ఉన్నోళ్లను తరిమేసి.. బ్యాక్‌ డోర్‌ లో మళ్లీ రిక్రూట్‌మెంట్‌

గురుకులాల్లో పార్ట్‌ టైం, గెస్ట్‌, హానరోరియం ఫ్యాకల్టీ రాత్రికి రాత్రే తొలగింపు

ఉన్నోళ్లను తరిమేసి.. బ్యాక్‌ డోర్‌ లో మళ్లీ రిక్రూట్‌మెంట్‌
X

గురుకులాల్లో ఏళ్లకేళ్లుగా పని చేస్తున్న పార్ట్‌ టైం, గెస్ట్‌, హానరోరియం ఫ్యాకల్టీని రాత్రికి రాత్రే తరిమేసిన అధికారులు దొడ్డి దారిన కొత్తవాళ్లను రిక్రూట్‌ చేస్తున్నారు. విద్యాసంవత్సరం మధ్యలో ఏళ్లకేళ్లుగా పని చేస్తున్న వారిని ఒక్క మెమోతో తొలగించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని గురుకులాల్లోనూ ఇదే తరహాలో పార్ట్‌ టైం ఫ్యాకల్టీని తొలగించి ఇంటికి పంపారు. గురుకుల రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా కొత్త టీచింగ్‌ ఫ్యాకల్టీని రిక్రూట్‌ చేసిన నేపథ్యంలో అన్ని గురుకులాల ప్రిన్సిపాల్స్‌ తమ విద్యాసంస్థలో పని చేస్తున్న నాన్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌ టీచింగ్‌ ఫ్యాకల్టీని తొలగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అన్ని గురకులాల్లో కలిపి 3 వేల వరకు టీచింగ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ పూర్తియినా అనేక పోస్టులు బ్యాక్‌ లాగ్‌ లో పడిపోయాయి. ఆయా గురుకులాల సెక్రటరీలు పార్ట్‌ టైం, గెస్ట్‌, హానరోరియం ఫ్యాకల్టీని తొలగించాలని ఉత్తర్వులు ఇవ్వడంతో కొందరు అధికారులు దీనిని వరంగా మార్చుకున్నారు. ఉన్నోళ్లను తరిమేసి దొడ్డిదారిన కొత్త వాళ్లను నియమిస్తున్నారు. ఇలా ఒక్కో గెస్ట్‌ ఫ్యాకల్టీకి ఇచ్చే జీతాన్ని బట్టి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారని బహిరంగంగానే ఆరోపణలు ఉన్నాయి. కొందరు కాంగ్రెస్‌ నాయకులు, గ్రాడ్యుయేట్‌, టీచర్ల ఎమ్మెల్సీల కోసం పోటీ పడుతున్న హస్తం నేతలు తెరవెనుక నుంచి ఈ దందా సాగిస్తున్నారు. గురుకులాల్లోని జోనల్‌, రీజినల్‌ స్థాయి ఆఫీసర్లతో కలిసి ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు.



ఆయా గురుకులాల్లో సబ్జెక్ట్ ఫ్యాకల్టీ నియామకాల కోసం టీచర్‌ ఉద్యోగాల కోసం పోటీ పడేవారికి డెమో క్లాసులు నిర్వహిస్తున్నారు. డెమోలో బాగా క్లాస్‌ చెప్పిన వారికి కాకుండా ఎవరు డబ్బులిస్తే వారికే పార్ట్‌ టైం, గెస్ట్‌ టీచర్లుగా అవకాశమిస్తున్నారని చెప్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వెల్ఫేర్‌ శాఖలకు సీఎం రేవంత్‌ రెడ్డి మంత్రిగా ఉన్నారు. బీసీ వెల్ఫేర్‌ మంత్రిగా పొన్నం ప్రభాకర్‌ ఉన్నారు. మంగళవారం ఒక్కరోజే ఎస్సీ గురుకులాల్లో వెయ్యి మంది గెస్ట్‌ లెక్చరర్లను ప్రభుత్వం తొలగించింది. వీళ్లందరికీ మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. అన్ని గురుకులాల్లో నిర్వహిస్తున్న సెంటర్‌ ఎక్సలెన్స్‌ లలో పని చేస్తున్న గెస్ట్‌ లెక్చరర్లను ఇలాగే తొలగించారు. వారికి మూడు నెలల జీతాలు ఇవ్వలేదు. సీఈవోలను పూర్తిగా మూసివేసే కుట్రలో భాగంగా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం మొదట సబ్జెక్ట్‌ ఎక్స్‌ పర్ట్‌ లకు ఎసరు పెట్టింది. వాళ్లకు జీతాలు ఇవ్వకుండా వేధింపులకు గురి చేసింది. మైనార్టీ వెల్ఫేర్‌ గురుకులాల్లోని సీవోఈలన్నింటినీ ఒకే చోటికి చేర్చి క్రమేణ మూసేసే కుట్రకు తెరతీసింది. ఒకేసారి మూసివేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే ముందుగా మెర్జర్‌ అని చెప్తోందని ఆయా గురుకులాలకు చెందిన ముఖ్యులే చెప్తున్నారు. సబ్జ్‌ ఎక్స్‌పర్ట్‌ ల స్థానంలో రెగ్యులర్‌ లెక్చరర్లను డెప్యూటేషన్‌ పై నియమిస్తామని ప్రభుత్వం చెప్తోంది. తద్వారా గురుకులాలను, సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ లను నిర్వీర్యం చేయాలని చూస్తోంది. ఏళ్లకేళ్లుగా పని చేస్తున్న తమను తొలగించడంపై రాష్ట్ర వ్యాప్తంగా గెస్ట్‌ టీచర్లు, లెక్చరర్లు ఆందోళనకు దిగారు. తమను మధ్యలో తొలగించి లంచాలు తీసుకొని వేరే వాళ్లను నియమించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే ఈ తొలగింపులు జరుగుతున్నాయని గురుకులాల అధికారులు చెప్తున్నారు. అంటే ఒక ఎజెండాలో భాగంగానే ఈ తతంగం సాగుతున్నట్టుగా అర్థమవుతోంది.

Next Story