సొంత ఎజెండానా.. సమస్యల పరిష్కారం కోసమేనా?

ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీ వెనుక మర్మమేమిటి

సొంత ఎజెండానా.. సమస్యల పరిష్కారం కోసమేనా?
X

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సీఎంలు ఎందుకు భేటీ అవుతున్నరు.. వాళ్లిద్దరి సమావేశానికి సొంత ఎజెండానే కారణమా.. రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలను కొలిక్కి తీసుకురావడానికా.. వాళ్లిద్దరు కొన్నాళ్ల క్రితం వరకు ఒకే స్కూల్‌లో ఉన్నరు. పసుపు జెండా.. ఆ పార్టీ ఎజెండా కోసమే పని చేశారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇక్కడ టీడీపీ ఉనికి కనుమరుగు కావడంతో రేవంత్‌ ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌ పంచన చేరారు. అన్నీ కలిసి వచ్చి తెలంగాణకు ముఖ్యమంత్రి కూడా అయ్యారు. 2019 ఎన్నికల్లో ఓడిన చంద్రబాబు మొన్నటి ఎన్నికల్లో గెలిచి మళ్లీ ఏపీ సీఎం అయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుందామని చంద్రబాబు ఆఫర్‌ చేస్తే రేవంత్‌ ఆల్‌రైట్‌ బాస్‌ అన్నారు. ఇద్దరు సీఎంలు ఈ రోజు ప్రజాభవన్‌ వేదికగా సమావేశమవుతున్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ భేటీ రెండు గంటల పాటు కొనసాగే అవకాశముంది. దాదాపు 15 అంశాలపై సీఎంలు ఇద్దరూ చర్చించనున్నట్టుగా చెప్తున్నారు.

రాష్ట్ర విభజన చట్టంలోని 9,10 వ షెడ్యూల్‌లోని సంస్థలు సహా విద్యుత్‌ బకాయిలు, ఉద్యోగుల చిక్కుముళ్ల పరిష్కారంపై ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించనున్నారు. ఏపీలోని తీర ప్రాంతం,టీటీడీతో పాటు కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం ఓడరేవుల్లో తమకు వాటా కావాలని తెలంగాణ ప్రభుత్వం కోరనున్నది. విభజన చట్టం ప్రకారం పాలనా పరమైన సౌకర్యాల కోసం హైదరాబాద్‌ లో ఏపీకి మూడు భవనాలను కేటాయించింది. ఉమ్మడి రాజధాని ముగిసిపోవడంతో ఆ భవనాలను తెలంగాణ ప్రభుత్వం సాధ్వీనం చేసుకోవాలనుకుంటున్నది. అయితే ఏపీ వీటిపై పీటముడి పెట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇక్కడ పార్టీ విస్తరణ కోసం ప్రయత్నం చేస్తున్న ఏపీ సీఎం ఆ భవనాలను ఏపీకే ఇవ్వాలని కోరనున్నట్టు తెలుస్తోంది. పదేళ్లుగా ఈ సమస్యలు పెండింగ్‌లో ఉండటానికి కారుకుల్లో ఒకరైన చంద్రబాబే మాట్లాడుకుందామని లేఖ రాయడం గమనార్హం. ఏపీ కొర్రీల వల్లనే విభజన సమస్యలు పరిష్కారం కాలేదని, అందుకే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడవద్దనీ సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ విజ్ఞప్తి చేసింది. దీనిపై రేవంత్‌ సర్కార్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

విభజన అంశాలపై ఇరు రాష్ట్రాల అధికారులు ఇప్పటివరకు 30 సార్లు భేటీ అయ్యారు. అయినా అనేక అంశాల్లో చట్టానికి విరుద్ధంగా ఏపీ వ్యవహరించడం వల్లనే సమస్య జటిలమైంది. ఇప్పుడు విభజన సమస్యలపై ఇద్దరు సీఎంలు భేటీ కావడం ఇదే మొదటిసారి. విభజన చట్టంలోని 9,10 షెడ్యూల్‌లోని సంస్థలు, ఆస్తులపై ప్రధానంగా ఇద్దరు సీఎంలు చర్చించనున్నారు. 9 షెడ్యూల్‌లోని అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన షిలా బిడే కమిటీ కొన్ని సిఫార్సు చేసింది. ఈ షెడ్యుల్‌లో మొత్తం 91 కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిలో 89 ని విభజనించాలని కమిటీ చేసిన ఏపీ అంగీకారం తెలిపింది. కానీ 68 కార్పొరేషన్లను మాత్రమే విభజిస్తామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్టీసీ, ఎఫ్‌ఎస్‌సీ వంటి 23 కార్పొరేషన్లలోని ఆయా సంస్థలకు ఉన్న ఆస్తులపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాలపై భిన్నవాదనలు ఉన్నాయి. విభజన చట్టంలో నిధులు, ఉద్యోగులను పంచుకోవాలని ఆస్తులను ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రానికి చెందుతాయని పేర్కొన్నది. విభజన చట్టంలోనని హెడ్‌ క్వార్టర్స్‌ అన్న పదానికి ఏపీ పేచీ పెడుతున్నది. కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయాన్నే హెడ్‌క్వార్టర్స్‌గా పరిగణించానలని తెలంగాణ అంటున్నది. దీనికి భిన్నంగా హైదరాబాద్‌లోని కార్యాలయాలను, భవనాలను హెడ్‌ క్వార్టర్స్‌గా పరిగణించాలని ఏపీ వాదిస్తున్నది. వీటిలో ఏపీకి వాటా కావాలన్నది ఏపీ ఉద్దేశం. ఈ వివాదానికి ముగింపు పలకడానికి కేంద్రం హెడ్‌క్వార్టర్స్‌ అనే పదానికి స్పష్టత ఇచ్చింది. తెలంగాణ వాదనను సమర్థించింది. దీన్ని అంగీకరించలేదు. దీన్నిబట్టి 9 షెడ్యూల్‌లో సంస్థల విభజన ఎందుకు పూర్తి కాలేదు అర్థమౌతున్నది. ఇప్పుడు బాబు మళ్లీ హైదరాబాద్‌లో ఆస్తులపై డిమాండ్‌ చేస్తే రేవంత్‌ సర్కార్‌ గట్టిగా తిప్పికొట్టాలని తెలంగాణ వాదులు కోరుతున్నారు.

