హైదరాబాద్‌ బ్రాండ్‌ ను రేవంత్‌ సర్కార్‌ కూల్చేసింది

కవిత కేసులో ధర్మమే గెలిచింది.. సుప్రీం కోర్టు రేవంత్‌ వ్యాఖ్యలను తప్పుబట్టింది : మీడియా చిట్‌ చాట్‌ లో మాజీ మంత్రి హరీశ్ రావు

హైదరాబాద్‌ బ్రాండ్‌ ను రేవంత్‌ సర్కార్‌ కూల్చేసింది
X

హైదరాబాద్‌ బ్రాండ్‌ ను రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కూల్చేసిందని మాజీ మంత్రి హరీశ్‌ రావు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం తెలంగాణ భవన్‌ లో ఆయన మీడియాతో చిట్‌ చాట్‌ చేశారు. కాంగ్రెస్‌ అంటేనే కూల్చివేతల సర్కార్‌ అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కిట్, రైతుబంధును కూల్చి వేశారని తెలిపారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులతో ప్రజాస్వామ్యాన్ని కూల్చారని, రాష్ట్రంలో వైద్య వ్యవస్థను కూల్చేశారని, దేవుళ్లపై ఒట్లు వేసి ప్రజల విశ్వాసాలను కూల్చారని.. గొర్రెల కాపర్ల ఉపాధిని కూల్చారని మండిపడ్డారు. హైడ్రా ఆఫీస్‌ ఉన్న బుద్ధ భవన్‌ నాలాపై ఉందని, రంగనాథ్‌ ముందు తన ఆఫీస్‌ ను కూలగొట్టిన తర్వాతే ఇతర బిల్డింగ్‌ లు కూలగొట్టాలని డిమాండ్‌ చేశారు. జీహెచ్‌ఎంసీ నాలా పైనే ఉందని.. నెక్లెస్‌ రోడ్‌ లోని రెస్టారెంట్లు, కమర్షియల్‌ కాంప్లెక్సులు, మీరాలం, ఉప్పల్‌, రామాంతపూర్ చెరువుల్లో పెద్ద పెద్ద టవర్లు వచ్చాయి.. అవన్నీ కూల్చేస్తారా అని ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి ఇంట్లోని నీళ్లు చెరువులోకి వెళ్తున్నాయా.. లేక ఆయన ఇంటికి స్పెషల్‌ అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ ఉందా అని ప్రశ్నించారు. రేవంత్‌ రెడ్డి చేతిలోనే అధికారం ఉందని.. మిషన్‌ కాకతీయపై విచారణ చేయించుకోవచ్చన్నారు. సీఎం తెలంగాణ తల్లి విగ్రహానికి శంకుస్థాపన చేస్తే మంత్రులెవరు ఎందుకు హాజరు కాలేదో చెప్పాలన్నారు. తెలంగాణ తల్లికి కేసీఆర్ రూపం ఇస్తే ఆయన ఆనవాళ్లపై రేవంత్ రెడ్డి నిలబడ్డారని అన్నారు.

ఎమ్మెల్సీ కవిత కేసులో ధర్మమే గెలిచిందని అన్నారు. కవిత బెయిల్‌ పై సీఎం నోటికి వచ్చినట్టు మాట్లాడితే సుప్రీం కోర్టు తప్పుబట్టిందన్నారు. వక్రబుద్ది ఉన్నోళ్లకు అన్ని వంకరగా కనిపిస్తాయని ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి బెయిల్ బీజేపీ ఇస్తేనే వచ్చిందా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది, ఈడీ, సీబీఐపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిందని అన్నారు. సిసోడియాకు బెయిల్ వస్తే బీజేపీతో పోరాటం.. కవితకు బెయిల్ వస్తే బీజేపీతో లాలూచీనా అని మండిపడ్డారు. ఫోర్త్ సిటీ పేరుతో ప్రభుత్వ భూములు కొల్లగొట్టే కుట్ర జరుగుతోందని, టైం వచ్చినప్పుడు అన్ని వివరాలు బయటపెడతానని అన్నారు. కందుకూరులోని సర్వే నంబర్‌ 9లో ఉన్న 385 ఎకరాల ప్రభుత్వ భూమిని కొల్లగొట్టడానికి సర్వే చేస్తున్నారని తెలిపారు. తుక్కుగూడలో సర్వే నంబర్‌ 895లోని 25 ఎకరాలను పేద రైతుల దగ్గరి నుంచి కొందరు బినామీలను ముందుపెట్టి తీసుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వంలో పెద్దలుగా చలామణీ అవుతున్న పెద్దల పీఏల పేరుతో ముచ్చర్లలో భూములు కొంటున్నారని చెప్పారు.

