మంత్రుల గోదావ'రింద్రజాలం!?'

'సీతారామ'కు ఖర్చు పెట్టింది రూ.500 కోట్లు.. డప్పు కొట్టుకుంటున్నది భూమ్యాకాశాలు ఏకమయ్యేంత

మంత్రుల గోదావరింద్రజాలం!?
X

మాయామశ్చింద్రులు ఇంకెక్కడో లేరు.. మన కళ్ల ముందే నిత్యం కదలాడుతున్నరు. ఎనిమిది నెలలుగా హ్రీం భీం బిష్‌.. అంటూ తాము చెప్పిందే నిజమని గట్టిగా వాదిస్తున్నారు. తమ మాటలను ఎవరూ నమ్మడం లేదనో.. ఇంకేమైనా కారణాలున్నయో గానీ చెప్పిన ముచ్చట్లనే అటు తిప్పి ఇటు తిప్పి తమ వాగ్దాటితో ప్రజల్లో ఆ మాటలను ఇంజెక్ట్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్లు ఇంకెవరో కాదు మన ఏలికలు.. అర్థం కాలేదా? తెలంగాణ పాలకులు. ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ పై కాంగ్రెస్‌ ప్రభుత్వం గద్దెనెక్కిన నాటి నుంచి చేస్తున్న ప్రచారం గురించి ఎంత చెప్పినా తక్కువే. గద్దెనెక్కిన వెంటనే వైట్‌ పేపర్‌ పేరుతో ఒక విన్యాసానికి తెరతీసి బొక్కాబోర్లా పడ్డారు. ఏవేవో పేపర్లు చూపించి తాము చెప్పేది నిజమని నమ్మించడానికి గట్టి ప్రయత్నాలే చేసినా ఆ ఫలవంతం కాలేదు. ఒకసారి రూ.2 లక్షల కోట్లు గంగ పాలు చేసిండు అంటరు.. ఇంకోసారి ఇరిగేషన్‌ను సర్వనాశనం చేసిండు కేసీఆర్‌ అని తిట్టిపోస్తరు.. సీతారామ అనేది వట్టి వేస్ట్‌ ప్రాజెక్టు అంటరు. ఇప్పుడు అదే ప్రాజెక్టును ట్రయల్‌ రన్‌ చేసి అదంతా తమ గొప్పేనని చెప్పుకోవడానికి తంటాలు పడుతున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు.. అందరిదీ ఇదే వరుస. ఇవే ముచ్చట్లు. సీతారామ ఎత్తిపోతలకు ఎనిమిది నెలల్లో రూ.500 కోట్లు ఖర్చు చేశారట.. అంతే ఫినిష్‌.. ప్రాజెక్టు పూర్తయింది.. ట్రయల్‌ రన్‌ సక్సెస్‌ అయ్యింది.. ముఖ్యమంత్రి ఆ ప్రాజెక్టును పంద్రాగస్టుకు ప్రారంభించి తెలంగాణ జాతిని, ఖమ్మం జిల్లా ప్రజలనుద్దేశించి ప్రసంగించబోతున్నరు. ఆ ప్రసంగంలోనూ ఎనిమిది నెలల నుంచి మాటలన్నీ డిటోగా దిగిపోవడం ఖాయం.

రాజీవ్‌ సాగర్‌, ఇందిరాసాగర్‌ ను కేసీఆర్‌ ప్రభుత్వం రీ డిజైన్‌ చేయడంతో నిర్మాణ వ్యయం రూ.18 వేల కోట్లకు పెరిగిందని అంటరు.. అసలు ఆ రీడిజైనింగే తప్పని చెప్తరు.. ఇప్పుడు అదే డిజైన్‌ లో నిర్మించిన ప్రాజెక్టు పంపుహౌస్‌ ల నుంచి నీళ్లు ఎత్తిపోసి అదంతా తమ క్రెడిట్‌ అని చెప్పుకుంటారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దిగిపోయే నాటికి సీతారామ ఎత్తిపోతలపై చేసిన ఖర్చు రూ.7,436 కోట్లు.. అదంతా వృథా ఖర్చు అని నెత్తినోరు బాదుకుంటారు.. తమ ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలల్లోనే ప్రాజెక్టును పూర్తి చేశామంటారు.. అంటే గతంలో ఖర్చు చేసిన రూ.7,436 కోట్ల పనులతో సంబంధం లేకుండా రూ.500 కోట్లతోనే సీతారామ ఎత్తిపోతల్లోని 3 పంపుహౌస్‌ లు, వాటిని లింక్‌ చేసే కాల్వలు, ప్రెజర్‌ మెయిన్స్‌, ఇతర నిర్మాణాలు పూర్తయ్యాయని అనుకోవాలా? ఆయా పంపుహౌస్‌ లకు స్విచ్‌ యార్డులు (సబ్‌ స్టేషన్లు), ట్రాన్స్‌ మిషన్‌ లైన్లు, మరికొన్ని లింక్‌ పనులను కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేశారు. అంటే సీతారామ ఎత్తిపోతలపై ఇప్పటి వరకు చేసిన మొత్తం వ్యయం రూ.8 వేల కోట్లలోపే. అంటే మొత్తం ప్రాజెక్టు కాస్ట్‌ లో ఖర్చు చేసిన మొత్తం 45 శాతం లోపే. అలాంటప్పుడు ప్రాజెక్టు గతంలో పెండింగ్‌ లో ఉంది.. ఇప్పుడు పూర్తి చేశామని జబ్బలు చరుచుకోవడం ఎలా సమంజసం.

