హామీనే మాఫీ చేసేద్దాం!

రుణమాఫీకి కాంగ్రెస్‌ సర్కారు మార్క్‌ భాష్యం.. ఎన్నికల టైంలో చెప్పింది రూ.41 వేలకోట్లు.. చేసేది రూ.18,225 కోట్లే!

హామీనే మాఫీ చేసేద్దాం!
X

ప్రజలకిచ్చిన హామీనే మాఫీ చేసేస్తే పోలే..? అన్నట్టుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ''రూ.2 లక్షల వరకు క్రాప్‌ లోన్లు తీసుకున్న రైతుల లోన్లు రూ.41 వేల కోట్లు ఉన్నాయి.. డిసెంబర్‌ 9న తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రాబోతుంది.. తానే ఆ మొత్తం లోన్లు మాఫీ చేస్తా'' అని రేవంత్‌ రెడ్డి పీసీసీ అధ్యక్షుడి హోదాలో హామీ ఇచ్చారు. ''కేసీఆర్‌ రూ.లక్షలోపు లోన్లు మాఫీ చేసిండు.. ఇప్పుడు పోయి బ్యాంకుల నుంచి రూ.2 లక్షల వరకు లోన్లు తెచ్చుకోండి.. మాఫీ చేసే బాధ్యత నాదే..'' అని కూడా నమ్మకంగా చెప్పారు. డిసెంబర్‌ 9 కన్నా రెండు రోజుల ముందే రేవంత్‌ రెడ్డి సీఎం అయ్యారు. అప్పటికప్పుడు రుణమాఫీ సాధ్యం కాదు కాబట్టి కొంత వెసులుబాటు అయ్యాక మాఫీ చేస్తామని మాట ఇచ్చారు. అప్పటికీ సాధ్యం కాలేదని మరికొంత గడువు అడిగారు. ఆగస్టు 15 డెడ్‌లైన్‌ పెట్టుకొని రుణమాఫీ చేసే దిశగా ప్రయత్నాలు ఆరంభించారు. రైతులకు వానాకాలం పంట సీజన్‌ లో ఇవ్వాల్సిన రైతుబంధు (రైతుభరోసా)కు బ్రేకులు వేసి, కేంద్రం నుంచి అప్పులు తెచ్చి, ఇండస్ట్రీస్‌ కు కేటాయించాల్సిన భూములను కుదపెట్టి రుణమాఫీ ప్రక్రియను షురూ చేశారు. ఇప్పటికే రెండు విడతల్లో రూ.1.50 లక్షల వరకు లోన్లు ఉన్న17,75,235 మంది రైతులకు చెందిన రూ.12,224.98 కోట్లు మాఫీ చేశారు. మొదటి విడతలో రూ.లక్ష వరకు క్రాప్‌ లోన్లు ఉన్న రైతులు 11,34,412 మంది అని పేర్కొని వారు బ్యాంకులు, పీఏసీఎస్‌ల నుంచి తీసుకున్న రూ.6,034.96 కోట్లు మాఫీ చేశారు. రెండో విడతలో 6,40,823 మంది రైతులకు రూ.6,190.01 కోట్లు మాఫీ చేశారు. ఇప్పుడు ఆగస్టు 15న మరో 6 లక్షల మంది రైతులకు చెందిన రూ.6 వేల కోట్లు మాఫీ చేయబోతున్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం మూడు విడతల్లో కలిపి రుణవిముక్తులను చేసేది 23,75,235 మంది రైతులను మాత్రమే. వీరికి మాఫీ చేయబోయే మొత్తం రూ.18,224.98 కోట్లే. అంటే మూడు విడతల్లో కలిపి రుణమాఫీకి ఖర్చు చేయబోయేది ఎన్నికల హామీతో పోల్చితే 45 శాతమే. ఈ లెక్కన 55 శాతం రుణమాఫీ మొత్తాన్ని రేవంత్‌ సర్కారు రైతులకు ఎగవేయబోతోంది. ఎన్నికలకు ముందు లెక్కాపత్రం లేకుండా ఏదో చెప్పారే అనుకుందాం.. రుణమాఫీ చేసే క్రమంలో ప్రభుత్వం ప్రకటించింది రూ.31 వేల కోట్లు. రూ.2 లక్షల వరకు క్రాప్‌ లోన్లు తీసుకున్న రైతు రుణాలు మొత్తం రూ.31 వేల కోట్లు అని.. వాటిని మాఫీ చేసి రైతులను ఏకకాలంలో రుణవిముక్తులను చేస్తామని గొప్పగా చెప్పుకున్నారు. తీరా బడ్జెట్‌ కు వచ్చే సరికి రుణమాఫీకి రూ.25 వేల కోట్లు కేటాయించారు. ఇప్పుడు బడ్జెట్‌ కేటాయింపుల్లోనే రూ.6,500 కోట్లు మిగుల్చుకునేలా రుణమాఫీకి అనేక పరిమితులు పెట్టారు. రైతులను రుణవిముక్తులను చేస్తాం.. రుణమాఫీ పేటెంట్‌ కాంగ్రెస్‌ పార్టీదేనని గొప్పలు చెప్పడం తప్ప కొర్రీలు లేకుండా రుణమాఫీ అమలు చేయాలన్న సోయి ఈ ప్రభుత్వానికి లేదు. రుణమాఫీ చేసే రైతుల సంఖ్య చూసినా, మాఫీ చేయబోయే మొత్తం చూసిన ఈ విషయం రూడీ అవుతోంది.

