ప్రజల కన్నీళ్లు తుడవాల్సిన సమయంలో ప్రతీకార రాజకీయాలా?

వరద బాధితులను పరామర్శించడమూ పాపమేనా

ప్రజల కన్నీళ్లు తుడవాల్సిన సమయంలో ప్రతీకార రాజకీయాలా?
X

భారీ వర్షాలతో పోటెత్తిన వరదల్లో చిక్కుకొని సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన అభ్యాగ్యులు కొందరు. వరదలు సొంత వాళ్లను మింగేయడంతో తీరని దుఃఖంలో ఉన్నవాళ్లు కొందరు. ఇండ్లు కూలిపోయి గూడు కోల్పోయినోళ్లు కొందరైతే.. తమ కష్టం మొత్తం వరద పాలైనోళ్లు ఇంకా ఎంతో మంది.. ఎవరిని కదిలించినా కన్నీటి వ్యథలే.. వాళ్ల బాధలను చెప్పడానికి మాటలు రావడం లేదు. వాళ్ల కన్నీళ్లు తుడవడం ఎవరి తరమూ కావడం లేదు. ప్రజలంతా ఘోర విపత్తుతో అల్లాడుతుంటే వాళ్లకు అండగా నిలవాల్సినోళ్లు ప్రతికార రాజకీయాలు చేస్తున్నారు. ప్రతిపక్షాలు వరద బాధితులను పరామర్శించడమే పాపమన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఖమ్మంలో వరదలతో నష్టపోయిన వారికి భరోసానిచ్చేందుకు వెళ్లిన మాజీ మంత్రులు హరీశ్‌ రావు, జగదీశ్‌ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డితో పాటు స్థానిక నాయకుడు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ పై కాంగ్రెస్‌ నాయకులు దాడికి తెగబడ్డారు.. మాజీ మంత్రులు, నాయకులు ప్రయాణిస్తున్న కార్లపై రాళ్లతో దాడి చేశారు. ఈ రాళ్ల దాడిలో కార్ల ధ్వంసమయ్యాయి.

ఖమ్మంలో శనివారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఆదివారం ఉదయానికే పరిస్థితి చేయి దాటింది. మున్నేరు ఉప్పొంగడంతో ఖమ్మం జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాలు జల దిగ్భంధంలో చిక్కుకున్నాయి. రాష్ట్రమంతటా భారీ వర్షాలు కురిసినా.. ఖమ్మంలోనే ఎక్కువ ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. ముంపు ప్రాంతాల్లోని ప్రజలను కదిలిస్తే వాళ్ల కన్నీటి గాథలు ప్రతి ఒక్కరి కల్లు చెమర్చేలా చేశాయి. జలఖడ్గం ఎంతటి నిర్దయగా ఉంటుందో కొందరు ఒక్కోమాట కూడదీసుకుంటూ చెప్పడం గుండెలను బరువెక్కించింది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నోళ్లకు తోచిన సాయం చేయాలే.. అధికారంలో ఉన్నోళ్లకూ ఈ బాధ్యత ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉండటం.. వాళ్లు ప్రభుత్వంలో చాలా కీలకం కావడంతో భారీ వర్షాలు, వరదల్లో తమకు ఎక్కువ సాయం దక్కుతుందని అక్కడి ప్రజలు ఆశించారు. కానీ వాళ్ల ఆశలు అడియాశలయ్యాయి. ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో పెనునష్టం సంభవించింది. ఈ ఘోర విపత్తులో చిక్కుకున్న వాళ్లు ప్రభుత్వం మీద కడుపుమంట వెళ్లగక్కారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు మీద తిరగబడ్డంత పని చేశారు. ఒక రోజంతా సాయం కోసం ఎదురుచూసి సహనం నశించిన వాళ్ల నుంచి ఈ తరహా ప్రతిఘటన సహజమే. ఎవరో రెచ్చగొడితేనో.. ఇంకెవరో చెప్తేనో ప్రజలు ఇలా స్పందించరు. ఈ విషయం జీర్ణించుకోవడానికి ప్రభుత్వపెద్దలు సిద్ధంగా లేరని బీఆర్‌ఎస్‌ నేతల కార్లపై దాడితో తేటతెల్లమవుతోంది.

