ఎనిమిది నెలల్లో సీతారామ ప్రాజెక్టును కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తి చేసిందా?: హరీశ్‌

ఇతరులు చేసిన పనిని తమ ఘనతా చెప్పుకునే వారిని పరాన్న జీవులని అంటారని సీతారామ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్‌ నేతలు అలాగే ప్రవర్తిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.

ఎనిమిది నెలల్లో సీతారామ ప్రాజెక్టును కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తి చేసిందా?: హరీశ్‌
X

సీతారామ ఎత్తిపోతల పథకం కేసీఆర్‌కు ఇష్టమైన ప్రాజెక్టు. ఖమ్మం జిల్లాకు కరువు బాధలు తీర్చాలని అందుకోసం ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ ప్రాజెక్టు కట్టాలని కేసీఆర్‌ సంకల్పించారని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రిబ్బన్‌ కటింగ్‌ అవకాశం వచ్చిందని, ప్రాజెక్టే తాముకట్టినట్టు కటింగ్‌ ఇచ్చే ప్రయత్నం కోసం మంత్రులు పోటీపడి పర్యటనలు చేస్తున్నారని మాజీ మంత్రి ఎద్దేవా చేశారు. ఇతరులు చేసిన పనిని తమ ఘనతా చెప్పుకునే వారిని పరాన్న జీవులని అంటారని కాంగ్రెస్‌ నేతలు అలాగే ప్రవర్తిస్తున్నారు.

ఒక ప్రాజెక్టు కట్టాలంటే సర్వే జరగాలని, డీపీఆర్‌ తయారు కావాలి, భూసేకరణ జరగాలి, టెండర్ల ప్రక్రియ జరగాలి. నిర్మాణానికి నిధులు సమకూర్చాలి. ఇవన్నీ పూర్తికావాలంటే కొన్నేండ్లు పడుతుంది. అలాంటిది 8 నెలల్లో సీతారామ ప్రాజెక్టును కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తి చేసిందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ మంత్రుల ప్రవర్తన చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని విమర్శించారు.ఖమ్మం జిల్లా ముగ్గురు మంత్రుల పోటీ నడుస్తున్నది. ఒకమంత్రి వెళ్లగానే తెల్లారి మరో మంత్రి వెళ్తారు. ఈ ముగ్గురు మంత్రులు ఎలా వెళ్తారని నీటిపారుదల శాఖ మంత్రి వెళ్తారు. నీళ్ల మంత్రి ఎలా వెళ్తారని ఇప్పుడు సీఎం వెళ్తారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ఇది నడుస్తున్నదని హరీశ్‌ సెటైర్లు వేశారు.

మొన్న అసెంబ్లీలో చెప్పాం. మేము నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్షలు నిర్వహించి, ఫలితాలు విడుదల చేసి, కొన్ని చోట్ల ఫిజికల్‌, మెడికల్‌ టెస్టులు కూడా చేసి.. సాంకేతిపరమైన కారణాలతో , కోర్టు కేసులతో, ఎన్నికల కోడ్‌ వల్ల అపాయింట్‌మెంట్‌ ఆర్డర్స్‌ మాత్రమే పెండింగ్‌లో ఉండే. అపాయింట్‌మెంట్స్‌ ఆర్డర్స్‌ ఇచ్చే అవకాశం వస్తే ఉద్యోగాలే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిందని ప్రచారం చేసుకున్నట్లే సీతారామ ప్రాజెక్టు కథ కూడా అలాగే ఉన్నది. తాము చేసిన ప్రతి మంచి పని కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిందని చెప్పుకుంటున్నారు. కేసీఆర్‌ కాకుండా సీతారామ ప్రాజెక్టును వేరే వారు రూపకల్పన చేసి ఉంటే అంత బాగా ఉండేదా? అని నిలదీశారు. కాంగ్రెస్‌ ఖమ్మం జిల్లాకు చుక్క నీరు కూడా ఇవ్వలేదని,ఆ జిల్లాలో రెండు పంటలు పండే విధంగా వందేళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్‌ రూపకల్పన చేశారన్నారు.

సీతారామ ప్రాజెక్టు ను అడ్డంకులు సృష్టించేందుకు కాంగ్రెస్ నేతలు కోర్టులకు వెళ్లారు. ఈ విషయాన్ని అపుడు బీఆర్ఎస్ ప్రభుత్వం లో మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వర్ రావే స్వయంగా చెప్పారని.. నాడు ఆయన చేసిన వీడియో ప్రసంగాన్ని ఈ సందర్భంగా మీడియాకు వినిపించారు. సీతారామ ప్రాజెక్టును ఘనత కేసీఆర్ ది కాదని తుమ్మల గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పగలరా ?అని ప్రశ్నించారు.

