మా సీఎం పాపం చేసిండు.. దీనికి ప్రజలను శిక్షించొద్దు

రేపు యాదాద్రి లక్ష్మీనర్సింహాస్వామిని దర్శించుకోనున్న హరీశ్‌ రావు.. బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

మా సీఎం పాపం చేసిండు.. దీనికి ప్రజలను శిక్షించొద్దు
X

ఆగస్టు 15లోగా రైతులందరి రుణాలు మాఫీ చేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి మీద ఒట్టు పెట్టి మాట తప్పారని, సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన పాపానికి తెలంగాణ ప్రజలను శిక్షించొద్దని కోరుతూ గురువారం యాదాద్రి ఆలయాన్ని దర్శించుకొని లక్ష్మీనర్సింహస్వామికి పూజలు చేస్తానని మాజీ మంత్రి హరీశ్‌ రావు ఒక ప్రకటనలో తెలిపారు. తనతో పాటు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు యాదాద్రి ఆలయాన్ని దర్శించుకొని తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం ప్రత్యేక పూజలు చేస్తారని తెలిపారు. ''ఈ పాపాత్ముడైన ముఖ్యమంత్రిని క్షమించు, తెలంగాణ ప్రజలపై దయ ఉంచు అని యాదగిరి నరసింహాస్వామిని వేడుకుంటాము. ముఖ్యమంత్రి పాపం ప్రజలకు శాపం కాకుండా చూసి రక్షించాలని స్వామిని ప్రార్థిస్తాము.. '' అని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాలు రూ.49 వేల కోట్లు ఉన్నాయని చెప్పారని, తాను ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటే రూ.40 వేల కోట్లు మాఫీ చేస్తానని ఈ ఏడాది జనవరిలో రేవంత్‌ రెడ్డి అన్నారని గుర్తు చేశారు. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో రూ.31 వేల కోట్ల క్రాప్‌ లోన్లు మాఫీ చేస్తామని రేవంత్‌ రెడ్డి దేవుళ్ల మీద ఒట్లు పెట్టుకున్నారని తెలిపారు. బడ్జెట్ లో రూ.26 వేల కోట్లు రుణమాఫీ కోసం కేటాయించి.. ఈనెల 15వ తేదీ నాటికి రూ.17 వేల కోట్లు మాత్రమే మాఫీ చేశారని అన్నారు. రూ.2 లక్షల వరకున్న క్రాప్‌ లోన్లన్నీ మాఫీ చేశామని సీఎం చెప్తుంటే.. ఇంకా రూ.12 వేల కోట్ల రుణాలు మాఫీ చేయాల్సి ఉందని మంత్రి పొంగులేటి అంటున్నారని, ఇంకా 17 లక్షల మందికి రుణమాఫీ కాలేదని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి చెప్తున్నారని.. ఇందులో ఎవరు చెప్పేది నమ్మాలని ప్రశ్నించారు. దేవుళ్లపై ఒట్లు పెట్టుకొని మాట తప్పిన రేవంత్‌ రెడ్డిని నిలదీసేందుకు గురువారం ఆలేరులో నిర్వహించే ధర్నాలో పాల్గొంటున్నానని తెలిపారు. రైతులందరి రుణాలు మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని నిగ్గదీసి అడుగుతామన్నారు.

Next Story