రుణమాఫీ .. రైతుల్లో ఆందోళన

అస్పష్ట విధానాలు, అడ్డగోలు నిబంధనల మధ్య నేటి నుంచి రుణమాఫీ ప్రారంభకానున్నది.

రుణమాఫీ .. రైతుల్లో ఆందోళన
X

ఏకకాలంలో రెండు లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేస్తామన్న ప్రభుత్వం మాట మార్చింది. మూడు విడతల్లో రుణమాఫీ చేస్తామని తాజాగా ప్రకటించింది. రుణమాఫీ మార్గదర్శకాలపై ఇప్పటికీ గందరగోళం కొనసాగుతున్నది. రుణమాఫీ కోసం రేవంత్‌రెడ్డి తెల్ల రేషన్‌ కార్డే ప్రామాణికం అని చెప్పింది. విపక్షాల నుంచి రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. రుణమాఫీకి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎవరు అర్హులు అవుతారు. ఎవరు కారు అన్నదానిపై ఇప్పటికీ సష్టత లేదు.నెలకు రూ. లక్ష జీతం ఆదాయం ఉన్న సుమారు 17 వేల మందికి రుణమాఫీ ఉండదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో రైతుల పంట రుణమాఫీ నేటి నుంచి మొదలుకానున్నది. రూ. లక్ష వరకు రుణాలను మాఫీ చేయనున్నది. సాయంత్రం 4 గంటలకు సుమారు 11. 5 లక్షల మంది రైతుల ఖాతల్లో రూ. 7 వేల కోట్లు జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల వద్ద రైతులతో సంబురాలు చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఈ నెలాఖరు వరకు లక్షన్నర, ఆగస్టు 15 నాటికి రుణాలను రైతుల తరఫున ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించనున్నది. భూమి పాస్‌ బుక్‌ ఆధారంగానే రుణమాఫీ ఉంటుందని, కుటుంబాన్ని నిర్ధారించడానికే రేషన్‌కార్డును ప్రామాణికంగా తీసుకుంటామని సీఎం తెలిపారు. రుణ బకాయిలు ఉన్న సుమారు 6.36 రైతులకు రేషన్‌కార్డులు లేనట్లు ప్రభుత్వం గుర్తించింది. రేషన్‌కార్డు లేని వారికి కూడా రుణమాఫీ చేయనున్నట్టు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రుణమాఫీ చేయనుండంతో సీఎం రేవంత్‌ రెడ్డి రైతులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడనున్నారు.

జిల్లాల్లో రుణమాఫీ కార్యక్రమంలో మంత్రులు పాల్గొననున్నారు. రుణమాఫీ కోసం మొత్తం రూ. 31 వేల కోట్లు అవసరమని ప్రభుత్వం చెబుతున్నది. రూ. లక్ష వరకు రుణమాఫీ కోసం బాండ్ల విక్రయం ద్వారా రూ. 4 వేల కోట్లు, ఇతర మార్గాల ద్వారా రూ. 5 వేల కోట్లు ప్రభుత్వం సమీకరించింది. రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా, గందరగోళం తలెత్తకుండా బ్యాంకులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. దీనిలో భాగంగా ప్రతి బ్యాంకులో ఒక నోడల్‌ అధికారిని నియమించారు. రుణమాఫీ నిధులు ఇతర ఖాతాల్లో జమ అయితే కఠిన చర్యలు తప్పవని బ్యాంకర్లకు ప్రభుత్వం స్పష్టం చేసింది.

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇవ్వని నోటిఫికేషన్లకు ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా నియామకపత్రాలు అందించిన సీఎం ఇవాళ నేరుగా రైతులతో మాట్లాడకుండా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతారని ప్రభుత్వం చెప్పింది. అంటే కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో సంపూర్ణంగా ఏ ఒక్కటీ అమలు కాలేదు. రుణమాఫీ కూడా అంతే. అందుకే రైతుల వద్దకు వెళ్తే నిలదీస్తారని, రైతు భరోసా గురించి అడుగుతారని, ప్రభుత్వం పథకాల విషయంలో పెడుతున్న కండీషన్లపై కడిగిపారేస్తారనే ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడటానికి కారణమని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది.

Raju

Raju

Writer
    Next Story