విభజన సమస్యలు కాదు.. పార్టీ విస్తరణ కోసమే

బాబు ఆరాతమంతా తెలంగాణ పై రాజకీయ ఆధిపత్యం కోసమే. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో వ్యాఖ్యలతో స్పష్టమైన టీడీపీ అధినేత అభిమతం

విభజన సమస్యలు కాదు.. పార్టీ విస్తరణ కోసమే
X

విభజన సమస్యల పరిష్కారం కోసం ఉన్నతాధికారులతో ఒక కమిటీ, అక్కడా పరిష్కారంకానీ అంశాలపై మంత్రులతో ఒక కమిటీ, అక్కడ కూడా తేలకపోతే ముఖ్యమంత్రుల భేటీలో చర్చించిన నిర్ణయాలు. ఇదీ నిన్న స్థూలంగా ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశం చర్చల సారాంశం. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన ఏపీ ప్రభుత్వాల వైఖరి వల్లనే విభజనలోని అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. ఇప్పుడు వాటి పరిష్కారం కోసం తానే చొరవ తీసుకున్నానని బాబు గొప్పలు చెప్పుకోవడం చంద్రబాబుకే చెల్లింది. ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ రాజకీయపరమైనది కానప్పటికీ బాబు అజెండాలో విభజన అంశాల కంటే విస్తరణపైనే ఉన్నదని ఇవాళ ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో ఆయన వ్యాఖ్యల ద్వారా స్పష్టమైంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఖమ్మం టీడీపీ నేతల సమావేశమైనప్పుడు అక్కడి నుంచే టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. తీరా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా పరోక్షంగా కాంగ్రెస్‌ గెలుపు కోసం కృషి చేశారు. దానికి రిటర్న్‌ గిఫ్ట్‌గా ఇక్కడి టీడీపీ శ్రేణులు, కాంగ్రెస్‌ ఏపీలో ఆయన గెలుపు కోసం కృషి చేశాయి అంటే అతిశయోక్తి కాదు.

ఉద్యమ సమయంలో రెండు కండ్ల సిద్ధాంతం చెప్పాడు. ఆయన చెప్పిన రెండు ప్రాంతాలు రెండు కండ్లలో తెలంగాణ లేదు. అందుకే ఇక్కడి ప్రజలు బాబు మాటలను విశ్వసించలేదు. బీఆర్ఎస్‌ పదేళ్లు అధికారంలో ఉన్నంత కాలంలో మొదటి ఐదేళ్లు బాబు ఏపీ సీఎంగా ఉన్నారు. అక్కడి ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి సారించకుండా ఇక్కడి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. దాని ఫలితమే ఓటుకు నోటు, హైదరాబాద్‌లో సెక్షన్‌ 8 వంటి అంశాలు. ఇక ఆయనను జైలులో పెట్టింది అక్కడి వైసీపీ ప్రభుత్వం. దానికి తెలంగాణకు సంబంధం లేదు. కానీ ఇక్కడ కూడా శాంతిభద్రతల సమస్య సృష్టించే ప్రయత్నం చేశారు. శాంతియుత నిరసనలకు నాటి ప్రభుత్వం అడ్డు చెప్పలేదు. కానీ ఆయన అరెస్టును సాకుగా చూపి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తామంటే ఊరుకోమని స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు నాటి ఆందోళలను చూసి బాబు గారు టీవీలో గర్వపడ్డారట. అంటే సమస్య ఏపీలో ఉంటే నిరసనలు ఇక్కడ చేయడం దేనికి సంకేతం.

ఇక పార్టీని నాయకులు వదిలి వెళ్లినా కార్యకర్తలు పార్టీని వీడలేదట. తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ జెండా రెపరెపలాడుతుంది అన్నారు. ఆయన వ్యాఖ్యలు చూశాక విభజన సమస్యల పరిష్కారం కంటే పార్టీ విస్తరణే ఎక్కవ అని తెలుస్తోంది. ఈ సమావేశంలోనే ఏపీ సీఎం మాట్లాడుతూ.. ఇచ్చిపుచ్చుకునే ధోరణతో నే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. హైకోర్టు విభజన సమయంలో, కృష్ణా జలాల విషయంలో, ఇప్పుడు విభజన చట్టంలోని 9,10 వ షెడ్యూల్‌లోని సంస్థల ఆస్తుల విషయంలో మీ వైఖరి వల్లనే కదా పరిస్థితి ఇక్కడి దాకా వచ్చింది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎంత చొరవ చూపినా కావాలని ప్రతీ దాంట్లో కాళ్లల్లో కట్టె పెట్టేలా చేసిన మీ నిర్వాకం వల్లనే విభజన సమస్యలు చాలా వరకు పెండింగ్‌లో పడ్డాయి. ఏపీకి ప్రత్యేక హోదా కోసం నాడు పార్లమెంటులో బీఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేస్తే తెలంగాణకు ఒక్క జాతీయ ప్రాజెక్టు అయినా ఇవ్వాలని ఎన్నడైనా మీరు అడిగారా?

విభజన జరిగిన పదేళ్లు అవుతున్నది. నాటి ఆంధ్ర రాష్ట్రం మద్రాస్‌ నుంచి విడిపోయింది. ఒప్పందాలపై ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ దాన్ని వాటిని ఉల్లంఘించడం వల్ల ఉద్యమం వచ్చింది. ఇక్కడి ప్రజలు ఒక్కతాటిపైకి వచ్చి స్వరాష్ట్రాన్నిసాధించుకున్నారు.మీరు చెబుతున్న తెలుగు జాతి అంటే ఏపీ, తెలంగాణలే కాదు దేశంలోని చాలా రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడేవారు ఉన్నారు. కానీ మీరు ఈ రెండు రాష్ట్రాలనే నాకు రెండు కళ్లు అనే వ్యాఖ్యల వెనుక రాజకీయ ప్రయోజనాలే ఉన్నాయి తప్పా రెండు రాష్ట్రాల ప్రయోజనాలు ముఖ్యంగా తెలంగాణ ప్రయోజనాల కోసం మీరు పనిచేస్తారని ఎవరూ భావించడం లేదు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో ఏపీ సీఎం వ్యాఖ్యలు ఒక విషయాన్ని స్పష్టం చేశాయి. రానున్న రోజుల్లో ఆయన టీడీపీని విస్తరించానికి ఒక రోడ్‌ మ్యాప్‌ సిద్ధం చేసుకున్నారు. నిన్నమీటింగ్‌ అనేది అధికారిక కార్యక్రమం, పార్టీ విస్తరణ అన్నది అనధికారిక కార్యాచరణ అన్నది తెలంగాణ ప్రజానీకానికి అర్థమైంది.

Raju

Raju

Writer
    Next Story