ఎల్‌ఆర్‌ఎస్‌ ఆమ్దానీ టార్గెట్‌ రూ.75 వేల కోట్లు

అప్పుడు వద్దన్న స్కీమే ఇప్పుడు బంగారు బాతుగుడ్డు.. ఫీజులు వసూలు చేయొద్దని కోర్టుకు వెళ్లిన కోమటిరెడ్డి

ఎల్‌ఆర్‌ఎస్‌ ఆమ్దానీ టార్గెట్‌ రూ.75 వేల కోట్లు
X

లే ఔట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్‌) పేరుతో రూ.75 వేల కోట్ల ఆదాయం రాబట్టుకోవాలని రేవంత్‌ రెడ్డి సర్కారు ప్లాన్‌ చేసింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయకుండా ఫ్రీగా ఎల్‌ఆర్‌ఎస్‌ చేయాలని డిమాండ్‌ చేసిన కాంగ్రెస్‌.. ఇప్పుడు అదే స్కీంను బంగారు బాతుగుడ్డుగా మార్చుకోవాలని చూస్తోంది. ఎల్‌ఆర్‌ఎస్‌ పోవాలంటే బీఆర్‌ఎస్‌ గద్దె దిగాలి.. 'నో ఎల్‌ఆర్‌ఎస్‌ - నో బీఆర్‌ఎస్‌' అనే నినాదంతో ప్రజలను రెచ్చగొట్టిన కాంగ్రెస్‌ పార్టీ గద్దెనెక్కిన తర్వాత ఇప్పుడు అదే ప్రజల రెక్కల కష్టాన్ని అడ్డంగా దోచుకోవడానికి ప్లాన్‌ చేసింది. ప్రజలు తెలిసో తెలియకో కొన్న అన్‌ అప్రూవుడ్‌ లే ఔట్లలోని ఫ్లాట్లను ఉచితంగా రెగ్యులరైజ్‌ చేయాలని కాంగ్రెస్‌ పార్టీ అప్పట్లో డిమాండ్‌ చేసింది. ప్రస్తుత మంత్రి, అప్పటి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఏకంగా హైకోర్టులో పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌ లిటిగేషన్ (పిల్‌) దాఖలు చేశారు. అప్పటి హైకోర్టు సీజే జస్టిస్‌ హిమా కోహ్లీ, న్యాయమూర్తి జస్టిస్‌ బి. విజయసేన్‌ రెడ్డితో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ ను విచారించి 2021 మార్చి 28న తీర్పు వెలువరించింది. ఎల్‌ఆర్‌ఎస్‌పై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు ప్రభుత్వాలు గతంలో జారీ చేసిన జీవోలను సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లు విచారణలో ఉన్నాయని, ఆయా పిటిషన్‌ లపై రాష్ట్ర ప్రభుత్వాలను కౌంటర్‌ ఫైల్‌ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించిందని.. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు తీర్పు కోసం వేచి చూస్తున్నందున ఎల్‌ఆర్‌ఎస్‌ పై దాఖలు చేసిన పిటిషన్‌ లపై విచారణ ముగిస్తున్నామని తీర్పులో వెల్లడించారు.



ఎలాంటి చార్జీలు లేకుండా ఎల్‌ఆర్‌ఎస్‌ అమలు చేయాలని కోరుతూ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లోని ఒక పేరా

2020 ఆగస్టు 31న అప్పటి కేసీఆర్‌ ప్రభుత్వం అనధికారిక లే ఔట్లలోని ఫ్లాట్ల రెగ్యులరైజేషన్‌ (ఎల్‌ఆర్‌ఎస్‌) కోసం జీవో నం.131ని జారీ చేసింది. అదే ఏడాది అక్టోబర్‌ 31వరకు ఒక్కో ఫ్లాట్‌ కు రూ. వెయ్యి చొప్పున ఫీజు చెల్లించి ఆన్‌ లైన్‌ లో ఎల్‌ఆర్‌ఎస్‌ కు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా అనధికారిక లే ఔట్ల రెగ్యులరైజేషన్‌ కోసం 25,59,562 అప్లికేషన్లు వచ్చాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,06,891, గ్రేటర్‌ వరంగల్‌ లో 1,01,033, ఖమ్మం కార్పొరేషన్‌ పరిధిలో 51,395 అప్లికేషన్లు, ఇతర మున్సిపాలిటీల పరిధిలో 10,60,013 అప్లికేషన్లు, గ్రామ పంచాయతీల పరిధిలో 10,83,394 అప్లికేషన్లు వచ్చాయి. ఎల్‌ఆర్‌ఎస్‌ అప్లికేషన్ల ఫీజుల రూపంలోనే అప్పట్లో ప్రభుత్వానికి రూ.255.95 కోట్ల ఆదాయం సమకూరింది. అప్పుడే ఆయా ఫ్లాట్లు, ఓపెన్‌ ల్యాండ్స్‌ రెగ్యులరైజేషన్‌ పూర్తి కావాల్సి ఉండగా పలువురు కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేయడంతో రెగ్యులరైజేషన్‌ ప్రక్రియ పెండింగ్‌ లో పడింది. న్యాయవివాదాలు కొలిక్కి రావడంతో ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. జూలై 30న మెమో నం.8,235ను జారీ చేసింది. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లోని అన్‌ అప్రూవుడ్‌, ఇల్లీగల్‌ లే ఔట్లలో ఫ్లాట్లు కొనుగోలు చేసి, 2020లో ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం చేసిన అప్లికేషన్లను ప్రాసెస్‌ చేయబోతున్నట్టు ఈ మెమో ద్వారా వెల్లడించింది. సెంటర ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (సీజీజీ) ద్వారా ప్రత్యేక అప్లికేషన్‌ తీసుకువచ్చి రెగ్యులరైజేషన్‌ ప్రాసెస్‌ చేయబోతున్నట్టు పేర్కొన్నది. మూడు దశల్లో అప్లికేషన్లను వడపోసి అర్హులైన దరఖాస్తుల దారుల ఫ్లాట్లను రెగ్యులరైజ్‌ చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వబోతుంది.

