రేవంత్‌ సర్కార్‌ ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చింది?

నిరుద్యోగులకు అభయహస్తం పేరుతో కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టోలో పేర్కొన్న ఒక్క నోటిఫికేషన్‌ అయినా ఇప్పటివరకు విడుదలైందా అన్నది చూస్తే ఒక్కటీ కాలేదనే సమాధానమే వస్తుంది.

రేవంత్‌ సర్కార్‌ ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చింది?
X

ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లోనే చిత్తశుద్ధితో 30 వేల ఖాళీలను భర్తీ చేసి నియామక పత్రాలను అందించామని సీఎం రేవంత్‌ పదే పదే ఏతులు ఎందుకు కొడుతున్నారు. అసలు నిరుద్యోగులకు అభయహస్తం పేరుతో ఆపార్టీ మ్యానిఫెస్టోలో పేర్కొన్న ఒక్క నోటిఫికేషన్‌ అయినా ఇప్పటివరకు విడుదలైందా అన్నది చూస్తే ఒక్కటీ కాలేదనే సమాధానమే వస్తుంది. ఎందుకంటే గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ 1-2-2024న, గ్రూప్‌-2 ఫేజ్‌-1లో 1-4-2024, గ్రూప్‌-3 ఫేజ్‌-1లో 1-6-2024, గ్రూప్‌-4 ఫేజ్‌-1లో 1-6-2024, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌- అసిస్టెంట్‌ ఇంజినీర్‌ ఉద్యోగాల భర్తీ కోసం 1-5-2024, అగ్రికల్చర్‌,హార్టికల్చర్, వెటర్నరీ అధికారుల ఉద్యోగాల భర్తీకి 1-5-2024, ట్రాన్స్‌ఫోర్టు,కానిస్టేబుల్‌, ఎక్సైజ్‌ కానిస్టేబుల్స్‌, పోలీస్‌ కానిస్టేబుల్స్, ఇతర యూనిఫాం సిబ్బంది నియామకాల కోసం మొదటి ఫేజ్‌లో 1-3-2024, జూనియర్‌, డిగ్రీ, పాలిటెక్నిక్‌ లెక్చరర్ల భర్తీ కోసం 1-4, 2024, విలేజి రెవెన్యూ ఆఫీసర్‌, జేపీఎస్‌ ల భర్తీకోసం 1-6-2024 ఇట్లా నోటిఫికేషన్లు ఇస్తామని తేదీలతో సహా పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చారు.

ఇప్పటివరకు వీటిలో ఏ ఒక్కటీ విడుదల కాలేదు. ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షలు కూడా గత ప్రభుత్వం ఇచ్చిన 5,089 పోస్టులతో ఇచ్చిన నోటిఫికేషన్‌కు కొనసాగింపే తప్పా కొత్తగా కాంగ్రెస్‌ ఇచ్చింది ఏదీ లేదు. కొత్త నోటిఫికేషన్లు ఇవ్వకపోగా.. ఇప్పటికే ఇచ్చిన పోస్టులను పెంచుతామని హామీని నెరవేర్చకపోగా పదే పదే 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని ఊదరగొట్టుడు, దాన్ని ప్రజాధనంతో ప్రచారం చేసుకోవడం రేవంత్‌ ప్రభుత్వం మొదలుపెట్టింది.

విద్యార్థి సంఘం నాయకుడు మోతీలాల్‌ నాయక్‌ 9 రోజులకు పైగా నిరాహారదీక్ష చేసింది. ఆర్టీసీ క్రాస్‌రోడ్, దిల్‌సుఖ్‌నగర్‌, చిక్కడపల్లి సెంట్రల్‌ లైబ్రరీ, ఓయూలలో నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నది కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలనే నిలబెట్టుకోవాలనే కదా. నిరసన చేస్తున్న ఏ విద్యార్థి సంఘం నేతలతో సీఎం గాని, డిప్యూటీ సీఎం గాని చర్చించలేదు. ప్రభుత్వానికి భజన చేస్తూ.. నిరుద్యోగుల తిన్నది అరగక నిరనసలు చేస్తున్నారని టీవీల ముందు అడ్డగోలుగా మాట్లాడుతున్న వారితోనే ప్రభుత్వం సంప్రదింపులు చేస్తున్నది. వారి మాటలనే పరిగణనలోకి తీసుకుంటున్నది. జాబ్‌ క్యాలెండర్‌పై, పరీక్షల వాయిదాపై, ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి చేసిన వ్యాఖ్యలను చూస్తే దేనికి పొంతన ఉండదు. రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారని నిరుద్యోగులు ధర్నాలు చేస్తుంటే దానికి స్పష్టమైన సమాధానం చెప్పకుండా ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే అదే నిజమౌతుందని రేవంత్‌రెడ్డి అనుకుంటున్నారు. అందుకే అబద్ధాన్నే ఆయన చెబుతూ ఆయన మంత్రివర్గ సహచరులతోనూ చెప్పిస్తున్నారు.

Raju

Raju

Writer
    Next Story