వృద్ధురాలికి ఇచ్చిన పింఛన్‌ తిరిగి గుంజుకుంటరా?

కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలిక ఊడినట్టున్నట్టుగా రేవంత్‌ సర్కారు తీరు.. కేటీఆర్‌ ఫైర్‌

వృద్ధురాలికి ఇచ్చిన పింఛన్‌ తిరిగి గుంజుకుంటరా?
X

వృద్ధురాలికి ఇచ్చిన పింఛన్‌ సొమ్మును తిరిగి గుంజుకుంటరా.. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలిక ఊడగొట్టినట్టుగా ఉన్నది రేవంత్‌ సర్కారు తీరు అని 'ఎక్స్‌' వేదికగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఫైర్‌ అయ్యారు. అర్హులందరికీ పింఛన్లు ఇస్తామని, ఇప్పటకే ఇస్తున్న పింఛన్లను పెంచుతామని దొంగ హామీలిచ్చి గద్దెనెక్కిన రేవంత్‌ సర్కారు ఇప్పుడు రాష్ట్రంలోని లబ్ధిదారుల నుంచి పింఛన్లు, సంక్షేమ పథకాల రూపంలో ఇచ్చిన డబ్బులు వెనక్కి ఇచ్చేయాలంటూ నోటీసులు ఇస్తోందని మండిపడ్డారు. సాంకేతిక కారణాలు చూపిస్తూ వేలాది మంది ఆసరా పింఛన్‌ లబ్ధిదారులకు ఇప్పటి వరకు పింఛన్‌గా ఇచ్చిన డబ్బులన్నీ వెనక్కి ఇచ్చేయాలని నోటీసులు ఇస్తోందని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని దాసరి మల్లమ్మ అనే 80 ఏళ్ల వృద్ధురాలికి ప్రభుత్వం ఇప్పటి వరకు ఆసరా పింఛన్‌ రూపంలో రూ.1.72 లక్షలు ఇచ్చిందని, ఆసరా పింఛన్‌ పొందే అర్హత లేనందున ప్రభుత్వం నుంచి వచ్చిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని మున్సిపల్‌ కమిషనర్‌ ఆమెకు నోటీసులు జారీ చేశారు. పక్షవాతంతో బాధపడుతున్న మల్లమ్మకు కేసీఆర్‌ ప్రభుత్వం ఆసరా పింఛన్‌ ఇచ్చి ఆదుకోగా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఆ ఒంటరి వృద్ధురాలి నుంచి పెన్షన్‌ సొమ్ము తిరిగి లాక్కోవాలని ప్రయత్నించడం అమానవీయమని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే పేదలపై ఇలాంటి దుర్మార్గపు చర్యలు మానుకోవాలని.. లేదంటే కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడుతారని హెచ్చరించారు.

Next Story