అమెరికా వెళ్లినా రేవంత్‌ కు అదే టెన్షన్‌!

మంత్రుల కథలికలపై రేవంత్‌ ఫోకస్‌.. ఇంటెలిజెన్స్‌ మొత్తం ఈ టాస్క్‌ లోనే

అమెరికా వెళ్లినా రేవంత్‌ కు అదే టెన్షన్‌!
X

అమెరికాకు వెళ్లినా సీఎం రేవంత్‌ రెడ్డిని ఆగస్టు సంక్షోభం టెన్షన్‌ వెంటాడుతోంది. సప్త సముద్రాల అవతల ఉన్నా ముఖ్యమంత్రి తన కేబినెట్‌లోని మంత్రుల కథలికలపైనే ఎక్కువగా ఫోకస్‌ పెట్టారు. ఇంటెలిజెన్స్‌ విభాగం మొత్తం మంత్రుల కథలికలను మానిటరింగ్‌ చేయడం.. వాళ్లు ఎవరెవరిని కలుస్తున్నారు.. కలిస్తే ఏం మాట్లాడుతున్నారు.. ఎక్కడికి వెళ్తున్నారనే అంశాలపైనే ఉంది. ఉదయం నుంచి మంత్రులు ఇళ్లకు చేరే వరకు వారి ప్రతి కథలికను ఇంటెలిజెన్స్‌ క్లోజ్‌ గా వాచ్‌ చేస్తోంది. మినిస్టర్స్‌ ను ఎవరెవరు వచ్చి కలుస్తున్నారు.. అలా కలిసేవారి నేపథ్యం ఏమిటి? ఏ పని మీద వాళ్లు వచ్చారు.. వాళ్లు గతంలో ఎవరికి సన్నిహితంగా ఉన్నారు అనే అంశాలపైనా ఆరా తీస్తున్నారు. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌, మిగతా రాజకీయ పార్టీలు, ప్రజా, విద్యార్థి, యువజన సంఘాల యాక్టివిటీస్‌ ఏమిటీ? అనే విషయాలను పక్కన పెట్టి మంత్రులు, సీనియర్‌ ఎమ్మెల్యేలు, పార్టీలో ముఖ్యమైన నేతల కథలికలపైనే దృష్టి సారించారు. మొత్తంగా ఇంటెలిజెన్స్‌ రాడార్‌ లో మంత్రులు, సీనియర్ లీడర్లు ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మంత్రులు తమ ఇండ్లు, ఇతర పర్యటనల్లో జర్నలిస్టులతో భేటీ అయినా ఆ సమయంలో ఏయే అంశాలపై చర్చించారో ఆరా తీస్తున్నారు. ఈ వివరాలన్నీ క్రోడీకరించి అమెరికా టూర్‌ లో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి నివేదిస్తున్నారు.

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ మాజీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం దమోదర రాజనర్సింహా, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌ రావు, పొన్నం ప్రభాకర్‌ పై ఎక్కువగా నిఘా ఉన్నట్టుగా సమాచారం. బీఆర్‌ఎస్‌ ను వీడి కాంగ్రెస్‌ లో చేరిన పది మంది ఎమ్మెల్యేలు ఇంటెలిజెన్స్‌ రాడార్‌ లోనే ఉన్నారు. పార్టీలో సీనియర్‌ ఎమ్మెల్యేలు, మంత్రి పదవుల కోసం లాబీయింగ్‌ చేస్తున్న ఎమ్మెల్యేలు నిఘా నేత్రంలోనే ఉన్నారు. వాళ్ల ప్రతి కదలికను ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్‌ రికార్డ్‌ చేసి రిపోర్ట్‌ చేస్తోంది. కొన్ని సందర్భాల్లో వాళ్ల అంతర్గత సమావేశాల్లో మాట్లాడిన మాటలను రికార్డ్‌ చేసి తమకు ఇవ్వాలని పార్టీ లీడర్లు, ఇతర సోర్సులను ఇంటెలిజెన్స్‌ వర్గాలు కోరుతున్నాయి. ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్‌ లీడర్లపై ఇంటెలిజెన్స్‌ డేగ కన్ను వేసింది. ఎవరు ఢిల్లీలో ల్యాండ్‌ అయినా తక్షణమే తమకు సమాచారం వచ్చేలా నెట్‌ వర్క్‌ డెవలప్‌ చేసుకుంది. ఎవరైనా ఢిల్లీకి వస్తే వాళ్ల పూర్తి టూర్‌ వివరాలు తమకు అందేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంది. ఇప్పటికే సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి శ్రీధర్‌ బాబు అమెరికాకు చేరుకోగా మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అమెరికాకు పయనమవుతున్నారు. వెంకట్‌ రెడ్డి అమెరికాకు వెళ్లినా అక్కడ ఆయన ఎవరెవరిని కలుస్తున్నారు.. ఏయే అంశాలపై లాబీయింగ్‌ చేస్తున్నారనే దానిపై ఇంటెలిజెన్స్‌ ఓ కన్నేసి ఉంచేలా అన్ని చర్యలు చేపట్టింది.

