నీట్‌ పరీక్షను వెంటనే రద్దు చేయాలి: రాహుల్‌గాంధీ

రష్యా, ఉక్రెయిన్ యుద్దాన్ని ఆపానని చెప్పుకుంటున్న ప్రధాని మోదీ పరీక్షా పేపర్ లీక్స్‌ను ఆపలేకపోతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు

Rahul gandhi
X

నీట్‌ పరీక్షను వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీకి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. లీకేజీపై విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. వారి భవిష్యత్తు గందరగోళంగా తయారైంది. పరీక్షల నిర్వహణలో వ్యవస్థాపరమైన లోపాలు కనిపిస్తున్నాయి. చేయని తప్పులకు విద్యార్థులను శిక్షించినట్లుగా ఉన్నది. దేశంలో స్వతంత్ర విద్యా వ్యవస్థ అనేది లేకుండా పోయింది. ఒక్కో పరీక్షకు ఒక్కో నిబంధన సమంజసం కాదని రాహుల్‌ అభిప్రాయపడ్డారు. మరోవైపు నీట్ విద్యార్థులతో రాహుల్‌గాంధీ భేటీ అయ్యారు.

పరీక్షల్లో జరిగిన అవకతవకలపై వివరించేందుకు సోనియా నివాసానికి విద్యార్థులు వెళ్లారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర సమయంలో, వేలాది మంది పేపర్ లీక్‌ల గురించి ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. ‘రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధాలను ప్రధాని ఫోన్ చేసి ఆపినట్లు వార్తలు వచ్చాయి. కానీ దేశంలో మాత్రం పేపర్ లీక్ లను ఆపలేకపోతున్నారు’ అని వ్యాఖ్యానించారు. యూనివర్సిటీల వైస్ చాన్స్‌లర్లను కూడా మోడీ మెరిట్ ఆధారంగా నియమించలేకపోయారని ఆరోపించారు. విద్యావ్యవస్థను మొత్తం బీజేపీ నాశనం చేసిందన్నారు. పరీక్షల లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Vamshi

Vamshi

Writer
    Next Story