ఉన్న రేషన్‌ కార్డులనే ఊడగొడ్తరా?

కొత్త కార్డుల జారీకి సక్సేనా కమిటీ సిఫార్సులు అమలు చేస్తామన్న ప్రభుత్వం.. అదే జరిగితే కొత్త కార్డులు ఇచ్చుడు కాదు ఉన్న కార్డులే తీసేయాల్సిన పరిస్థితి

ఉన్న రేషన్‌ కార్డులనే ఊడగొడ్తరా?
X

కాంగ్రెస్‌ ప్రభుత్వం త్వరలోనే కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వబోతుందని ఆశ పడుతున్న వారికి ఇది చేదు వార్తే. కొత్త రేషన్‌ కార్డులను జారీ చేయడానికి విధివిధానాలు ఖరారు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నేతృత్వంలో కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేసింది. మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిలతో కూడిన ఈ సబ్‌ కమిటీ గత శనివారం సెక్రటేరియట్‌ లో సమావేశమైంది. ఈ సందర్భంగా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కొత్త కార్డుల జారీకి విధివిధానాలను వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి రూ.1.50 లక్షల ఆదాయం, మూడున్నర ఎకరాల నీటి ఆధారం ఉన్న భూమి, ఏడున్నర ఎకరాల చెలక భూమి ఉన్నోళ్లు.. పట్టణ ప్రాంతాల్లో ఏడాదికి రూ.2 లక్షల వరకు ఆదాయం ఉన్నోళ్లు అర్హులని తెలిపారు. కొత్త కార్డుల జారీకి సక్సేనా కమిటీ సిఫార్సులను కూడా పరిగణలోకి తీసుకుంటామని ప్రకటించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయాలు తీసుకొని తుది గైడ్‌ లైన్స్‌ జారీ చేస్తామన్నారు. రేషన్‌ కార్డులకు పెట్టిన ఆదాయ పరిమితి నిబంధనతోనే వేలాది కుటుంబాలు కొత్త కార్డులు పొందే అవకాశాన్ని కోల్పోతాయి. ఇక సక్సేనా కమిటీ సిఫార్సులను పరిగణలోకి తీసుకుంటే కొత్తగా రేషన్‌ కార్డులు ఇచ్చే అర్హత ఉన్న కుటుంబాలు రాష్ట్రంలో ఒక్క శాతం కూడా ఉంటాయో లేదో తెలియని పరిస్థితి.

ఇంతకీ సక్సేనా కమిటీ ఏం చెప్పింది

కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ 2008 ఆగస్టు 12న డాక్టర్‌ ఎన్‌సీ సక్సేనా నేతృత్వంలో గ్రామీణ ప్రాంతాల్లోని పేదరికాన్ని అంచనా వేయడానికి కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ 2009 ఆగస్టు 21న తన నివేదిక అందజేసింది. పేదరికాన్ని గుర్తించేందుకు బీపీఎల్‌ సెన్సెస్‌ ను కాకుండా ఈ కమిటీ కొత్త పద్ధతి ప్రతిపాదించింది. గ్రామీణ ప్రాంతాల్లోని జనాభాను మూడు రకాలుగా విభజించింది.

ఆటోమేటికల్లీ ఎక్స్‌క్లూడెడ్‌ : భూ యజమానులు, ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లించేవారు. వాహనాలు, యంత్రాలు ఉన్నవాళ్లు సహా 13 రకాల ఆస్తులు ఉన్న వారిని పేదవారి జాబితా నుంచి ఆటోమేటిక్‌ గా తొలగించాలని ఈ క్లాసిఫికేషన్‌ సూచిస్తుంది.

ఆటోమేటికల్లీ ఇంక్లూడెడ్‌ : ఆదిమ గిరిజనులు, మహా దళిత గ్రూపులు, ఒంటరి మహిళలు సహా ఇంకో రెండు రకాల వారిని ఆటోమేటిక్‌ గా పేదల జాబితాలో చేర్చాలని ఈ కేటగిరి నిర్దేశిస్తుంది.

అదర్స్‌ : మరో ఏడు రకాల వెనుకబాటు తనాన్ని ఆధారంగా చేసుకొని ఈ క్లాసిఫికేషన్‌ ను నిర్ణయించారు.