రుణమాఫీ విషయంలో రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి మోసం చేశారని, అందుకే మూడుసార్లు పిలిచినా ఆయన వరంగల్‌ సభకు రావడం లేదన్నారు. వాల్మీకి స్కామ్ లో పట్టపగలు నిలువు దోపిడీ చేశారని అన్నారు. కర్నాటక ప్రభుత్వ డబ్బుతో కార్లు, బంగారం కొన్నారని, రాష్ట్రంలోని తొమ్మిది కంపెనీల అకౌంట్లకు డబ్బులు బదిలీ అయ్యాయని తెలిపారు. ఈ స్కామ్‌ లో డబ్బులు ఎవరి ఖాతాల్లోకి చేరాయో వెళ్లి ఈడీ విచారణ కోరదామా అని సీఎం రేవంత్‌ ను సవాల్‌ విసిరారు. ఈ స్కామ్‌ లో ఈడీ విచారణ కోరడానికి కాంగ్రెస్‌ పార్టీకి దమ్ముందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌, బీజేపీ కుమ్మక్కయ్యాయి కాబట్టే ఈ స్కామ్‌ పై బీజేపీ, కాంగ్రెస్‌ నేతలెవరూ నోరు మెదపడం లేదన్నారు. త్వరలోనే ఈడీని కలిసి ఈ స్కామ్‌ పై విచారణ చేయాలని కోరుతామన్నారు. ఓల్డ్‌ సిటీలో కరెంట్‌ బిల్లుల వసూళ్లు అదానీకి అప్పగిస్తామని ఢిల్లీలో మీడియా చిట్‌ చాట్‌ లో చెప్పిన రేవంత్‌.. అసెంబ్లీలో ఇదే విషయం తాము అడిగితే తాను ఎక్కడ అన్నానని ఎదురు ప్రశ్నించారని తెలిపారు. రేవంత్‌ అబద్ధాలను గోబెల్స్‌ ను మించి ప్రచారం చేస్తున్నారని అన్నారు. రుణమాఫీ గురించి రేవంత్‌ ఎంత తక్కువ మాట్లాడితే ఆయనకే అంత మంచిది అన్నారు. ఈ విషయంలో రేవంత్‌ గజదొంగ అని మండిపడ్డారు. వంద శాతం రుణమాఫీ అని సీఎం మోసం చేశారని.. ఆయన మంత్రులేమో మాఫీ కాలేదనే చెప్తున్నారని అన్నారు. ఎందుకు లోన్లు మాఫీ కాలేదని ప్రశ్నిస్తూ అధికారులపైకి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలే పేపర్లు విసిరేశారని తెలిపారు. ఆగస్టు 15లోగా ఎందుకు రుణమాఫీ చేయలేకపోయారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. రూ.50 లక్షలు ఇస్తూ అడ్డంగా దొరికిన దొంగ రేవంత్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ అంటే భారత రైతు సమితి అన్నారు. రాహుల్‌ గాంధీ ఎప్పుడు హైదరాబాద్‌ కు వస్తారో చెప్తే తానే ఎయిర్‌ పోర్టుకు వెళ్లి రిసీవ్‌ చేసుకుంటానని తెలిపారు. సీఎం సొంత గ్రామానికి రాహుల్‌ గాంధీని తీసుకెళ్తానని.. రుణమాఫీ పూర్తయ్యిందో లేదో ఆయనకే తెలుస్తుందన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి లెక్కల ప్రకారమే 20 లక్షల మందికి రుణమాఫీ కాలేదని.. ఇంకా రేవంత్‌ రుణమాఫీ గురించి మాట్లాడి నవ్వులపాలు కావొద్దన్నారు.

Next Story