పీసీసీ చీఫ్‌ గా మహేశ్‌ కుమార్‌ గౌడ్‌

రేవంత్‌ రెడ్డి సిఫార్సుతోనే నియామకం.. ఉత్తర్వులు జారీ చేసిన ఏఐసీసీ

పీసీసీ చీఫ్‌ గా మహేశ్‌ కుమార్‌ గౌడ్‌
X

తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ నియమితులయ్యారు. ఆయనను నియమిస్తూ ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే నిర్ణయం తీసుకున్నారని ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రేవంత్‌ రెడ్డి స్థానంలో మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ను కొత్త పీసీసీ అధ్యక్షుడిగా నియమించారు. తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీకి పొన్నాల లక్ష్మయ్య తర్వాత మహేశ్‌ కుమార్‌ రెండో బీసీ అధ్యక్షుడు. పొన్నాల స్థానంలో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి పీసీసీ చీఫ్‌ గా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత రేవంత్‌ రెడ్డికి పగ్గాలు అప్పగించారు. ఇప్పుడు మహేశ్‌ కుమార్‌ ను నియమించారు. మొత్తంగా తెలంగాణకు నాలుగో పీసీసీ చీఫ్‌ గా మహేశ్‌ కుమార్‌ నియామకం అయ్యారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ సీఎం రేవంత్‌ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. రేవంత్‌ సిఫార్సుతోనే ఆయనకు ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ పగ్గాలు అప్పగించారు.



కాంగ్రెస్‌ పార్టీలో, ప్రభుత్వంలో రేవంత్‌ రెడ్డి వన్‌ మ్యాన్‌ షో సాగుతోందని.. పీసీసీ చీఫ్‌ గా ఆయన సన్నిహితులకు కాకుండా పార్టీకి లాయల్‌ గా ఉన్న సీనియర్‌ నాయకులకు అవకాశం ఇవ్వాలని పలువురు మంత్రులు కాంగ్రెస్‌ పెద్దలను కోరారు. గతంలోనే మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ కు పగ్గాలు అప్పగించారని, కొన్ని గంటల్లోనే ప్రకటన వెలువడబోతుందని ప్రచారం జరిగింది. సీనియర్‌ లీడర్ల జోక్యంతో ప్రకటనను వాయిదా వేశారు. మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌, ఎంపీ బలరాం నాయక్‌, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ లలో ఒకరికి పీసీసీ పగ్గాలు దక్కుతాయన్న ప్రచారం జరిగింది. రేవంత్‌ రెడ్డి మీడియా చిట్‌ చాట్‌లలో పీసీసీ చీఫ్‌ పదవి ఎవరికి ఇచ్చినా ఓకే అని చెప్పినా.. తన సన్నిహితుడికే పదవి ఇవ్వాలని పార్టీ పెద్దల దగ్గర పట్టుబట్టారని తెలుస్తోంది. పార్టీలో తన మాట చెల్లుబాటు అయ్యేలా సహకరించాలని, అప్పుడే తాను ఏఐసీసీకి ఏమైనా చేయగలనని.. పార్టీలో రెండో పవర్‌ సెంటర్‌ ఉంటే అనేక అవాంతరాలు తప్పవని కాంగ్రెస్‌ పెద్దలను రేవంత్‌ కన్వీన్స్‌ చేశారని సమాచారం. ఒకానొక దశలో మధుయాష్కీకి పీసీసీ చీఫ్‌ పగ్గాలు అప్పగించారని కూడా ప్రచారం జరిగింది. చివరికి రేవంత్‌ మాటే చెల్లుబాటు అయి మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ నియామకానికే పార్టీ హైకమాండ్‌ మొగ్గు చూపింది.





Next Story