అభద్రతతోనే రేవంత్‌ ఫిరాయింపు రాజకీయాలు

లోక్‌సభ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి అభద్రతాభావంలోకి వెళ్లినట్టు కనిపిస్తున్నది.ముఖ్యంగా మల్కాజిగిరి, మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ స్థానాల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోవడం పట్ల రేవంత్‌పై సొంత పార్టీలోనే విమర్శలు మొదలయ్యాయి.

అభద్రతతోనే రేవంత్‌ ఫిరాయింపు రాజకీయాలు
X

లోక్‌సభ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి అభద్రతాభావంలోకి వెళ్లినట్టు కనిపిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించిన తర్వాత సీఎం స్థానం కోసం ఆ పార్టీ సీనియర్‌ నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చివరివరకు పట్టుబట్టారు. అయితే అధిష్ఠానం సూచన మేరకు వాళ్లు వెనక్కితగ్గారు. ఈ సమయంలోనే పార్టీ హైకమాండ్‌ రేవంత్‌కు లోక్‌సభ ఎన్నికల టాస్క్‌ ఇచ్చిందని సమాచారం. రెండంకెల సీట్లు సాధించాలని కండీషన్లు పెట్టిందని తెలుస్తోంది. కానీ పార్టీ అధిష్ఠానం ఆశించిన ఫలితాలను అందించడంలో రేవంత్‌ విఫలమయ్యారు. ముఖ్యంగా తాను లోక్‌సభ ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరి, తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ స్థానాల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోవడం పట్ల రేవంత్‌పై సొంత పార్టీలోనే విమర్శలు మొదలయ్యాయి. ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు విషయంలో రేవంత్‌ ఇంకా గురుభక్తిని చూపెట్టడంపై పార్టీ సీనియర్లు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.

పార్టీలో తన ఒంటెద్దు వైఖరిపై సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. దీనికితోడు రేవంత్‌ బీజేపీతో టచ్‌లో ఉన్నాడని అందుకే కొన్నిచోట్ల వీక్‌ అభ్యర్థులను పెట్టారనే ఆరోపణలున్నాయి. నిజామాబాద్‌లో జీవన్‌రెడ్డి, అభ్యర్థిత్వాన్ని ఆపార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యురాలు తప్పుపట్టిన సంగతి తెలిసిందే. నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ రేవంత్‌ సీఎం అయ్యాక అభినందిస్తూ.. ఆయన ఆ పార్టీ సీఎంగా ఏమీ చేయలేరని అందుకే మాపార్టీలోకి ఆహ్వానిస్తున్నానని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్‌ను బలహీన పరచడానికి రేవంతే ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని, దీన్నికూడా పార్టీలోని తప్పుపడుతున్నారని సమాచారం. ఆ ఇంటి కాకి (బీఆర్‌ఎస్‌ను ఉద్దేశించి) మా ఇంటిపై వాలితే కాల్చిపడేస్తానని అన్న రేవంత్‌ దానికి కట్టుబడి ఉండకపోవడంపై ఆగ్రహంతో ఉన్నారు. ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి అధికారానికి కావాల్సిన స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు. అయినా బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారట. రేవంత్‌ వైఖరి వల్ల ఆయా నియోజకవర్గాల్లో స్థానిక నేతలు ఇబ్బందులు పడుతున్నారట. మొన్నటివరకు ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశాం. పార్టీ ఆదేశం మేరకు వాళ్లపై తీవ్ర విమర్శలు చేశాం. ఇప్పుడు వాళ్లనే తీసుకొచ్చి మా నెత్తిమీద పెట్టడంపై మండిపడుతున్నారు.

అధికారాన్ని కాపాడుకోవడానికే రేవంత్‌రెడ్డి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారనే విమర్శలున్నాయి. కాంగ్రెస్‌ పార్టీలో సీఎంల మార్పు కొత్త విషయమేమీ కాదు. కండీషన్ల మీద సీఎం సీటు దక్కించుకున్న ఆయన ఎక్కడ తన పదవికి ముప్పు ఏర్పడుతుందోననే ఆందోళనలో ఉన్నారని అందుకే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వాలు కూలిపోతాయని బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు. ఇటీవల రాజ్యసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి ఓటు వేసి అనర్హత వేటు గురయ్యారు. దీన్నిదృష్టిలో పెట్టుకునేమా పార్టీ మేనిఫెస్టోలో పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని మరింత పటిష్టం చేస్తామని హామీ ఇచ్చిన మేమే ఫిరాయింపు రాజకీయాలు చేస్తే ప్రజలు ఎలా విశ్వసిస్తారని ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి సారించకుండా రేవంత్‌ పీసీసీ అధ్యక్షుడిగా రాజకీయాలు మాత్రమే చేయడాన్ని సొంతపార్టీ సీనియర్లు, శ్రేణులు, కార్యకర్తలే విమర్శిస్తున్నారు.

Raju

Raju

Writer
    Next Story