పేదల గుండెలపైకి రేవంత్ బుల్డోజర్లు

వికలాంగుల గూడు నిర్దయగా కూల్చివేత

పేదల గుండెలపైకి రేవంత్ బుల్డోజర్లు
X

అత్యంత అభాగ్యులు ఎవరు అంటే మొదట చెప్పేది వైకల్యంతో బాధ పడేవాళ్ల గురించే. శారీరక, మానసిక వైకల్యంతో తమకు తాముగా జీవితాలను వెళ్లదీయలేని వాళ్లపై ఎదుటి వాళ్లు కాసింత జాలి చూపించాలి. చేయగలిగితే ఓ చేయి అందించి వారికి భరోసానివ్వాలి. వారికి అండగా నిలువకున్నా పర్వాలేదు కానీ తెలంగాణ సర్కారు అత్యంత నిర్దయగా.. అమానవీయంగా.. పాశవికంగా వికలాంగుల గూడు కూల్చేశారు. తెల్లవారకముందే ఆ పేదల గుండెలపైకి రేవంత్‌ రెడ్డి తన బుల్డోజర్లు ఎక్కించి తొక్కించారు. ఆయనకు ఎదుటివాళ్లను తొక్కుకుంటూ పోవడం కొత్తకాదు.. పేద్దోళ్లను తొక్కుతూ రేవంత్‌ సీఎం పీఠం వరకు చేరడం వరకు ఓకే.. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రజలపై ప్రేమ చూపించాలి. ఏ అండ లేనివారికి తానే నీడనివ్వాలి. ఆ బేసిక్‌ సూత్రాన్ని రేవంత్‌ ఒంట బట్టిచ్చుకోలేదు. హైడ్రా పేరుతో హైదరాబాద్‌ లో బుల్డోజర్‌ రాజ్‌ తీసుకువచ్చిన రేవంత్‌ రెడ్డి.. ఆ బుల్డోజర్లను శుక్రవారం తెల్లవారుజామున మహబూబ్‌ నగర్‌ లో పరుగులు పెట్టించారు. అంధులు, వికలాంగుల కాలనీపైకి వాటిని పంపి వాళ్ల ఇండ్లను పాశవికంగా కూల్చేశారు. ఏ అండలేనోళ్ల గూడు కూల్చడానికి 400 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. తమ సామాన్లనైనా తెచ్చుకోనివ్వండని దివ్యాంగులు అధికారులను వేడుకున్నా కరుణించలేదు. తెల్లారే సరికే అక్కడ ఉన్న ఇండ్లన్నీ (రేకుల షెడ్లు, గుడిసెలు) నేలమట్టం చేశారు.

మహబూబ్‌ నగర్‌ లోని క్రిస్టియన్‌ పల్లి సమీపంలో దివ్యాంగులు, అంధులు చిన్న చిన్న రేకుల షెడ్లు, గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. 2007లోనే అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం వారికి ఇండ్ల పట్టాలు కూడా ఇచ్చింది. 15 ఏండ్లుగా ఆ గుడిసెల్లో నివసిస్తూ సర్కారు ఇచ్చే పింఛన్‌ తో జీవనం సాగిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఆ కాలనీకి రోడ్డు వేసి, మిషన్‌ భగీరథ నీటి సదుపాయం కల్పించారు. కరెంట్‌ లైన్లు వేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తమకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఆదుకుంటుందని ఆశపడితే ఉన్న గూడునే కూల్చేసిందని పలువురు దివ్యాంగులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వమే ఏ ఆధారం లేనోళ్లపై కత్తి కడితే పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో శుక్రవారం పొద్దు పొద్దున్నే తెలంగాణ సమాజమంతా చూసింది. బుల్డోజర్‌ రాజ్‌ ఎంత పాశవికంగా, కర్కషంగా ఉంటుందో చూసి అయ్యో పాపం అనుకుంది. అయినా పాలకుల్లో ఇసుమంతైన ఆందోళన, విచారం లేదు. ''ఒక అరగంట ఎలక్ట్రిసిటీ పోతే కొంపలేమైనా మునుగతయా అధ్యక్ష్యా.. ఒక నెల రోజులు, 15 రోజులు పెన్షన్లు లేటయితే బ్రహ్మాండం బద్ధలైతదా అధ్యక్ష్యా.. '' అని మహబూబ్‌ నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడితే ప్రతిపక్ష్యంపై విమర్శలు చేస్తున్నారనే అనుకున్నాం కానీ సొంత నియోజకవర్గంలోని నిరుపేదలు, అభాగ్యులు, విధి వంచితులపై ఆయనకు ఇసుమంతైన జాలి లేదు అనుకోలేదు.

