'సీతారామ'కు మంత్రి ఉత్తమ్‌ కొత్త భాష్యం

దుమ్ముగూడెం ప్రాజెక్టు రీ డిజైన్‌ తో రూ.20 వేల కోట్లు దుర్వినియోగమయ్యాయని ఇరిగేషన్‌ శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కొత్త భాష్యం చెప్తున్నారు.

సీతారామకు మంత్రి ఉత్తమ్‌ కొత్త భాష్యం
X

దుమ్ముగూడెం ప్రాజెక్టు రీ డిజైన్‌ తో రూ.20 వేల కోట్లు దుర్వినియోగమయ్యాయని ఇరిగేషన్‌ శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కొత్త భాష్యం చెప్తున్నారు. రాజీవ్‌ సాగర్‌, ఇందిరా సాగర్‌ ప్రాజెక్టుల పేర్లు మార్చి సీతారామ ఎత్తిపోతలు చేపట్టారని దీంతో ప్రజాధనం వృథా చేశారని అంటున్నారు. ఇరిగేషన్‌ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించి ఆరు నెలలు గడిచినా డిపార్ట్‌మెంట్‌ స్పిరిట్‌ ఏమిటో ఆయన అర్థం చేసుకోలేకపోయారని ఇలాంటి వ్యాఖ్యలతో తేటతెల్లమవుతోంది. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన ప్రాజెక్టుల రీ డిజైన్‌లతో ప్రజల సొమ్ము దుర్వినియోగం అయ్యిందని చెప్పే ప్రయత్నంలో ప్రాజెక్టుల నిర్మాణానికి చేసిన మొత్తం ఖర్చు దుర్వినియోగం, దుబారా అని మంత్రి ఉత్తమ్‌ సుత్రీకరిస్తున్నారు. కేసీఆర్‌ ను బద్‌నాం చేయడానికి ఇలా మంత్రి ఇలా మాట్లాడుతున్నారు అంటే.. వాళ్ల రాజకీయ ప్రయోజనం కోసమని అనుకోవచ్చు. ఎన్నికల సమయంలో బురద జల్లడానికి ఈ తరహా కామెంట్స్‌ ఉపయోగపడుతాయి. కానీ ఇప్పుడు ఏ ఎన్నికలు లేవు.. ఇలాంటి సమయంలో బాధ్యతాయుతమైన మంత్రి స్థానంలో ఉండి.. సంబంధిత శాఖలో చేసిన వ్యయంపై ఇలా మాట్లాడటం అంటే అది బాధ్యత రాహిత్యమే.. లేదంటే విషయం తెలియకపోవడం కూడా కావొచ్చు. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఇలా మాట్లాడటం ఇదే మొదటిసారి కాదు. కాళేశ్వరం, పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతలపైనా ఇలాంటి కామెంట్స్‌ పలుమార్లు చేశారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టుల కోసం వెచ్చించిన రూ.2 లక్షల కోట్లు గంగపాలు చేశారని కూడా ఉత్తమ్‌ అన్నారు. సీతారామ లిఫ్ట్‌ స్కీం, సీతమ్మ సాగర్‌ మల్టీపర్పస్‌ ప్రాజెక్టు కోసం కేసీఆర్‌ అధికారంలో ఉన్నప్పుడు ఖర్చు చేసిందే రూ.8 వేల కోట్లు.. అలాంటప్పుడు ఆ ప్రాజెక్టు పేరుతో రూ.20 వేల కోట్లు దుర్వినియోగం చేశారని మంత్రి మాట్లాడటం ఎలాంటి సంకేతాలు ఇస్తుంది? ఉత్తమ్‌ ఒక్కరే కాదు ఇదే సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క కూడా ఇలాంటి కామెంట్స్‌ చేశారు. రూ.2 వేల కోట్లతో పూర్తయ్యే రాజీవ్‌ సాగర్‌, ఇందిరాసాగర్‌ ను రీ డిజైన్‌ చేసి ఖర్చు రూ.20 వేల కోట్లకు పెంచేశారని అన్నారు. రాజీవ్‌ దుమ్ముగూడెం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం కింద ప్రతిపాదించింది కేవలం 2 లక్షల ఎకరాలకు. ఆ ప్రాజెక్టుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు పెద్దగా ప్రయోజనం చేకూరదని గుర్తించే తెలంగాణ ఆవిర్భావం తర్వాత సీతారామ లిఫ్ట్‌ స్కీం పేరుతో రీ డిజైనింగ్‌ చేశారు. ఆయకట్టు రూ.6 లక్షల ఎకరాలకు పెంచారు. మూడు పంపుహౌస్‌లు, నీటిని తరలించే కాల్వలు, ప్రెషర్‌ మెయిన్స్‌, కరెంట్‌ సబ్‌ స్టేషన్‌లు, పెరిగిన భూసేకరణ వ్యయం, ఫారెస్ట్‌ ల్యాండ్‌కు ప్రత్యామ్నాయంగా అటవీ పెంపకం ఇవన్నీ కలుపుకుంటే ఖర్చు రూ.13వేల కోట్లకు పెరిగింది. ఇందులో రూ.8 వేల కోట్లకు పైగా ఖర్చు చేసి 70 శాతం వరకు పనులు పూర్తి చేశారు. ఈ వానాకాలంలోనే సీతారామ లిఫ్ట్‌ నుంచి మొదటి విడతలో 1.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వబోతున్నారు.