అమెరికా పర్యటనలో రేవంత్‌ ఏం చేస్తున్నాడనే దానిపై తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ఆరా తీస్తున్నారు. అమెరికాలో ల్యాండ్‌ అయిన దగ్గరి నుంచి రేవంత్‌ ఎవరిని కలుస్తున్నాడు.. నిజంగా రాష్ట్రానికి పెట్టుబడుల కోసమే ఆయన అమెరికాకు వెళ్లారా.. ఈ టూర్‌ వెనుక రహస్య ఎజెండా ఏదైనా ఉందా అని ఆరా తీస్తున్నారు. రేవంత్‌ రాజకీయంగా, ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకే అమెరికా పర్యటనకు వెళ్లారని కేబినెట్‌ సీనియర్‌ మంత్రులు, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు అనుమానిస్తున్నారు. సీఎం పాల్గొనే ప్రతి సమావేశం నుంచి అక్కడ ఏం జరిగింది అనే ఇన్‌ పుట్స్‌ వచ్చేలా మంత్రులు ఏర్పాట్లు చేసుకున్నట్టుగా ప్రచారంలో ఉంది. అమెరికాలో ఉన్న తమ సన్నిహితులు, వ్యాపారవేత్తలతో మంత్రులు, సీనియర్‌ లీడర్లు ఫోన్‌లలో మాట్లాడుతూ.. అక్కడ ఏం జరుగుతుందా అని ఆరా తీస్తున్నారు. కాంగ్రెస్‌ తో తేడా వస్తే తన సన్నిహిత ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేస్తారనే అనుమానంతో ఉన్న ఢిల్లీ కాంగ్రెస్‌ పెద్దలు కూడా ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ నేతలతో మాట్లాడి రేవంత్‌ టూర్‌ పై ఓ కన్నేసి ఉంచాలని చెప్పారని సమాచారం. అమెరికాకు వెళ్లినా సీనియర్లంతా కలిసి ఆగస్టు సంక్షోభాన్ని ఎక్కడ తెస్తారో అనే టెన్షన్‌ సీఎం రేవంత్‌ రెడ్డిని వేధిస్తుంటే.. అమెరికాలో రేవంత్‌ ఏం చేస్తున్నాడో ఆరా తీసే పనిలో సీనియర్‌ మంత్రులు ఉన్నారు. మంత్రులపై సీఎం రేవంత్‌ ఇంటెలిజెన్స్‌ రాడార్‌ ను ప్రయోగిస్తే.. సీనియర్‌ లీడర్లు, మంత్రులు రేవంత్‌ పై తమ సొంత మనుషులతో నిఘా కొనసాగిస్తున్నారు. మొత్తానికి సీఎం రేవంత్‌ అమెరికా టూర్‌ కాంగ్రెస్‌ పార్టీలోనే పొలిటికల్‌ హీట్‌ పుట్టిస్తోంది.

Next Story