సీతారామ ఎత్తిపోతలతో నాగార్జున సాగర్‌ ఎడమ కాలువ ఆయకట్టును లింక్‌ చేసే ప్రపోజల్‌ కూడా తమ డిస్కవరీ అన్నట్టుగా ప్రభుత్వం, మంత్రులు గొప్పలకు పోయారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే ఆ ఎలైన్‌మెంట్‌ ఫైనల్‌ చేస్తే దానిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి డిప్యూటీ సీఎం కాకుండా ఇంకో ఇద్దరు మంత్రులు ఉన్నారు. ప్రభుత్వంలో వాళ్లకు ప్రాధాన్యత ఉంది కాబట్టి కోరుకున్న మేరకు కొన్ని మార్పులు చేశారు. రైతులకు మంచి చేసేలా ఏ మార్పు చేసినా ప్రతి ఒక్కరూ స్వాగతించాల్సిందే. ఓవరాల్‌ గా ప్రాజెక్టు రైతులకు ఉపయోగపడుతుందా లేదా చూడాలే తప్ప.. అది వృథా.. రూ.2 లక్షల కోట్లు గంగపాలు చేసిండ్రు.. సర్వనాశనం చేసిండ్రు అనే మాటలతో ప్రజలకు ఒనగూరేది ఏమి ఉండదు. సీతారామ ఎత్తిపోతల విషయంలో రేవంత్‌ సర్కారు ఆలస్యంగానైనా రియలైజేషన్‌ లోకి వచ్చింది. కాళేశ్వరం విషయంలో ఎన్ని విన్యాసాలు చేసినా ఆ ప్రాజెక్టు తెలంగాణకు లైఫ్‌ లైన్‌ అనే విషయాన్ని కూడా గుర్తించింది. ఇప్పుడు కాళేశ్వరం ను ఎలా సద్వినియోగం చేసుకోవాలనే దానిపైనే సర్కారు దృష్టి సారించింది. మల్లన్నసాగర్‌ నుంచి హైదరాబాద్‌ తాగునీటికి, మూసీ బ్యూటిఫికేషన్‌ కు 15 టీఎంసీలను తరలించే ప్రాజెక్టు అందులో భాగమే. వచ్చే యాసంగి సీజన్‌ లోనే మేడిగడ్డ బ్యారేజీ ఎగువన ఉన్న కన్నెపల్లి పంపులు నడిపించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. యాసంగి సీజన్‌ లో అన్ని ప్రాజెక్టుల ఆయకట్టు పంటలు చేతికి రావాలంటే కాళేశ్వరం ఎత్తిపోతలు తప్పనిసరి అని గద్దెనెక్కిన కొన్ని నెలలకే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తెలిసి వచ్చింది. ఇన్నాళ్లు ఇరిగేషన్‌ ప్రాజెక్టుల గురించి.. వాటిపై చేసిన వ్యయం గురించి నోటికి వచ్చినట్టుగా మాట్లాడినోళ్లు ఇప్పుడు అవే ప్రాజెక్టులను తమ నోళ్లతోనే కీర్తించాల్సి రావడం ఆ ప్రాజెక్టుల గొప్పతనమే.


సీతారామకు మంత్రుల కొత్త భాష్యం లింక్‌ చదివేందుకు ఈ లింక్‌ క్లిక్‌ చేయండి


మంత్రులూ.. ఈ నీళ్లల్లో కేసీఆర్‌ కనిపిస్తున్నడు స్టోరీ చదివేందుకు ఈ లింక్‌ క్లిక్‌ చేయండి

Next Story