ఆటోమేటికల్లీ ఇంక్లూడెడ్‌ జాబితాలో చేర్చడానికి అర్హతలు

  • ఒక్క గది మాత్రమే ఉన్న కుటుంబాలు
  • 15 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న మగవాళ్లు లేని కుటుంబాలు
  • మహిళ యజమానిగా ఉన్న కుటుంబాలు
  • వికలాంగులు ఉన్న కుటుంబాలు
  • సంపాదించే వాళ్లు లేని కుటుంబాలు
  • 25 ఏళ్ల వయసుకు పైబడిన ఎస్సీ, ఎస్టీలు ఉన్న కుటుంబాలు
  • భూమి లేని కుటుంబాలు

ఆటోమేటికల్లీ ఎక్స్‌క్లూజన్‌ ప్రకారం పేదల నుంచి తొలగించే వాళ్లు..

భూములు, ఉద్యోగం, ఆదాయ పన్ను చెల్లించేవారు, వాహనాలు, యంత్రాలు ఉన్న వారితో పాటు ఫ్రిజ్‌, టెలిఫోన్‌, వాషింగ్‌ మెషిన్‌, ఏసీ, కంప్యూటర్‌, ల్యాప్‌ ట్యాప్‌, ఇంటర్నెట్‌, నాలుగు గదుల ఇల్లు ఉన్న వాళ్లు.

దేశంలో ఉపాధి హామీ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో దినసరి కూలి మొత్తం రూ.150 అంతకన్నా ఎక్కువగానే ఉంది. ఈ లెక్కన ఉపాధి హామీ పనికి వెళ్లే వారిని పేదలుగా గుర్తించడానికి సక్సేనా కమిటీ సిఫార్పులు అంగీకరించబోవు. ఇతర కూలి పనులు చేసుకునే వారిని సైతం పేదల జాబితా నుంచి తొలగించక తప్పదు. ఇప్పుడు ఇంటర్నెట్‌ అందుబాటులో లేని ఇండ్లు తెలంగాణలో ఒక్క శాతం కూడా లేవు. పిల్లల చదువుల కోసం కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌ లు కొనడం తప్పనిసరి. రోజూ కూలి పనికి వెళ్లే వాళ్లకు టూ వీలర్‌ అవసరమే. ఫ్రిజ్‌ ఇతర ఎలక్ట్రానిక్‌ ఉప కరణాలు ఇప్పుడు రొటీన్‌ లైఫ్‌ లో భాగమయ్యాయి. ఈ లెక్కన రాష్ట్రంలో రేషన్‌ కార్డులు పొందడానికి అర్హత ఉన్న వాళ్లు ఎంత మంది లెక్కతేలుతారు. ఇప్పటికే రేషన్‌ కార్డులున్న 90 లక్షల మందిలో ఎంతమంది సక్సేనా కమిటీ సిఫార్సుల ప్రకారం ఫిట్‌ అవుతారు. ఆదాయ పరిమితితోనే రేషన్‌ కార్డుల అర్హుల జాబితా నుంచి ఎక్కువ మందిని బోర్డర్‌ లైన్‌ అవతలికి తరిమేసే కుట్ర చేస్తోన్న ప్రభుత్వం సక్సేనా కమిటీ సిఫార్సుల పేరు చెప్పి ఉన్న రేషన్‌ కార్డులను ఊడగొట్టే కుట్రకు తెరతీసిందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఉన్న రేషన్‌ కార్డుల స్థానంలో కొత్త స్వైపింగ్‌ కార్డులిస్తామని చెప్పడం వెనుక కూడా ఇదే పన్నాగం ఉందా అనే సందేహాలు వినవస్తున్నాయి.


సక్సేనా కమిటీ సిఫార్సులపై లోక్‌సభలో ఎంపీ అడిగిన ప్రశ్నకు గతంలో కేంద్రం ఇచ్చిన సమాధానం కాపీ కోసం ఈ లింక్‌ క్లిక్‌ చేయండి

https://www.teluguscribe.com/pdf_upload/saxena-committee-847656.pdf


ఈడబ్ల్యూఎస్‌కు రూ.8 లక్షలు.. రేషన్‌ కార్డులకు రూ.లక్షన్నర!? స్టోరీ చదవడానికి ఈ లింక్‌ క్లిక్‌ చేయండి

Next Story