హైదరాబాద్‌ లో హైడ్రా కూల్చివేతల పేరుతో సాగుతోన్న విన్యాసాలు.. హైడ్రా కమిషనర్‌, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి రంగనాథ్‌ పరస్పర విరుద్ధమైన స్టేట్‌ మెంట్లు సర్కారు విశ్వసనీయతకు ప్రశ్నార్థకంగా మారాయి. హైడ్రా నోటీసులు ఇవ్వొద్దు.. డైరెక్ట్‌ గా యాక్షన్‌ లోకే దిగుతుందని ఇటీవల మీడియా చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో రంగనాథ్‌ చెప్పారు. ఆ తెల్లారే అకడమిక్‌ ఇయర్‌ మధ్య విద్యాసంస్థలను కూల్చడం సరికాదు కాబట్టి నోటీసులు ఇస్తామన్నారు. రెండు రోజులైనా కాకముందే దుర్గం చెరువు బఫర్‌ జోన్‌ లో ఉన్న సీఎం రేవంత్‌ రెడ్డి అన్న కొండల్‌ రెడ్డి ఇల్లు సహా ఆ కాలనీలోని ఇండ్లకు నోటీసులు ఇచ్చారు. పెద్దలకు నెల రోజుల గడువిచ్చి పేదలు వారం రోజుల్లోనే ఇండ్లు ఖాళీ చేయాలని మెడపై కత్తిపెట్టారు. ఏ నోటీసులు లేకుండా ఇంకొన్ని చోట్ల ఏకపక్షంగా కూల్చివేతలు సాగించారు. కోర్టు స్టేలు ఉన్నా, కోర్టుల్లో న్యాయ వివాదాలు ఉన్నా సర్కారు పెద్దలకు గిట్టనివారి ఇండ్లపైకి బుల్డోజర్లను యథేచ్ఛగా పంపిస్తున్నారు. అదే సర్కారుకు సన్నిహితులు.. వాళ్ల అస్మదీయుల ఇండ్లు, ఆక్రమణలను చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. హైడ్రా బుల్డోజర్లపై (కూల్చివేతలపై) హైకోర్టు చేసిన కామెంట్స్‌ రేవంత్‌ ప్రభుత్వాన్ని అభిశంసించేవిగా ఉన్నాయి. కేవలం ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ నాయకుల ఆస్తులపైకే బుల్డోజర్లు పంపుతూ, నోటీసులు ఇస్తూ అక్కడే ఉన్న ఇతరులను ఎందుకు విస్మరిస్తున్నారని హైకోర్టు ప్రశ్నిస్తే ప్రభుత్వం దగ్గర చెప్పుకోవడానికి సమాధానమే లేదు. ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చేస్తే సంతోషించిన వాళ్లే.. ఈ కూల్చివేతల ప్రభావం పెట్టుబడులపై పడుతుందోమోనని హైరానా వ్యక్తం చేశారు. హైడ్రా బుల్డోజర్‌ రాజ్‌ మొత్తం బ్రాండ్‌ హైదరాబాద్‌ నే దెబ్బతీస్తుందని హైరానా చెందుతున్నారు. అయినా రేవంత్‌ బుల్డోజర్లు పెద్దోళ్ల ఆక్రమణలకు రక్షణగా నిలుస్తూ.. నిర్దయగా పేదల గుండెలపై స్వైరవిహారం చేస్తూనే ఉన్నాయి.

Next Story