కాంగ్రెస్‌ నేతల రాళ్ల దాడిలో కార్లు ధ్వంసం కావడంతో పాటు సంతోష్‌ రెడ్డి అనే బీఆర్‌ఎస్‌ కార్యకర్త కాలికి తీవ్ర గాయమైంది. ఆంధ్రప్రదేశ్‌ లో సీఎం చంద్రబాబుతో పాటు ప్రతిపక్ష నాయకుడు జగన్‌ వరద బాధితులకు అండగా నిలిచారని.. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్‌ ఎక్కడ అని రేవంత్‌ రెడ్డి ఖమ్మంలో ప్రశ్నించారు. కేసీఆర్ వరద బాధితులను పరామర్శించలేదు.. కానీ బీఆర్ఎస్‌ నాయకులంతా వరద సహాయక చర్యల్లోనే నిమగ్నమై ఉన్నారు. తమ ప్రాంత ప్రజలకు భరోసానిచ్చేందుకు రాత్రి పగలు అనే తేడా లేకుండా పని చేస్తున్నారు. కొందరు మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సైతం గ్రౌండ్‌ లోనే ఉండి ప్రజలకు అండగా నిలిచారు. రాష్ట్రమంతా భారీ వర్షాలు, వరదల్లో చిక్కుకుని ఉన్నా శనివారం నుంచి సోమవారం ఉదయం వరకు సీఎం రేవంత్‌ రెడ్డి ఎవరికీ కనిపించలేదు. వాతావరణ శాఖ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించినా ముందు జాగ్రత్త చర్యలు కూడా లేవు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆర్మీ హెలీక్యాప్టర్లు, ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని తరలించడానికి అవసరమైన బోట్లు తెప్పించలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం అనేకన్నా రేవంత్‌ రెడ్డి అవగాహన రాహిత్యం, పాలనపై పట్టులేకపోవడంతోనే తలెత్తిన ఘోర విపత్తు ఇది అని కాంగ్రెస్‌ పార్టీ నాయకులే ఆఫ్‌ ది రికార్డుగా చెప్తున్నారు.

వరద బీభత్సానికి అన్నీ వేళ్లు తన వైపే చూపిస్తుండటంతో సోమవారం మధ్యాహ్నం నుంచే రేవంత్‌ రెడ్డి డైవర్షన్‌ పాలిటిక్స్‌ షురూ చేశారు. తాను వెళ్తోన్నది వరద బాధితులను పరామర్శించడానికి అన్న సోయి మరిచి పెళ్లిళ్లు, ఫంక్షన్లకు ముస్తాబు చేసినట్టు డెకరేట్‌ చేసిన వేదికపై నుంచి సూర్యాపేటలో రివ్యూ చేశారు. దానిపై విమర్శలు రావడంతో ఇంకా ఫ్రస్ట్రేట్‌ అయ్యారు. తన తప్పును కేసీఆర్ పై రుద్దే ప్రయత్నం చేశారు. భారీ వర్షాలు, వరదలతో రేవంత్‌ ప్రభుత్వం అప్రతిష్ట మూటగట్టుకుంది. నాగార్జున సాగర్‌ కాలువ తూముల గేట్లకు వెల్డింగ్‌ చేయించడంతో అవి ఓపెన్‌ చేసే అవకాశం లేక కాల్వ తెగి సూర్యాపేట జిల్లాలో రైతులకు పెను నష్టం వాటిల్లింది. ఒకటి తర్వాత ఒకటిగా ప్రభుత్వ నిర్వాకాలన్నీ బయట పడటంతో ప్రధాన ప్రతిపక్షాన్ని కాంగ్రెస్‌ నేతలు టార్గెట్‌ చేశారు. వాస్తవ పరిస్థితిని మరిచి, కష్టాల్లో ఉన్న వాళ్లను ఆదుకోవాలన్న బాధ్యత విస్మరించి ప్రతికార రాజకీయాలకు తెరతీశారు. తద్వారా బీఆర్‌ఎస్‌ లీడర్లను తరిమేశాం అని తాత్కాలికంగా సంబర పడవచ్చు.. కానీ ప్రజలు ఇలాంటి దాడులను హర్షించరు అన్న వాస్తవాన్ని గుర్తించాలి. వరదలు, విపత్తులు సంభవించినప్పుడు పరామర్శకు వచ్చిన వాళ్లపై దాడులను అసలే సహించరు. కానీ ఎంతసేపు రాజకీయాలు చేసే రేవంత్‌ రెడ్డికి, ఆయన కేబినెట్‌ లోని కొందరు మంత్రులు, లీడర్లకు వాస్తవాలు ఏమాత్రం రుచించవు. సందర్భం ఏదైనా మాటలతో దాడి చేయడం రేవంత్‌ నైజం.. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ప్రజలు, ప్రతిపక్షాలపై దాడులకు తెగబడటం ఆయన అనుచరుల లక్షణం.

Next Story