కేసీఆర్ కలల ప్రాజెక్టు సీతారామ ప్రాజెక్టు అని. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా ఖమ్మం కు గోదావరి జలాలు ఇవ్వాలనే ప్రయత్నం చేయలేదన్నారు. ఖమ్మం ను రెండు పంటలు పంటే జిల్లాగా మార్చాలని సీతారామ ప్రాజెక్టును కేసీఆర్ సంకల్పించారు.ఇందిరా ,రాజీవ్ సాగర్ ల ద్వారా 3 వేల క్యూసెక్కుల నీళ్లను ప్రతిపాదిస్తే కేసీఆర్ సీతారామ ప్రాజెక్టు ద్వారా తొమ్మిది వేల క్యూసెక్కుల నీళ్లు తీసుకునేలా ప్లాన్ చేశారని తెలిపారు. మా ఘనత ను వాళ్ళ ఘనత గా చెప్పుకుంటున్న వారిని పరాన్న జీవులు అంటారు .బీఆర్ఎస్ హయంలోనే సీతారామ ప్రాజెక్టు 90 శాతం పూర్తయ్యింది. మెయిన్ కెనాల్ లో ఎనిమిది ప్యాకేజీలు ఉంటె ఐదు ప్యాకేజీలు బీ ఆర్ ఎస్ ప్రభుత్వ హయం లోనే పూర్తయ్యాయని వివరించారు. సీతారామ ప్రాజెక్టు కు హైడ్రాలజీ ,అంతర్రాష్ట్ర అనుమతులు బీఆర్ఎస్ ప్రభుత్వ హయం లోనే వచ్చాయి. కానీ నీళ్ల మంత్రి ఉత్తమ్ సీతారామ ప్రాజెక్టు కు అనుమతులు తామే తీసుకువచ్చినట్టు అబద్దాలు మాట్లాడుతున్నారు ..ఇంత దిగజారి మాట్లాడాలా ? అని ప్రశ్నించారు.

జూలై 2023 లోనే 67 టీఎంసీలకు కేంద్ర జలసంఘం అనుమతి ఇచ్చింది. 2005 నుంచి తొమ్మిదేళ్ల పాటు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరా రాజీవ్ సాగర్ లకు ఒక్క అనుమతి తీసుకురాలేదు. డిప్యూటీ స్పీకర్ గా ఉన్నపుడు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా ప్రాజెక్టులకు సంబంధించి ఏ ప్రయత్నం చేయలేదని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో ప్రతి ఎకరాకు రెండు పంటలకు నీళ్లు అందేలా సీతారామ ప్రాజెక్టు కు కేసీఆర్ రూపకల్పన చేశారు జూన్ లోనే ఖమ్మం జిల్లాలో నాట్లు పడేలా సీతారామ ప్రాజెక్టు ను రూపొందించాం. 3 వేల చెరువులను నింపేలాఈ ప్రాజెక్టు ను డిజైన్ చేశామని చెప్పారు. పాలేరు కు సీతారామ ప్రాజెక్టును కలపడం వల్ల ఖమ్మం పట్టణానికి తాగు నీటి సమస్య లేకుండా పోతుంది. కేసీఆర్ స్వయంగా ఎన్నో సార్లు ఢిల్లీ వెళ్లి సీతారామ ప్రాజెక్టు కు అనుమతులు సాధించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో ప్రాజెక్టు కు అటవీ శాఖ అనుమతులు సాధించ లేదన్నారు. సాగర్ ఆయకట్టు 3 .4 లక్షల ఎకరాలకు కూడా సీతారామ ప్రాజెక్టు ద్వారా నీరందించేలా కేసీఆర్ పూనుకున్నారు. చిన్న లిఫ్ట్ పెట్టుకుంటే పాలేరు బ్యాక్ వాటర్స్ ద్వారా నల్లగొండ జిల్లాకు సీతారామ ప్రాజెక్టు తో గోదావరి జలాలను అందించేటట్టు జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. ఎంతోముందు చూపు తో కేసీఆర్ ఈ సీతారామ ప్రాజెక్టు ను ప్రతిపాదించారు .సీతారామ ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహిస్తామని చెప్పారు.

Raju

Raju

Writer
    Next Story