సీతారామ లిఫ్ట్‌ స్కీం విలువ మాత్రమే రూ.20 వేల కోట్లకు పెరగలేదు. దుమ్ముగూడెం దిగువన సీతమ్మ సాగర్‌ పేరుతో మల్టీ పర్పస్‌ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. ఏడాది పొడవునా సీతారామ లిఫ్ట్‌ కు నీటి లభ్యత ఉండటంతో పాటు హైడల్‌ పవర్‌ (జల విద్యుత్‌) జనరేషన్‌ కోసం సీతమ్మ సాగర్‌ ను తలపెట్టారు. ఈ రెండింటి వ్యయం రూ.17 వేల కోట్లు. నిర్మాణం పూర్తయ్యే సరికి మరికొంత పెరిగే అవకాశం ఉంది. 2004తో పోల్చితే ఇప్పుడు అన్నింటి ధరలు విపరీతంగా పెరిగాయి. నిర్మాణ సామగ్రి వ్యయమైతే డబుల్‌, ట్రిపుల్‌ అయ్యింది. ఫలితంగా ఖర్చు పెరగడం అత్యంత సహజం. భూసేకరణ కోసం ఇవ్వాల్సిన పరిహారం, ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ కూడా పెరిగింది. ఫలితంగా అన్ని ప్రాజెక్టుల ఖర్చులు పెరిగాయి. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం ఇంతకంటే ఎక్కువే పెరిగాయి. కానీ ఇక్కడ కేసీఆర్‌ ను బద్‌నాం చేయాలనే ఒకే ఒక్క ఎజెండాతో తెలంగాణలో మాత్రమే ప్రాజెక్టుల ఖర్చు పెరిగింది అని ఆరోపణలు చేస్తున్నారు. అసలు ప్రాజెక్టు స్వరూపం సమూలంగా మారిందని, కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుతో నిర్దేశిత ఆయకట్టుకు సాగునీళ్లు ఇవ్వడమే కాదు.. అవసరమైతే నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టును పరిరక్షించేలా చేపట్టారనే విషయాన్ని కూడా ఎక్కడా చెప్పడం లేదు. రూ.2 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్లకు పెరిగిందంటే కేసీఆర్‌ ఎంత మేరకు ప్రజాధనం దుర్వినియోగం చేశారో చూశారా అని ప్రజలకు చెప్పే ప్రయత్నమే తప్ప.. ప్రభుత్వ పెద్దల వాదనల్లో పస లేదు. రూ.8 వేల కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదు అంటే ప్రాజెక్టు ప్రధాన పనులు సాగుతున్న సమయంలో ఆయకట్టుకు ఎలా నీళ్లు ఇవ్వగలుగుతారు. నాగార్జునసాగర్‌, శ్రీరాంసాగర్‌ సహా ఈ ప్రాజెక్టు హెడ్‌ వర్క్స్‌ ను చూపెట్టి ఆయకట్టుకు నీళ్లేవి అని ఎలా అడుగగలం. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు స్టేజీ -2 ఆయకట్టుకు కాంగ్రెస్‌, టీడీపీ ప్రభుత్వాలు దశాబ్దాల తరబడి నీళ్లు ఇవ్వలేకపోయాయి. కానీ ఆయా ప్రాజెక్టుల కింద పూర్తి ఆయకట్టుకు నీళ్లిచ్చినట్టుగా అప్పటి పాలకులు పెద్దన ప్రచారం చేసుకున్నారు. ఎస్సారెస్పీ స్టేజీ -2 ఆయకట్టుకు కేసీఆర్‌ సీఎం అయ్యాకే నీళ్లు వచ్చాయి.. ఈ వాస్తవాన్ని గ్రహించగలిగే పరిస్థితుల్లో కాంగ్రెస్‌ మంత్రులు లేరు. అంతే కాదు జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌ సాగర్‌, అంతకుముందే చేపట్టిన దేవాదుల ఎత్తిపోతల పథకాలను కేసీఆరే పూర్తి చేసి ఆయా ప్రాజెక్టుల ఆయకట్టుకు నీళ్లిచ్చారు. ఆ ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రభుత్వాలు ఆయకట్టుకు నీళ్లు ఇవ్వలే కాబట్టి ఆ ఖర్చంతా వృథానే అనుకోవాలా.. అంటే జలయజ్ఞంలో చేసిన ఖర్చు నిష్ఫలం అని ఉత్తమ్‌, భట్టి చెప్తున్నారా? రేపు ఇంకో నాలుగైదు వేల కోట్లు ఖర్చు పెడితే సీతారామ కింద 5 లక్షల ఎకరాలకు నీళ్లు అందుతాయి.. అంటే దానిపై ఇన్నాళ్లు ఖర్చు చేసిన రూ.8 వేల కోట్ల పనుల విలువైన పనులతో అవసరం లేకుండానే మొత్తం ఆయకట్టుకు నీళ్లు వచ్చినట్టా..? కేసీఆర్‌ పై రాజకీయంగా వ్యతిరేకత ఉంటే ఆయనపైనే చూసుకోవాలి తప్ప తెలంగాణ గడ్డ పచ్చబారేందుకు చేపట్టిన ప్రాజెక్టులపై, వాటి కోసం చేసిన ఖర్చు వృథా అయిందని చెప్పడమంటే తెలంగాణపై విషం చిమ్మడమే.

Next Story