ఎగువన భారీ వర్షాలు.. ప్రాజెక్టులకు జలకళ

ఎగువన కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి, కృష్ణ పరివాహక ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది.

ఎగువన భారీ వర్షాలు.. ప్రాజెక్టులకు జలకళ
X

ఎగువన కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి, కృష్ణ పరివాహక ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. శ్రీరాంసాగర్‌, ఎల్లంపల్లి, సింగూరు, నిజాంసాగర్‌ లోకి ప్రవాహం ఎక్కువగా వస్తున్నది. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు వరద ప్రవాహం భారీగా ఉన్నది.

ప్రాజెక్టుల నీటి మట్టాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. శ్రీరాంసాగర్‌కు ఇన్‌ఫ్లో 23వేల క్యూసెక్కులు గా ఉన్నది. శ్రీరాంసాగర్‌ పూర్తిస్థాయి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటి నిల్వ 32 టీఎంసీలకు చేరింది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతున్నది. ప్రాజెక్టు సామర్థ్యం 20 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 17 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. జలాశయంలోకి 18 వేల క్యూసెక్కుల నీళ్లు వస్తున్నాయి. నిజాంసాగర్‌ ప్రాజెక్టు ఇన్ ఫ్లో 720 క్యూసెక్కులుగా ఉన్నది. పూర్తిస్థాయి సామర్థ్యం 17 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 4 టీఎంసీల మేర నీరు నిల్వ ఉన్నది. సింగూరు ప్రాజెక్టులోకి క్రమంగా వరద చేరుతున్నది. ఇన్‌ఫ్లో 3000 క్యూసెక్కులు ఉన్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 29 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 14 టీఎంసీలు ఉన్నది.

కృష్ణ పరివాహక ప్రాజెక్టులోనూ వరద ప్రవాహం కొనసాగుతున్నది. జూరాల ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 3 లక్షల క్యూసెక్కులు ఉండగా.. 41 గేట్ల ద్వారా 2.90 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 9.65 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటి నిల్వ 7.62 టీఎంసీలు ఉన్నది. శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల, తుంగభద్ర ప్రాజెక్టు నుంచి వస్తున్నవరద అధికమైంది. ఆప్రాజెక్టుకు సుమారు 4 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరుతున్నది. ఐదు రోజుల్లో దాదాపు 50 టీఎంసీ నీరు ప్రాజెక్టులోకి వచ్చింది.నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది. పూర్తి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 509 అడుగులుగా ఉన్నది.

భద్రాచలం వద్ద తగ్గుముఖం పడుతున్న వరద ఉధృతి

ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టడం వల్ల భద్రాచలం వద్ద వరద ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. 52 అడుగుల వద్ద నిలకడగా ప్రవాహం ఉన్నందున మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించుకున్నారు. రెండో ప్రమాద హెచ్చరికను మాత్రం కొనసాగిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికార యంత్రాంగం అప్రమత్తం చేస్తున్నది. మరో మూడు రోజుల పాటు వర్ష సూచన ఉన్నందున నదీ తీర ప్రాంతం వైపు వెళ్లవద్దని సూచిస్తున్నారు. ప్రస్తుతానికి వస్తున్న వరదతో దుమ్ముపేట, భద్రాచలం, చెర్ల మండలాల్లోని కొన్ని గ్రామాలు ముంపు బారిన పడ్డాయి.

Raju

Raju

Writer
    Next Story