'మాఫీ' బాగోతం బైటపడ్డదని భౌతికదాడులా?

ఎనుముల రేవంత్‌ పాలనలో ప్రశ్నించడమే నేరమా?

మాఫీ బాగోతం బైటపడ్డదని భౌతికదాడులా?
X

ఏక కాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామన్న మాట నిలబెట్టుకోలేదు. ఆంక్షలు లేకుండా అందిరికీ మాఫీ వర్తింప చేస్తామన్న వాగ్దానాన్ని అమలు చేయలేదు. చారాణ పనిచేసి బారాణ ప్రచారం చేసుకుంటున్న గుంపుమేస్త్రి పాలనపై రైతులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. ఆంక్షల పేరుతో అడ్డుగోలు నిబంధలు పెట్టి 50 శాతానికి పైగా రైతుల రుణమాఫీ ఎగొట్టిన ఎనుముల రేవంత్‌ రెడ్డి ఇప్పుడు దీనిపై ప్రధాన ప్రతిపక్షం, విపక్షాలు విసిరిన సవాల్‌ను స్వీకరించడానికి సిద్ధంగా లేరు. కేటీఆర్‌, హరీశ్‌రావులే కాదు బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కూడా ఏ ఒక్క గ్రామంలో సంపూర్ణంగా రుణమాఫీ అయ్యింది అంటే తాము రాజకీయాల నుంచి వైదొలుగుతామంటున్నారు. రుణమాఫీ అయిపోయింది హరీశ్‌ రాజీనామా చేయాలని అవాకులు చెవాకులు పేలిన ముఖ్యమంత్రి దీనికి ఈ సవాల్‌కు సిద్ధమా? అంటే వెన్నుచూపి పారిపోయారు.

రేవంత్‌ సర్కార్‌ రుణమాఫీ బాగోతాన్ని బైటపెట్టడానికి ఆయన సొంత గ్రామం కొండారెడ్డిపల్లికి వెళ్లిన మహిళా జర్నలిస్టులు ఆవుల సరితా యాదవ్, విజయారెడ్డిలపై బూతులు తిడుతూ.. ఫోన్లు, కెమెరాలు గుంజుకుని భౌతిక దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిని ప్రధాన సూత్రధారి రేవంత్‌ అన్న కొండల్‌రెడ్డి, అనిల్‌ కొంరెడ్డి. రుణమాఫీ రేవంత్‌ చెప్పేవన్నీ బోగస్‌ మాటలు అని ఇప్పటికే తేటతెల్లమైంది. దానికి బ్యాంకుల వద్ద రైతులు వ్యవసాయ విస్తరణాధికారుల చుట్టూ, బ్యాంకుల చుట్టూ తిరగుతున్నారు. ఏ ఊరికి వెళ్లినా రుణమాఫీ అయ్యింది 20-30 శాతం మాత్రమే అని తేలింది. రుణమాఫీ కాలేదని మంత్రులే అంటున్నారు. అయినా ఎనుముల రేవంత్‌రెడ్డి మాత్రం ఇంకా ఏతులు కొడుతూనే ఉన్నారు. రుణమాఫీపై రైతుల వద్దకు వెళ్లి తిరగబడుతారని ముఖం చాటేశారు. వ్యవసాయ శాఖమంత్రితో రోజుకో ప్రకటన ఇప్పిస్తున్నారు. సాంకేతిక కారణాలతో రుణమాఫీ ప్రక్రియ పూర్తికాలేదని చేస్తామని బుకాయిస్తున్నారు. ముఖ్యమంత్రి, మంత్రుల మాటలు చూస్తుంటే రుణమాఫీకి మంగళం పాడినట్లే కనిపిస్తున్నది. ఎందుకంటే రాష్ట్రం తీవ్ర అప్పుల్లో ఉన్నా రూ. 2 లక్షల రుణమాఫీ చేశామని పదే పదే ప్రకటనలు ప్రచారంలో పెడుతున్నారు. అంటే రాష్ట్రం మొత్తం దివాళా తీసిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తాము ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోవడానికి, రుణమాఫీ కాకపోవడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితే దానికి కారణం అన్నట్టు కాంగ్రెస్‌ మంత్రులు చెబుతున్న మాట. ఇవన్నీ తప్పించుకునే వ్యవహారాలే తప్ప మరొకటి కాదు.

రేవంత్‌ రెడ్డి ప్రభుత్వ అసత్య ప్రచారాలు.. వాళ్లు ఇచ్చిన హామీలపై వాస్తవాలను కొంతకాలంగా తెలుగు స్కైబ్‌ క్షేత్రస్థాయిలోకి వెళ్లి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నది. రేవంత్‌ వచ్చాకే అన్ని పథకాలు ఆగిపోయాయని. కేసీఆర్‌ ఉన్నప్పుడే బాగుండేదనే అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి ఓటు వేసినందుకు మా చెప్పుతో మేము కొట్టుకోవాలి అని కొందరు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా అనేక వాస్తవాలను ప్రజల ముందు ఉంచడంతో కంగారుపడ్డ కాంగ్రెస్‌ ప్రభుత్వం నిరుద్యోగుల అంశంపై ఆర్ట్స్ కాలేజీ రిపోర్టింగ్‌ పోయిన జర్నలిస్టుపై దాడికి పాల్పడింది. మొన్నటివరకు కేసీఆర్‌ ప్రభుత్వాన్ని విమర్శించిన కొందరు యూట్యూబ్‌ ఛానల్స్‌ వారు ఇదే పాలన అని నిలదీస్తే వాళ్లనూ లోపల వేసింది. ఇప్పుడు మహిళా జర్నలిస్టులపై దాడి చేయించింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళల సమస్యలపై కేటీఆర్‌ ట్వీట్‌ చేయగానే ఒంటికాలిపై లేచిన మహిళా మంత్రి సీతక్క, మహిళా కమిషన్‌ దీనికి ఏం సమాధానం చెబుతారని మహిళా జర్నలస్టులు ప్రశ్నిస్తున్నారు. విద్యాశాఖ, హోం శాఖ, మున్సిపల్‌ ఇట్లా అన్నీ కీలక శాఖ తన దగ్గర పెట్టుకున్న సీఎం వాటన్నింటిలో ఘోరంగా విఫలమయ్యారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఘోరంగా దెబ్బతిన్నాయని, మహిళపై దాడులు పెరుగుతున్నాయని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధారాలతో బైటపెట్టారు. దీనికి సమాధానం చెప్పాల్సిన సీఎం అక్కసుతో వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డికి మహిళలు అంటే ఎలాంటి గౌరవం ఉంటుందో అసెంబ్లీలో చూశాం. చెట్టు ఒకటి అయితే విత్తనం మరొకటి ఉంటుందా? ఇవాళ మహిళా జర్నలిస్టులపై దాడి జరిగింది రేవంత్‌రెడ్డి అన్న కొండల్‌రెడ్డి ప్రోద్బలంతోనే అని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. చేతగాని ప్రభుత్వంలో చేత గాని నేతలకు ఇంత కంటే ఏం చేస్తారు? బూతులతో, భౌతికదాడులతో అందరి నోళ్లు మూయిస్తామని అనుకుంటున్న రేవంత్‌రెడ్డి సర్కార్‌ను రోజులు దగ్గర పడ్డాయి. నిర్బంధాలు, అణిచివేతలతో నిజాలను బంధించలేరు. ప్రజలు ఇచ్చిన హామీల నుంచి తప్పించుకోలేరు.

Raju

Raju

Writer
    Next Story