మంత్రులూ.. ఈ నీళ్లల్లో కేసీఆర్‌ కనిపిస్తున్నడు!

సీతారామతో రూ.20 వేల కోట్లు వృథా అని డిప్యూటీ సీఎం, మంత్రుల ప్రకటనలు.. మోటార్‌ స్విచ్‌ ఆన్‌ చేసిన ఇంకో మంత్రి

మంత్రులూ.. ఈ నీళ్లల్లో కేసీఆర్‌ కనిపిస్తున్నడు!
X

''సీతారామ లిఫ్ట్‌ స్కీంతో కేసీఆర్‌ రూ.20 వేల కోట్లు వృథా చేసిండు'' అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అంటే.. ''కేసీఆర్‌ ఇరిగేషన్‌ పేరుతో రూ.2 లక్షల కోట్లు గంగపాలు చేసిండని '' మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నరు. ఈ వ్యాఖ్యలు కొన్ని రోజుల క్రితమే, కాళేశ్వరం, సీతారామ లిఫ్ట్‌ స్కీం పనుల పరిశీలన సందర్భంగా మంత్రులు చేసినవి. జూన్ 8న కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల సందర్శన సమయంలో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఇరిగేషన్‌ శాఖపై చేసిన ఖర్చంతా గంగా పాలేనని కామెంట్‌ చేశారు. ఇదే నెల 13న సీతారామ ఎత్తిపోతల పనులను డిప్యూటీ సీఎం భట్టితో కలిసి మంత్రి ఉత్తమ్‌ పరిశీలించారు. వారం రోజుల వ్యవధిలో డిప్యూటీ సీఎం, ఇరిగేషన్‌ శాఖల మంత్రులు కేసీఆర్‌ ప్రభుత్వంలో ఇరిగేషన్‌ శాఖపై చేసిన ఖర్చంతా వృథా అని మాట్లాడారు. రూ.8 వేల కోట్లు ఖర్చు చేసిన సీతారామ ఎత్తిపోతల్లో రూ.20 వేల కోట్లు ఎలా వృథా అయ్యాయో డిప్యూటీ సీఎం, ఇరిగేషన్‌ శాఖ మంత్రినే చెప్పాలి. ''సీతారామ'' మంత్రి ఉత్తమ్‌ కొత్త భాష్యం'' శీర్షికన ప్రాజెక్టు నిర్మాణ వ్యయం ఎందుకు పెరిగిందనే వివరాలతో ఈనెల 14న ప్రచురించిన కథనంలోనే చెప్పుకున్నాం.. గురువారం తెల్లవారుజామున ఉమ్మడి ఖమ్మం జిల్లాకే చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు అశ్వాపురం మండలం జీజీ కొత్తూర్‌ దగ్గర ఉన్న ఫస్ట్‌ పంప్‌ హౌస్‌లో ఒక మోటార్‌ స్విచ్‌ ఆన్‌ చేసి ట్రయల్‌ రన్‌ చేశారు. పంపుల నుంచి ఎగసి వస్తున్న గోదావరి జలాలకు రెండు చేతులా నమస్కారం చేశారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టుల కోసం చేసిన ఖర్చంతా వృథా అన్న మంత్రులూ.. సీతారామ ఎత్తిపోతల నుంచి పైకెగసి వస్తున్న గోదారి గంగమ్మలో కేసీఆర్‌ కనిపిస్తున్నడు.. బీడు బడ్డ, నెర్రెలు బారిన నేలలను తడిపి బంగారు పంటలు పండించబోయే దృథ్యాలు అగుపిస్తున్నయ్‌.





సీతారామ కోసం ఖర్చు చేసిన డబ్బంతా వృథా అన్న రెండు వారాల్లోపే ఆ ప్రాజెక్టు పంపుహౌస్‌లో ఒక మోటారు ట్రయల్‌ రన్‌ చేశారు. కాళేశ్వరం పేరుతో కేసీఆర్‌ రాష్ట్రంపై లక్ష కోట్ల అప్పుల భారం మోపిండన్న కొన్ని రోజులకే దానిని సద్వినియోగం చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఏ మేడిగడ్డను మొండిగోడలుగా చూపించి కాళేశ్వరం ఒక విఫల ప్రయోగం చెప్పాలని అనుకున్నరో.. ఆ మేడిగడ్డ టెంపరరీ రిపేర్లను పరుగు పరుగున చేస్తున్నరు. ఇరిగేషన్‌ ప్రాజెక్టుల కోసం చేసిన వ్యయం అప్పటికప్పుడే ఫలితాలు ఇవ్వదు. కాళేశ్వరం ఫలాలు క్రమేణ అందుతున్నయ్‌.. ఐదారు వేల కోట్లు ఖర్చు చేస్తే కనీసం 8 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లివ్వొచ్చు.. ఇరిగేషన్‌లో ఏ ఇంజనీర్‌ ను అడిగినా ఈ ముచ్చట చెప్తరు. రూ.70 వేల కోట్లతో చేపట్టబోయే మూసీ బ్యూటిఫికేషన్‌ ప్రాజెక్టు ఫలితాన్నివ్వాలన్న కాళేశ్వరం గంగ పారితేనే అది సాకారమవుతుంది. వాన నీళ్లకే కేసీఆర్‌ కాళేశ్వరం కలర్‌ వేస్తున్నడు.. ఉట్టుట్టి ప్రచారం చేసుకొని రాజకీయ లబ్ధి పొందుతున్నడు అని చెప్పి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం బొక్కా బోర్లా పడటమే కాదు.. లక్షలాది ఎకరాల్లో పంటలను ఎండగొట్టింది. కాళేశ్వరంతో సంబంధం లేకుండా నీళ్లిస్తామని చెప్పి ఎస్సారెస్పీని, మిడ్‌ మానేరును, లోయర్‌ మానేరును, రైతుల పొలాలను ఎండబెట్టింది. ఇప్పుడు నీళ్లివ్వండి మహాప్రభో అని ప్రజలు నీళ్ల కోసం అల్లాడే పరిస్థితిని తెచ్చింది. మంత్రులూ.. కాళేశ్వర గంగమ్మలో.. పాలమూరు నుంచి ఎగసి వస్తున్న కృష్ణమ్మలో సీతారామ జల సవ్వడుల్లో కేసీఆర్‌ అగుపిస్తున్నడు.

''సీతారామకు మంత్రి ఉత్తమ్‌ కొత్త భాష్యం'' కథనం చదివేందుకు క్లిక్‌ చేయండి

Next Story