రిమాండ్‌ ఖైదీగా 165 రోజులు

లిక్కర్‌ స్కాంలో ఆరోపణలే తప్ప ఆధారాలు చూపలేకపోయిన ఈడీ, సీబీఐ

రిమాండ్‌ ఖైదీగా 165 రోజులు
X

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఎమ్మెల్సీ కవిత రిమాండ్‌ ఖైదీగా 165 రోజులు తిహార్‌ జైళ్లో ఉన్న ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. మంగళవారం సాయంత్రమే ఆమె తీరార్‌ జైల్‌ నుంచి విడుదలచయ్యే అవకాశాలున్నాయి. ఈ కేసులో మార్చి 15న ఈడీ కవితను అరెస్టు చేసింది. ఏప్రిల్‌ 11న తీహార్‌ జైళ్లో సీబీఐ అదుపులోకి తీసుకున్నది. 2022లో ఢిల్లీ లిక్కర్‌ పాలసీలో అవకతవకలు ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి. అదే ఏడాది లిక్కర్‌ స్కాంలో ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్‌ లోని ఆమె నివాసంలో సీబీఐ సాక్షిగా ప్రశ్నించింది. ఆ తర్వాత ఢిల్లీలో పలుమార్లు ఈడీ అధికారులు కవితను విచారించారు. 2023లోనే ఆమెను ఈడీ అరెస్టు చేయవచ్చనే ప్రచారం జరిగింది. పార్లమెంట్‌ ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే సమయంలో ఈడీ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్‌ చేసింది. కవిత అరెస్టుకు ముందు, తర్వాత వందలాది మంది సాక్షులకు విచారించిన ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ కవితకు వ్యతిరేకంగా ఒక్కటంటే ఒక్క సాక్ష్యం చూపించలేకపోయింది. సౌత్‌ గ్రూప్‌ నుంచి ఆమ్‌ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్ల ముడుపులు చేరినట్టుగా ఆరోపణలు చేసినా, పలువురు బ్యాంక్‌ ఎకౌంట్లను ఫ్రీజ్‌ చేసినా అందులో కొంత మొత్తమైనా రికవరీ చేయలేకపోయింది. విచారణ ఖైదీగా ఎమ్మెల్సీ కవిత నెలల తరబడి జైళ్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ కేసులో ఢిల్లీ సీఎం, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అర్వింద్‌ కేజ్రీవాల్‌ ఇప్పటికీ జైళ్లోనే ఉన్నారు. ఆయనకు ఈడీ కేసులో బెయిల్‌ దక్కినా సీబీఐ కేసులో బెయిల్‌ రావాల్సి ఉంది. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ రూపకల్పనలో కీలకంగా చెప్తోన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, మాజీ ఎక్సైజ్‌ మినిస్టర్‌ మనీశ్‌ సిసోడియా కొన్నాళ్ల క్రితమే బెయిల్‌ పై విడుదలయ్యారు.

2022 డిసెంబర్‌ 11న ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో సీబీఐ హైదరాబాద్‌ లోని ఆమె నివాసంలో విచిరించింది. ఏడు గంటల పాటు కవితను విచారించి సీఆర్పీసీ 160 కింద ఆమె వాంగ్మూలం నమోదు చేసి చేసింది. ఇదే కేసులో విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు ఇవ్వడంతో 2023 మార్చి 11న ఢిల్లీలోని ఈడీ ఆఫీసులో విచారణకు హాజరయ్యారు. అదే నెల 16, 20, 21 తేదీల్లో మళ్లీ విచారణకు హాజరయ్యారు. కవిత తన ఫోన్లను ధ్వంసం చేశారని ఈడీ ఆరోపించడంతో ఆమె తాను గతంలో ఉపయోగించిన ఎనిమిది ఆపిల్‌ ఫోన్లను ఈడీ అధికారులకు అప్పగించారు. లిక్కర్‌ స్కాం చార్జ్‌ షీట్‌ లో మొదటిసారిగా కవిత పేరు ప్రస్తావన. ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌ (పీఎంఎల్‌ఏ) 50 కింద కవిత స్టేట్‌ మెంట్‌ రికార్డ్‌ చేసిన ఈడీ.. ఈ ఏడాది జనవరి ఐదో తేదీన విచారణకు హాజరుకావాలని కవితకు ఈడీ నోటీసులు.. మహిళను విచారణకు వ్యతిరేకంగా హాజరుకావాలని కోరడంపై కవిత సుప్రీం కోర్టులో సవాల్‌ చేశారు. ఇదే కేసులో కవితకు ఫిబ్రవరి 21న నోటీసులు ఇచ్చి అదే నెల 21న విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని కోరిన సీబీఐ. ఆ తర్వాత కవితకు 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చిన సీబీఐ మొదటిసారిగా ఆమెను ఈ కేసులో నిందితురాలిగా చేర్చారు. మహిళల వ్యక్తిగత హాజరుపై తాను సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ పెండింగ్‌ లో ఉందని, ఈ పరిస్థితుల్లో విచారణకు రాలేనని కవిత సీబీఐకి బదులిచ్చారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఈడీ, సీబీఐ మొదట నిందితులుగా పేర్కొన్న మాగుంట రాఘవ, దినేశ్‌ అరోరా, ఆడిటర్‌ గోరంట్ల బుచ్చిబాబు, అరుణ్‌ రామచంద్ర పిళ్లై అప్రూవర్లుగా మారారు. ఈ కేసులో అరెస్ట్‌ తర్వాత ట్రయల్‌ కోర్టు నుంచి ఢిల్లీ హైకోర్టు వరకు బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేసినా కవితకు ఉపశమనం దక్కలేదు. మంగళవారం సుప్రీం కోర్టు ఈడీ, సీబీఐ కేసుల్లో ఆమెకు బెయిల్‌ మంజూరు చేశారు.

బెయిల్ మంజూరు చేసే క్రమంలో ఈడీపై సుప్రీం కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కవితకు వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారని, ఒక మహిళగా కాదు సాధారణ నిందితురాలిగానూ ఆమెను జైళ్లో ఉంచడం భావ్యం కాదని సుప్రీం కోర్టు అభిప్రాయ పడింది. ఈ కేసులో ఆమెకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేస్తున్నామని ప్రకటించింది. బెయిల్‌ ప్రొసీడింగ్స్‌ అన్ని సాయంత్రంలోగా పూర్తి చేసి.. మంగళవారం సాయంత్రమే ఆమె తిహార్‌ జైలు నుంచి విడులయ్యేలా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌ రావు, ఇతర నాయకులు ఢిల్లీలో ప్రయత్నాలు మొదలు పెట్టారు. లిక్కర్‌ స్కాంలో అరెస్టు తర్వాత కవిత ఆరోగ్యం దెబ్బతిన్నది. ఆమె ఈ మధ్య కాలంలో తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారు. ఎయిమ్స్‌ లో వైద్య పరీక్షలు నిర్వహించాలని కోరుతూ కూడా ఆమె న్యాయపోరాటం చేయాల్సి వచ్చింది. లిక్కర్‌ కేసులో ఇప్పటికే ఈడీ, సీబీఐ చార్జ్‌ షీట్లు దాఖలు చేశాయి.. కవిత సాక్ష్యులను బెదిరిస్తారు అన్న ఈడీ వాదనలను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సుప్రీం కోర్టు తీర్పుపై కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. న్యాయం గెలిచిందని 'ఎక్స్‌' వేదికగా పేర్కొన్నారు.

Next Story