బాధితులను పరామర్శిస్తే భౌతిక దాడులా?

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ప్రాణ, ఆస్తి, పంట నష్టం. వరదలు వచ్చిన రోజు సీఎం ఎక్కడ అని ప్రశ్నించిన మాజీ మంత్రి హరీశ్‌ రావు

బాధితులను పరామర్శిస్తే భౌతిక దాడులా?
X

ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ప్రతిపక్షాలు బురద రాజకీయాలు చేయవద్దని, ప్రజలకు బీఆర్‌ఎస్‌ అండగా ఉండాలని భావిస్తే ప్రతిపక్ష నేత కేసీఆర్‌ ప్రజల వద్దకు వెళ్లాలి... వారి నుంచి విజ్ఞప్తులు తీసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి నిలదీయాలని నిన్న ఖమ్మంలో సీఎం రేవంత్‌రెడ్డి సూచన చేశారు. అయితే ముఖ్యమంత్రి మాటల అర్థం ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా.. వారికి అండగా నిలిచినా, ప్రభుత్వాన్ని నిలదీసినా దాడులు చేస్తామని ఆ పార్టీ కార్యకర్తలు ఖమ్మంలో చూపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం చేతగాని తనం వల్లనే ముంపు ప్రాంతాల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్‌ మంత్రులను, చివరికి నిన్న ఖమ్మంలో సీఎం రేవంత్‌ను నిలదీశారు అంటే ప్రభుత్వ తీరుపై ప్రజాగ్రహం వ్యకమైంది. అయినా రేవంత్‌ మారలేదు. కాంగ్రెస్‌ మారలేదు. దౌర్జన్యాలు, దాడులనే ఆ పార్టీ సంస్కృతిగా మరోసారి నిరూపించింది. ఖమ్మంలో బీఆర్‌ఎస్‌ నేతల పై జరిగిన దాడే ఇందుకు నిదర్శనం.

ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వరద బాధితులన పరామర్శించడానికి వెళ్లిన బీఆర్‌ఎస్‌ నేతలపై కాంగ్రెస్‌ గూండాలు అడ్డుకున్నారు. ఆందోళనకారులను అడ్డుకోవాల్సిన పోలీసులు వారిని నిలువరించకుండా ప్రేక్షక పాత్ర పోషించారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, పువ్వాల అజయ్‌కుమార్, సబతా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు వాహనాలపై కాంగ్రెస్‌ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తుండగా కాంగ్రెస్‌ కార్యకర్తలు అడ్డుకున్నారు. కాంగ్రెస్‌ గుండాల దాడిలో బీఆర్‌ఎస్‌ కార్యకర్త సంతోష్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కాంగ్రెస్‌ కార్యకర్తల అచాచకాలపై స్థానికులు తీవ్రంగా మండిపడ్డారు. మీరు సహాయం చేయలేదు. చేసేవారిపై దాడులు సరికాదని మండిపడుతున్నారు.

బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

ఖమ్మం జిల్లాలో వరద బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం వరద ప్రాంతాల్లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల బృందం పర్యటించింది. ఖమ్మం జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. మూడు నాలుగు రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలకు ఖమ్మం జిల్లాలో తీవ్రమైన నష్టం జరిగింది. సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాల్లో వర్షాల వల్ల జనజీవనం అతలాకుతలమైంది. భారీగా ప్రాణ, ఆస్తి, పంట నష్టం జరిగింది. వరదల విషయంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్నారు.

పార్టీ తరఫున వరద బాధితులకు సహాయం అందించడానికి సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్‌, జగదీశ్‌రెడ్డి, రవిచంద్ర, నామా నాగేశ్వర్‌రావు, వివేకానంద గౌడ్‌, కౌశిక్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, శంభీపూర్‌ రాజు వచ్చాం. ప్రభుత్వం చేపడుతున్న వరద చర్యలు పరిశీలించేందుకు వచ్చాం. పాలేరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి సహాయం అందించారు. పువ్వాడ అజయ్‌ ఖమ్మంలో ఆయా డివిజన్ల ప్రజలకు నిత్యావసరాలు అందిస్తున్నారు. ఖమ్మం ప్రజలను ఆదుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ముందుకు వచ్చామని హరీశ్‌ తెలిపారు.

