రూ.25 లక్షలు ఇస్తామని చెప్పి రూ.5 లక్షల పరిహారమేనా?

పీసీసీ అధ్యక్షుడిగా ఇచ్చిన హామీని రేవంత్‌ నిలబెట్టుకోవాలి : కేటీఆర్‌

రూ.25 లక్షలు ఇస్తామని చెప్పి రూ.5 లక్షల పరిహారమేనా?
X

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించడం అన్యాయమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ 'ఎక్స్‌' వేదికగా పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోలో వరదలతో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అప్పుడు పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌ రెడ్డి చేసిన ట్వీట్‌ ను తన పోస్ట్‌ కు జత చేశారు. రూ.25 లక్షల పరిహారం ఇస్తామని చెప్పిన రేవంత్‌ రెడ్డినే ఇప్పుడు సీఎంగా ఉన్నారని, అప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. వరదలతో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలువాలన్నారు. వారిని ఆదుకోకపోతే అంతకన్నామోసం ఇంకొకటి ఉండదన్నారు. వరదలు, వర్షాలతో ఇండ్లు కోల్పోయిన వారికి రూ.2.50 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు సాయం చేస్తామని ఇచ్చిన హామీని కూడా నిలబెట్టుకోవాలన్నారు. ప్రభుత్వ అసమర్థత, చేతగానితనం, ముందస్తు ప్రణాలిక లేకపోవడంతోనే ఎక్కువగా ప్రాణనష్టం వాటిల్లిందన్నారు. ఇకనైనా వరద ప్రభావ ప్రాంతాల ప్రజలకు భరోసా కల్పించాలని, వారి ప్రాణాలు రక్షించే చర్యలు చేపట్టాలని కోరారు.

Next Story