నాకు మూడు రోజుల నుంచి నిద్రలేదు.. వరద మీదనే సమీక్ష చేస్తున్న

భారీ వర్షాలు, వరదలతో రూ.5 వేల కోట్ల నష్టం : సూర్యాపేటలో సీఎం రేవంత్‌ రెడ్డి

నాకు మూడు రోజుల నుంచి నిద్రలేదు.. వరద మీదనే సమీక్ష చేస్తున్న
X

భారీ వర్షాలు, వరదలతో తనకు మూడు రోజుల నుంచి నిద్ర లేదని.. అధికారులతో సమీక్ష చేస్తూనే ఉన్నానని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. సోమవారం ఖమ్మంలో వరద ప్రభావ ప్రాంతాల పర్యటనకు వెళ్తూ సూర్యాపేటలో మంత్రులు, అధికారులతో కలిసి వరదలపై సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ప్రాథమిక అంచనా ప్రకారం భారీ వర్షాలతో రాష్ట్రంలో రూ.5 వేల కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. వరదలు, విపత్తులు సంభవించినపుడు కేంద్రం వైపునకు చూడకుండా ఎస్‌డీఆర్‌ఎఫ్‌ ను ప్రారంభించుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు ప్రధాని మోదీని ఆహ్వానించామన్నారు. వరద సాయం కింద రాష్ట్రానికి తక్షణమే రూ. 2 వేల కోట్లు విడదుల చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ రాష్ట్రానికి నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేయాలన్నారు. రాజకీయాలకు ఇది సమయం కాదన్నారు. మంత్రులంతా క్షేత్రస్థాయిలో పర్యటిస్తుంటే ఒకాయన అమెరికాలో ఉండి ట్విట్టర్‌ లో పెడుతున్నారని, ఒకాయన ఫాం హౌస్‌ లో ఉన్నాడని ఆరోపించారు. బెయిల్‌ కోసం 20 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీ వెళ్తారు కాని వరద బాధితులును పరామర్శించరన్నారు. వరద సమయంలో బురద రాజకీయాలు వద్దన్నారు. సూర్యాపేట జిల్లాలో 30 సెం.మీ.ల వర్షం పడటంతో భారీ నష్టం వాటిల్లిందన్నారు. రాష్ట్రంలో వరద పరిస్థితిపై ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి వివరించి సాయం చేయాలని కోరానన్నారు. వర్షాలతో మరణించిన వారికి రూ.5 లక్షల సాయం చేస్తామన్నారు. పశువులు చనిపోతే రూ.50 వేలు, పంట నష్టపోతే ఎకరాకు రూ.10 వేలు ఇస్తామన్నారు. ఇండ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు.

Next Story