తెలంగాణలో రైతుబంధు అందుకుంటున్న రైతుల సంఖ్య 69 లక్షలు.. వారిలో 55 లక్షల మంది రైతులు బ్యాంకులు, పీఏసీఎస్‌ (ప్రైమరీ అగ్రికల్చర్‌ కో ఆపరేటివ్‌ సొసైటీస్‌) నుంచి క్రాప్‌ లోన్లు తీసుకున్నారు. 2018 డిసెంబర్‌ నుంచి 2023 డిసెంబర్‌ మధ్య క్రాప్‌ లోన్లు తీసుకున్న అన్ని రైతు కుటుంబాలకు మాఫీ చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. రైతు కుటుంబాలను నిర్దారించడానికి రేషన్‌ కార్డు అనే నిబంధన తీసుకువచ్చింది. దీంతో లక్షలాది మంది యువ రైతులు మాఫీకి దూరమయ్యారు. కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్‌ నిబంధనలను రుణమాఫీకి వర్తింపజేసింది. దీనితో మరింత మంది లోన్లు మాఫీ కాకుండా పోయాయి. రాష్ట్రంలో పీఎం కిసాన్‌ అందుకుంటున్న రైతుల సంఖ్య 29.50 లక్షలు.. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం రుణమాఫీ చేయబోయేది 23.75 లక్షల మంది మాత్రమే. ఈ లెక్కన చూసుకున్న5.75 లక్షల మందికి మాఫీని ఎగవేస్తున్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం మొదటి విడతలో రూ.లక్షలోపు లోన్లు తీసుకున్న 35.31 లక్షల మందికి రూ.16,144.10 కోట్లు మాఫీ చేసింది. రెండో విడతలో రూ.99 వేలలోపు రుణాలు తీసుకున్న 22,98,039 మంది రైతులకు రూ.13,000.51 కోట్లు మాఫీ చేసింది. రూ.లక్ష వరకు ఉన్న రైతులకు చెందిన రూ.6,440 కోట్లు మాఫీ చేయాల్సి ఉండగానే ఎన్నికల కోడ్‌ వచ్చి ఆ ప్రక్రియకు బ్రేక్‌ పడింది. మొత్తంగా కేసీఆర్ ప్రభుత్వం రెండు విడతల్లో కలిపి 58.29 లక్షల మంది రైతులకు రూ.29,155.61 కోట్లు మాఫీ చేసింది.

కేసీఆర్‌ రైతులకు మాఫీ చేయాల్సిన రూ.6,440 కోట్లను ప్రస్తుత రుణమాఫీ మొత్తం నుంచి తీసేస్తే రేవంత్‌ రెడ్డి సర్కారు కొత్తగా మాఫీ చేసేది రూ.12 వేల కోట్లు మాత్రమే. అప్పుడు రూ.లక్ష వరకు రుణాలు ఉన్న రైతులను ఇటీవల రూ.1.50 లక్షల లోపు ఉన్న రైతులతో కలిపి మాఫీ చేశారు. కానీ అప్పుడు మాఫీ కాని మొత్తం మంది రైతులకు రుణమాఫీ వర్తించలేదు. ఇప్పుడు మూడో విడతలో 6 లక్షల మంది రైతులకు చెందిన రూ.6 వేల కోట్ల వరకు ఉన్న రుణాలు మాఫీ చేయబోతున్నామని ప్రభుత్వమే చెప్తోంది. ఆగస్టు 15వ తేదీన మాఫీ చేసే నాటికి ఈ లెక్కల్లో పెద్ద తేడాలు కూడా ఉండే అవకాశం లేదు. మొదటి విడతలో రూ.7 వేల కోట్ల వరకు రుణమాఫీ చేయబోతున్నామని చెప్పి రూ.900 కోట్లు తక్కువగానే మాఫీ చేశారు. రెండో విడతలోనూ మీడియాకు ఇచ్చిన లీకులకు కన్నా మాఫీ చేసిన మొత్తం తక్కువే.. మూడో విడతలోనూ ప్రభుత్వం చెప్పిన దానికన్నా మాఫీ చేయబోయే మొత్తం తక్కువే ఉంటుందని రేవంత్‌ సర్కార్‌ ట్రాక్‌ రికార్డే చెప్తోంది. బయటికి రుణమాఫీపై గొప్పలు చెప్పుకోవడం.. అంతకన్నా గొప్పగా ప్రచారం చేసుకోవడం.. లోపల మాత్రం రుణమాఫీ హామీనే మాఫీ చేసేలా ఎత్తులు వేయడం రేవంత్‌ సర్కార్‌ కే చెల్లింది. బడ్జెట్‌ కేటాయింపులు చేసిన హామీ పరిస్థితే ఇలా ఉంటే అసలు కేటాయింపులు లేని గ్యారంటీలు.. హామీలన్నీంటిని టోకున మాఫీ చేసేయడం ఖాయమే అనిపిస్తోంది!!


రూ.లక్ష వరకు అప్పులున్నోళ్లు 11.50 లక్షల మందేనా? కథనం చదివేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి


26 లక్షల మందికి రుణమాఫీ ఎగవేత కథనం చదివేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

Next Story