కేటీఆర్‌, హరీశ్‌ రుణమాఫీ కానోళ్ల వివరాలిచ్చి పాపాలు కడుక్కోవాలి

బీజేపీతో ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్‌.. అందుకే బీఆర్‌ఎస్‌ ఎంపీ సీట్లను త్యాగం చేసింది : సీఎం రేవంత్‌ రెడ్డి

కేటీఆర్‌, హరీశ్‌ రుణమాఫీ కానోళ్ల వివరాలిచ్చి పాపాలు కడుక్కోవాలి
X

రుణమాఫీ కాని రైతుల వివరాలుంటే ఇచ్చి కేటీఆర్‌, హరీశ్ రావు తమ పాపాలు కడుక్కోవాలని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. సాంకేతిక కారణాలతో కొందరు రైతుల రుణాలు మాఫీ కాలేదని, వాళ్ల వివరాలు కలెక్టర్లకు ఇస్తే మాఫీ చేస్తారని అన్నారు. బుధవారం సెక్రటేరియట్‌ లో ఆయన మీడియాతో చిట్‌ చాట్‌ చేశారు. కేసీఆర్ పదేళ్లు సీఎంగా ఉండి రూ.13,329 కోట్ల రుణాలు మాత్రమే మాఫీ చేశారని.. తమ ప్రభుత్వం 27 రోజుల్లోనే రూ.18 వేల కోట్లు రుణమాఫీ చేసిందన్నారు. రైతులను రుణ విముక్తులను చేయడమే తమ లక్ష్యమన్నారు. కేటీఆర్‌ కొడంగల్‌ వెళ్లి రుణమాఫీ కాని రైతుల వివరాలు సేకరిస్తానంటే స్వాగతిస్తానని అన్నారు. రూ.2 లక్షలకు పైగా రుణాలున్న రైతులు పైన ఉన్న మొత్తాన్ని బ్యాంకుల చెల్లిస్తే వారికీ రుణమాఫీ చేస్తామన్నారు. హరీశ్‌ రావు రుణమాఫీ పై సవాల్‌ చేసి పారిపోయి దొంగ అన్నారు. బీజేపీతో ఒప్పందంలో భాగంగానే ఎమ్మెల్సీ కవితకు బెయిల్‌ వచ్చిందన్నారు. కవిత బెయిల్‌ కోసమే బీఆర్‌ఎస్‌ ఎంపీ సీట్లను త్యాగం చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. కేజ్రీవాల్‌, సిసోడియాకు బెయిల్‌ రాకుండా కవితకు ఐదు నెలల్లోనే బెయిల్‌ ఎలా వచ్చిందన్నారు. మెదక్‌, సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌ లో బీజేపీకి మెజార్టీ ఇచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఏడు చోట్ల డిపాజిట్లు కోల్పోయేంత.. 15 చోట్ల మూడో స్థానంలో నిలిచేంత బలహీనంగా బీఆర్‌ఎస్‌ ఉందా అని ప్రశ్నించారు.

అక్రమ కట్టడాల కూల్చివేతలకు.. కాంగ్రెస్‌ పార్టీలో చేరికలకు సంబంధమే లేదన్నారు. ఎవరినో భయపెట్టి చేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. తమ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ ఉందని, తమ ప్రభుత్వ విధానాలు నచ్చే ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ లో చేరుతున్నారని తెలిపారు. చెరువుల కబ్జాలపై నిజనిర్దారణ కమిటీ ఏర్పాటు చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కమిటీకి హరీశ్‌ రావు నేతృత్వం వహించినా తనకు ఎలాంటి అభ్యంతరాలు ఉండబోవన్నారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌ అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. ప్రతిపక్ష నేత హోదాలో జీతభత్యాలు తీసుకుంటున్నప్పుడు పని చేయాలి కదా అన్నారు. అక్రమ కట్టడాల కూల్చివేతల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో అందరికీ తెలుసన్నారు. అప్పుడు స్వార్థంతో కూల్చివేతలు జరిగాయని.. ఆ తర్వాత ఎందుకు ఆగాయో అందరికీ తెలుసన్నారు. తాను కేసీఆర్ కాను.. రేవంత్‌ రెడ్డినని.. కూల్చివేతల విషయంలో తనకు కేసీఆర్‌ తో పోలికే ఉండదన్నారు. చెరువులో నిర్మాణాలు చేపట్టినోళ్లు ఎంతటి వారైనా కూల్చివేతలు తప్పవని అన్నారు. విద్యాసంవత్సరం మధ్యలో కూల్చివేతలు వద్దనే ఓవైసీ భవనాలు కూల్చలేదన్నారు. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లలో ఎంతటి వారి నిర్మాణాలు ఉన్నా వాటిని కూల్చేస్తామన్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు బయట ఉన్న గ్రామ పంచాయతీలు హైడ్రా పరిధిలోనే ఉన్నాయన్నారు. జంట జలాశయాలను పరిరక్షించడం తమ ప్రభుత్వ బాధ్యత అన్నారు. చెరువు శిఖం భూముల్లో వ్యవసాయం చేసుకుంటే పర్వాలేదని.. నిర్మాణాలు చేపడితే కూల్చివేస్తామన్నారు.

సీడబ్ల్యూసీ సభ్యుడు పల్లంరాజు నిర్మాణాన్నే హైడ్రా కూల్చివేసిందన్నారు. జన్వాడ ఫామ్‌ హౌస్‌ లీజుకు తీసుకున్నానని కేటీఆర్‌ తన అఫిడవిట్‌ లో ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. పదేళ్లు మంత్రిగా పని చేసిన కేటీఆర్‌ కు నిర్మాణాలకు ఎవరు పర్మిషన్‌ ఇస్తారో తెలియదా అన్నారు. తన కుటుంబం భూ కబ్జాలు చేసినట్టు నిరూపిస్తే తానే స్వయంగా ఆ కట్టడాలను కూల్చివేస్తానని అన్నారు. విద్యాసంస్థల ముసుగులో కబ్జాలు చేస్తే ఊరుకోబోమన్నారు. ఎఫ్‌టీఎస్‌, చెరువులు, నాలాల బఫర్‌ జోన్లలో ఆక్రమణలు తొలగిస్తామన్నారు. అవి 30 ఏళ్ల క్రితమే కట్టినవైనా సరే హైడ్రా చర్యలు తీసుకుంటుందని అన్నారు. హైడ్రా కూల్చివేతలపై ఒత్తిళ్లు వస్తున్నాయని.. అయినా వెనక్కి తగ్గేది లేదన్నారు. లీడర్స్‌, హీరోలు ప్రజలకు రోల్‌ మోడల్‌ గా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. హైడ్రా ప్రస్తుతం హైదరాబాద్‌ కే పరిమితమని తెలిపారు. వాల్మీకి స్కామ్‌ తో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తెలంగాణలో బ్యాంక్‌ ఖాతాలున్నంత మాత్రాన సంబంధం ఉన్నట్టా అని ప్రశ్నించారు. ఈ స్కామ్‌ తో బీఆర్‌ఎస్‌ నేతలకే లింక్‌ ఉండొచ్చు అన్నారు. తెలంగాణ, ఏపీ మధ్య చాలావరకు చిక్కుముడులు తాను సీఎం అయ్యాకే పరిష్కారం అయ్యాయని తెలిపారు. జనాభా ప్రాతిపదికన అప్పుల పంపకంపై తాను సీఎం అయ్యాకే తెలంగాణ మాట ఏపీ వింటుందని అన్నారు.

Next Story