10 వ షెడ్యూల్‌లో 142 సంస్థలు ఉన్నాయి. తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్‌ విశ్వవిద్యాలయం, తెలుగు అకాడమీ వంటి 30 సంస్థలపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య భిన్నవాదనలు ఉన్నాయి. తెలుగు అకాడమీ సహా భవనాలు, ఇతర అంశాల్లో ఏకాభిప్రాయం కుదర లేదు. రాజ్‌భవన్‌, లోకాయుక్త, హైకోర్టు రాజ్యాంగబద్ధ సంస్థల నిర్వహణపై ఏపీ నుంచి జనాభా ప్రాతిపదికన బకాయిలు రావాలని తెలంగాణ అంటున్నది. కార్మిక సంక్షేమ నిధి, వాణిజ్య పన్నుల బకాయిలపై వివాదాలున్నాయి. హైదరాబాద్‌లో ఏపీ ఆధీనంలో ఉన్న లేక్‌ వ్యూ గెస్ట్‌ హౌజ్‌, సీఐడీ కార్యాలయం, మినిస్టర్స్‌ క్వార్టర్స్‌ , ఐఏఎస్ క్వార్టర్స్‌ లను ఆధీనంలోకి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్నది. లేక్‌ వ్యూ గెస్ట్‌ హౌజ్‌, సీఐడీ కార్యాలయం, హెర్మిటేజ్‌ కాంప్లెక్స్‌ తమకు కావాలని ఏపీ కోరుతున్నది. స్థానికత, ఆప్షనల్స్‌ ఆధారంగా ఉద్యోగుల పరస్పర మార్పు అంశం పెండింగ్‌లో ఉన్నది. ఏపీ స్థానికత కలిగిన 1800 మందికి పైగా విద్యుత్‌ ఉద్యోగుల వేతనాల వ్యత్యాసం, సర్దుబాటు వంటి అంశాలు చర్చకు రావొచ్చు. విద్యుత్ బకాయిల అంశం కూడా సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నది. సుమారు రూ. 24 వేల కోట్లు ఏపీ చెల్లించాలని తెలంగాణ వాదిస్తున్నది. మాకు రూ. 7 వేల కోట్లు రావాలని ఏపీ అంటున్నది.

ఇక నీటిపారుదలకు సంబంధించి కృష్ణ జలాల్లో 811 టీఎంసీల నీటి లభ్యత ఉన్నందున అంతర్జాతీయ నీటి పంపిణీ నిబంధనల ప్రకారం క్యాచ్‌ మెంట్‌ ఏరియా నిష్ఫత్తిలో నీటి పంపిణీ చేయాలని, తెలంగాణ 558 టీఎంసీలు కేటాయించాలని వాదిస్తున్నది. కృష్ణ జలాల పంపిణీపై వేసిన బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తుది తీర్పు త్వరలో వెలువడనున్నది. ఆ ట్రిబ్యునల్‌ మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఏపీ రాష్ట్రాలకు పంచింది. ఇప్పుడు తెలంగాణ ఏర్పడింది కాబట్టి ఆ జలాలను నాలుగు రాష్ట్రాలకు పంచాలని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్లు కేంద్రంతో కొట్లాడింది. దీనిపై సుప్రీంకోర్టులోనూ కేసు వేసింది. కేసు విత్‌ డ్రా చేసుకుంటే సమస్యను పరిష్కరిస్తామన్న కేంద్రం ఇప్పటివరకు ఆ పని చేయలేదు. ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలపై అడ్డగోలు వాదనలు చేస్తున్నది. అందుకే ఈ సమస్య పరిష్కారం కాలేదు. ఇవాల భేటీలో ఇరు రాష్ట్రాల సీఎం సమక్షంలో రేవంత్‌ సర్కార్‌ దీనిపై ఎలా వ్యవహరిస్తున్నది అన్నది కీలకంగా మారింది. కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక ప్రాజెక్టుల భవితవ్యం ఈ నీటి కేటాయింపులపైనే ఆధారపడి ఉన్నది.

Raju

Raju

Writer
    Next Story