అమాయక ప్రజలు, ముఖ్యంగా మధ్య తరగతి వాళ్లు తమ కోసమో, తమ బిడ్డల భవిష్యత్‌ కోసమో అనధికార, అక్రమ లే ఔట్లలో డబ్బులు చెల్లించి ఫ్లాట్లు కొనుగోలు చేశారని, అలాంటి వారి నుంచి రెగ్యులరైజేషన్‌ చార్జీల పేరుతో డబ్బులు దండుకోవాలని చూడటం సరికాదని అప్పట్లో కాంగ్రెస్‌ నాయకులు వాదించారు. కోర్టులను ఆశ్రయించి ఉచితంగా ఎల్‌ఆర్‌ఎస్‌ అమలు చేయాలని న్యాయపోరాటం కూడా చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫీజుల్లేకుండానే ఎల్ఆర్‌ఎస్‌ అమలు చేయాలని ప్రజలను రెచ్చగొట్టిన కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఆశించిన దానికన్నా డబుల్‌ ఆదాయం రాబట్టుకోవాలని టార్గెట్‌ గా పెట్టుకుంది. ఆగస్టు ఒకటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రిజిస్ట్రేషన్‌ చార్జీలను అమల్లోకి తెచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఎల్‌ఆర్‌ఎస్‌ కు కొత్త చార్జీలనే అప్లికెబుల్‌ చేయాలని నిర్ణయించింది. దీనికితోడు మొత్తం భూమిలో 0.5 శాతం వెకెంట్‌ ల్యాండ్‌ చార్జీలతో పేరుతో అదనపు వసూళ్లకు ప్లాన్‌ చేస్తోంది. తద్వారా మొత్తంగా రూ.75 వేల కోట్లను ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీం పేరుతో ప్రజల నుంచి దండుకోవాలని టార్గెట్‌ గా పెట్టుకుంది. ఔటర్‌ రింగ్‌ రోడ్డు లోపల, జీహెచ్‌ఎంసీ అవతల ఒక వ్యక్తి ఒక ఫ్లాట్‌ కొనుగోలు చేసినప్పుడు చదరపు గజం మార్కెట్‌ మార్కెట్‌ వ్యాల్యూ రూ.7 వేలు ఉంటే గతంలోనే ప్రభుత్వం ఈ మొత్తాన్ని రూ.10 వేలకు పెంచింది. ఇప్పుడు కొత్తగా అమల్లోకి వచ్చిన చార్జీలతో ఈ మొత్తం రూ.15 వేలకు చేరింది. అంటే ఒక వ్యక్తి ఫ్లాట్‌ కొనుగోలు చేసిన నాటి నుంచి ఎల్‌ఆర్‌ఎస్‌ అమలు చేసే నాటికి అతడు కొన్న ఫ్లాట్‌ మార్కెట్‌ వ్యాల్యూ వంద రెట్లకు పైగా పెరిగింది. ఇప్పుడు కొనుగోలుదారుడు ఆ మొత్తం చెల్లిస్తే తప్ప ఆ స్థలంలో ఇంటి నిర్మాణానికి ఆయా స్థానిక సంస్థ (కార్పొరేషన్‌/మున్సిపాలిటీ/ గ్రామ పంచాయతీ) అనుమతి ఇవ్వదు. ప్రజల నుంచి ఎల్‌ఆర్‌ఎస్‌ చార్జీలు దండుకొని, తద్వారా భారీగా ఆమ్దానీ కూడబెట్టాలని రేవంత్‌ సర్కారు ప్లాన్‌ చేసింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నో ఎల్‌ఆర్‌ఎస్‌ - నో బీఆర్ఎస్‌ అన్న కాంగ్రెస్‌ పార్టీ గద్దెనెక్కిన తర్వాత ఎల్‌ఆర్‌ఎస్సే తమ లైఫ్‌ లైన్‌ అని స్పష్టం చేస్తోంది.


ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిశీలనకు ప్రభుత్వం జారీ చేసిన మెమో

https://www.teluguscribe.com/pdf_upload/hc-2064000006320162-1-821343.pdf

ప్రజల నుంచి చార్జీలు వసూలు చేయకుండా ఎల్‌ఆర్‌ఎస్‌ అమలు చేయాలని కోరుతూ ప్రస్తుత మంత్రి, అప్పటి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌

Next Story