వరదలు వచ్చిన రోజు సీఎం ఎక్కడున్నారు?

వరద బాధితులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. నిత్యావసరాలు సహా దస్త్రాలు, పుస్తకాలు కూడా కొట్టుకుపోయాయి. వరద సహాయక చర్యల్లో ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తుననది. ఇళ్లపై నిలబడిన వరద బాధితులకు ఆహారం కూడా అందించదు. వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వరదలు వచ్చినరోజు సీఎం రేవంత్‌రెడ్డి ఎక్కడున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. వరదల రోజు సీఎం సచివాలయానికి రాలేదు. సమీక్షలు చేయలేదన్నారు. వరదలప్పుడు కేసీఆర్‌ బాగా చేశారని ఇవాళ ప్రజలు అంటున్నారు. అన్నీ ప్రతిపక్షాలే చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారు.

అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి

రాష్ట్రాన్ని ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం కూడా విఫలమైంది. రాష్ట్రానికి ఎన్టీఆర్‌ఎఫ్‌ బృందాలను కేంద్రం ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని, అందరం కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీద్దామని హరీశ్‌ సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ఖమ్మం, మహబూబాబాద్‌ ప్రజలు బలైపోయారు. చనిపోయిన వారి సంఖ్యను కూడా ప్రభుత్వం తక్కువగా చూపుతున్నది. వరదల్లో 30 మంది చనిపోతే.. కేవలం 15 మంది చనిపోయారని చెబుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే సాగర్‌ ఎడమకాలువకు గండి పడిందని హరీశ్‌ ధ్వజమెత్తారు. ప్రభుత్వ అలసత్వం వల్లనే వేల ఎకరాల పంట నష్టం జరిగిందని విమర్శించారు. రైతులకు ఎకరానికి రూ. 30 వేలు ఇవ్వాలని హరీశ్‌ డిమాండ్‌ చేశారు.

పువ్వాడ అజయ్‌ కారు ధ్వంసం

వరద బాధితులను పరామర్శించడానికి వచ్చిన బీఆర్‌ఎస్‌ నేతలపై కాంగ్రెస్‌ కార్యకర్తలు దాడికి యత్నించారు. ఖమ్మం నగరం బొక్కల గడ్డలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కార్యకర్తలు పరస్పరం నినాదాలు చేసుకున్నాయి. కాంగ్రెస్‌ కార్యకర్తలు మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌ కాన్వాయ్‌పై రాళ్ల దాడి చేయడంతో ఆయన కారు ధ్వంసమైంది.

చేతగాని, దద్దమ్మ పాలనను ప్రజలు గమనిస్తున్నారు: కేటీఆర్‌

ఖమ్మంలో కాంగ్రెస్ గుండాల దాడిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలపై దాడిని ఖండించారు.మాజీ మంత్రులు హరీశ్‌ రావు, పువ్వాడ, సబితా ఇంద్రారెడ్డి వాహనాలపై దాడి చేయటం కాంగ్రెస్ అసహనానికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రజలకు సాయం చేయటం చేతగాక...సాయం చేస్తున్న వాళ్లను చూసి ఓర్వలేకే ఈ దాడికి తెగబడ్డారు. మీరు ప్రజలను నిర్లక్ష్యం చేస్తే వారికి అండగా ఉండటమే తప్పా? అని ప్రశ్నించారు. ప్రజలకు సేవ చేయటం చేతకాదు...సేవ చేసే వాళ్లపై మాత్రం దాడి చేయటమా? సిగ్గు చేటు. ఈ దాడికి ముఖ్యమంత్రి సహా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు ఇలాంటి ఎన్ని దాడులు చేసిన సరే...ప్రజల వద్ద బీఆర్ఎస్ శ్రేణులను వెళ్లకుండా ఆపలేరన్నారు. కాంగ్రెస్ చేతగాని, దద్దమ్మ పాలనను ప్రజలు గమనిస్తున్నారు. మీకు సరైన సమయంలో బుద్ధి చెప్పటం ఖాయం.

Raju

Raju

Writer
    Next Story