వహణకు కార్పస్‌ ఫండ్‌ ఉన్నా కాంగ్రెస్‌ ప్రభుత్వం పైసా విడుదల చేయడం లేదు. దీంతో బయో డైవర్సిటీ బోర్డును కానాకష్టంగా నెట్టుకురావాల్సిన దుస్థితి నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం నేషనల్‌ బయో డైవర్సిటీ చాక్ట్‌ కు లోబడి రాష్ట్రంలో జీవవైవిధ్య పరిరక్షణ కోసం రూ.10 కోట్ల నిధితో బయో డైవర్సిటీ బోర్డును ఏర్పాటు చేసింది. 12 రకాల అంశాల్లో పరిశోధనలు చేసి వాటి నివేదికలను బోర్డు ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది. ఆ నివేదికలు, అంతర్జాతీయంగా జీవ వైవిద్య పరిరక్షణకు చేపడుతున్న చర్యలకు అనుగుణంగా స్టేట్‌ బయో డైవర్సిటీ బోర్డు రాష్ట్రంలో జీవి వైవిధ్య పరిరక్షణకు కృషి చేస్తుంది. అంత కీలకమైన బయో డైవర్సిటీ బోర్డు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఎందుకు అక్కరకు రానిది అయ్యింది. బయో డైవర్సిటీ బోర్డులో పని చేస్తున్న సైంటిస్టులు, ఉద్యోగులకు ఏడాదిగా జీతాలు ఇవ్వడం లేదు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ రావడంతో సైంటిస్టులు, ఉద్యోగుల జీతాల చెల్లింపులు ఆగిపోయాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా బయో డైవర్సిటీ బోర్డు ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదు. ప్రతి నెల ఒకటో తారీఖునే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకోవడమే తప్ప అత్యంత కీలకమైన బయో డైవర్సిటీ బోర్డు సైంటిస్టులు, ఉద్యోగుల దుస్థితిని చక్కదిద్దే ప్రయత్నమే చేయడం లేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో సైంటిస్టులు క్యాబ్‌ డ్రైవర్లుగా మారారు. బోర్డులో పరిశోధనలు పూర్తయిన తర్వాత కుటుంబ పోషణ కోసం క్యాబ్‌ లు నడుపుతున్నారు. కొందరు ఉద్యోగులు ఫుడ్‌ డెలివరీ సహా చిన్నాచితక పనులు చేసుకుంటున్నారు. వారి దుస్థితి గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరూ అయ్యో పాపం అంటున్నా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం మాత్రం బయో డైవర్సిటీ బోర్డుకు నిధులు విడుదల చేయడం లేదు. దీంతో సైంటిస్టులు, ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదు. బోర్డుకు నిధులు విడుదల చేయాలని ఉన్నతాధికారులు, సీనియర్‌ సైంటిస్టులు డిప్యూటీ సీఎం మల్లు భట్టవిక్రమార్కను పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేసినా పైసా విడుదల చేయలేదు.

సైంటిస్టులను రోడ్డున పడేస్తరా ? : మాజీ మంత్రి హరీశ్‌ రావు

పరిశోధనలను చేయాల్సిన సైంటిస్టులను పొట్టకూటి కోసం రోడ్డున పడేస్తారా అని మాజీ మంత్రి హరీశ్‌ రావు మండిపడ్డారు. బయో డైవర్సిటీ బోర్డుకు ఏడాది క్రితమే అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.10 కోట్లు కేటాయించిందని, ఆ నిధులు విడుదల చేస్తే బోర్డులో పరిశోధనలు సజావుగా సాగడంతో పాటు సైంటిస్టులు, ఉద్యోగులకు జీతాలు చెల్లించే వెసులుబాటు కలుగుతుందని తెలిపారు. ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తారీఖునే జీతాలు చెల్లిస్తున్నామని కాంగ్రెస్‌ ప్రచారం చేసుకుంటుందే తప్ప అందరు ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదన్నారు. బయో డైవర్సిటీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. పాలనను గాలికొదిలేసి నిత్యం రాజకీయాలే చేసే సీఎం రేవంత్‌ రెడ్డి.. బయో డైవర్సిటీ బోర్డుపై దృష్టి సారించాలని డిమాండ్‌ చేశారు. ఇకనైనా సైంటిస్టులు, ఉద్యోగులకు జీతాలు చెల్లించి వారిని ఆదుకోవాలన్నారు.

Next Story